డిసెంబర్ 31న పుడితే జనవరి 1కే రెండేళ్లు.. ఆ దేశంలో వయసు లెక్కింపులో వింత పద్ధతికి ముగింపు..!

ABN , First Publish Date - 2022-12-09T17:11:07+05:30 IST

ఆ దేశ పార్లమెంట్ గురువారం కీలక చట్టానికి ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆ దేశంలోని ప్రతి పౌరుడి వయసు ఏడాది మేర తగ్గనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి..

డిసెంబర్ 31న పుడితే జనవరి 1కే రెండేళ్లు.. ఆ దేశంలో వయసు లెక్కింపులో వింత పద్ధతికి ముగింపు..!

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియా పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా కొరియన్ ప్రజలను ఇబ్బంది పెడుతున్న చట్టాన్ని బుట్టదాఖలు చేసింది. ఎన్నికల సందర్భంగా ‘పీపుల్ పవర్ పార్టీ’ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. సౌత్ కొరియా అధ్యక్షుడు, ‘పీపుల్ పవర్ పార్టీ’ నేత యూన్ సుక్-యేల్ నేతృత్వంలో ఆ దేశ పార్లమెంట్ గురువారం కీలక చట్టానికి ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆ దేశంలోని ప్రతి పౌరుడి వయసు ఏడాది మేర తగ్గనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా మనం ఒక వ్యక్తి వయసును ఎలా లెక్కిస్తాం. బిడ్డ పుట్టిన నాటి నుంచి 365 రోజులు గడిచిన తర్వాతే.. సదరు బిడ్డకు ఏడాది వయసు వచ్చినట్టు భావిస్తాం. మనమే కాదు దాదాపు ప్రపంచ దేశాలు అన్నీ ఇదే పద్ధతిని అనుసరించి వయసులను లెక్కగడుతుంది. కానీ సౌత్ కొరియాలో మాత్రం ఈ పద్ధతితోపాటు మరో రెండు విధానాలు కూడా అమలులో ఉన్నాయి. ఆ పద్ధతులే సౌత్ కొరియన్ ప్రజలను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇక అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న మొదటి పద్ధతిని ‘కొరియన్ ఏజ్ సిస్టం’. ఈ పద్ధతిలో ప్రజలు బిడ్డ పుట్టిన వెంటనే.. సదరు బిడ్డకు ఏడాది వయసు వచ్చినట్టు పరిగణిస్తారు. ఆ తర్వాత కొత్త ఏడాది మొదలవగానే.. అదే బిడ్డకు రెండేళ్లు నిండినట్టు లెక్కగడతారు. అంటే.. ఉదహరణకు డిసెంబర్ 31న ‘X’ జన్మించింది అనుకుంటే.. పుట్టడంతోనే ఆ ఎక్స్ వయసును ఏడాదిగా అక్కడి ప్రజలు పరిగణిస్తారు. ఆ తర్వాత జనవరి 1న కొత్త సంవత్సరం ఆరంభం అవడంతోనే ‘X’ వయసు రెండేళ్లుగా లెక్కిస్తారు.

ఇక మరొక పద్ధతిలో పుట్టిన సమయానికి బిడ్డ వయసు సున్నాగా తీసుకుంటారు. నూతన సంవత్సరం ఆరంభం అవడంతోనే సదరు బిడ్డ వయసు ఏడాదిగా లెక్కిస్తారు. ఇంతకు ముందు ఉదహరణనే పరిశీలిస్తే.. డిసెంబర్ 31న పుట్టిన ‘X’ వయసు ఆ రోజుకి సున్నానే. కానీ జనవరి 1వ తేదీ రావడం(కొత్త సంవత్సరం)తోనే ‘X’ వయసు ఏడాదిగా పరిగణిస్తారు. అంటే పై రెండు పద్ధతుల్లో పుట్టిన రోజు, నెలతో సంబంధం లేకుండా నూతన సంవత్సరమే అక్కడి పిల్లల వయసును నిర్ధారిస్తుందన్న మాట. అయితే ఈ పద్థతుల వల్ల సౌత్ కొరియన్ ప్రజలకు అంతర్జాతీయంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా పార్లమెంట్ ఈ రెండు పద్ధతులను బుట్టదాఖలు చేస్తూ చట్టాన్ని రూపొందించింది. దీంతో 2023 జూన్ నుంచి పై పద్ధతులు కనుమరుగు కానున్నాయి. ఇకపై అంతర్జాతీయంగా ఆమోదయోగ్యంగా ఉన్న పద్ధతిలోనే ప్రజల వయసును నిర్ధారించాలని పేర్కొంటూ చట్టాన్ని చేసింది. ‘కొరియన్ ఏజ్ సిస్టం’ కనుమరుగు కానున్న నేపథ్యంలో అక్కడి పౌరుల వయసు ఏడాది మేర తగ్గనుంది.

Updated Date - 2022-12-09T17:15:52+05:30 IST