గర్భవతిని కాటేసిన పాము.. పెళ్లయిన మూడేళ్లకు సంతానం కలగబోతోందని ఆనందంలో తేలియాడుతుంటే చివరికి జరిగిన ఘోరమిదీ..!

ABN , First Publish Date - 2022-09-25T17:51:06+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పరిధిలోగల బరాగావ్ ప్రాంతంలో...

గర్భవతిని కాటేసిన పాము.. పెళ్లయిన మూడేళ్లకు సంతానం కలగబోతోందని ఆనందంలో తేలియాడుతుంటే చివరికి జరిగిన ఘోరమిదీ..!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పరిధిలోగల బరాగావ్ ప్రాంతంలో ఓ గర్భిణి పాముకాటుకు బలయ్యింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె భర్త గుజరాత్ నుండి ఇంటికి వస్తాడని ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. బరాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనోరా గ్రామానికి చెందిన రాజు చౌహాన్‌కు జౌన్‌పూర్ జిల్లాకు చెందిన మనీషా చౌహాన్ (30)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. రాజు చౌహాన్ గుజరాత్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 


కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మనీషా గర్భవతి. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేసిన తరువాత మనీషా పాత్రలు కడగడానికి ఉపక్రమించింది. అదే సమయంలో ఆమెను ఒక విషసర్పం కాటేసింది. మనీషా కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె భర్త రాజుకు తెలియజేసిన అనంతరం కుటుంబ సభ్యులు మనీషా మృతదేహంతో ఇంటికి చేరుకున్నారు. శనివారం, గ్రామస్తుల సలహా మేరకు, కుటుంబ సభ్యులు మనీషా మృతదేహాన్ని ఘాజీపూర్‌లోని ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లారు, అయితే అక్కడ కూడా ఆమె చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి భర్త రాజు గుజరాత్‌ నుంచి ఇక్కడకు రాగానే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.  

Read more