Silk Smitha: ఎగసి పడిన జీవితం ఆమెది

ABN , First Publish Date - 2022-12-02T16:54:11+05:30 IST

కొంతమంది జీవిత కధలను పరిశీలిస్తే ఇది నిజమేనా అనిపిస్తుంది . ఇంతలో ఇంత మార్పు సాధ్యమేనా అని కూడా అనిపిస్తుంది. కానీ సిల్క్ స్మిత వంటి కొంతమంది తారల గురించి విన్నప్పుడు చిత్ర పరిశ్రమలో ఎలాంటి విచిత్రమైనా జరగవచ్చు అనిపించక మానదు. స్మిత అసలు పేరు విజయలక్ష్మి.

Silk Smitha: ఎగసి పడిన జీవితం ఆమెది

కొంతమంది జీవిత కధలను పరిశీలిస్తే ఇది నిజమేనా అనిపిస్తుంది . ఇంతలో ఇంత మార్పు సాధ్యమేనా అని కూడా అనిపిస్తుంది. కానీ సిల్క్ స్మిత (Slik smitha)వంటి కొంతమంది తారల గురించి విన్నప్పుడు చిత్ర పరిశ్రమలో ఎలాంటి విచిత్రమైనా జరగవచ్చు అనిపించక మానదు. స్మిత అసలు పేరు విజయలక్ష్మి(Vijaya Lakshmi). ఏలూరు దగ్గరున్న కొవ్వలి స్వగ్రామం. 1960 డిసెంబర్ 2 న నిరుపేద రైతు కుటుంబం లో శ్రీరామమూర్తి , నరసమ్మ దంపతులకు జన్మించింది. దగ్గర బంధువు అన్నపూర్ణమ్మ దత్తత తీసుకోవడంతో విజయలక్ష్మి మకాం ఏలూరుకు మారింది. చిన్నతనం నుంచీ విజయలక్ష్మికి సినిమాలంటే తెగపిచ్చి. అందుకే  సినిమాల్లో రాణించాలని కోరికతో, 18 ఏళ్ల వయసులో తల్లిని వెంటబెట్టుకొని మద్రాస్ చేరుకొంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ చాలామంది నిర్మాతలను కలసి అభ్యర్ధించింది. అయితే ఈ నిర్మాతకీ ఆమెలో నిద్రాణంగా ఉన్న నటి కనిపించలేదు. నీ మొహంలో గ్లామర్ లేదన్నారు. నీకు వేషాలు ఇస్తే ఇక అంతే సంగతులు అన్నవారూ ఉన్నారు . మొత్తానికి అందరు కలసి ఆమె నటిగా పనికిరాదని తేల్చేసారు. మరొకరైతే ఆ అవమానాన్ని తట్టుకోలేక సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోయేవారు. కానీ విజయ అలాంటి వ్యక్తి కాదు. చావో రేవో మద్రాసులోనే అని గట్టిగా అనుకుని తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. (silk Smitha death)

 

నిజం చెప్పాలంటే హీరోయిన్ కు కావాల్సిన అందచందాలు అప్పట్లో విజయలక్ష్మికి లేవు. ఆమె నల్లగా, బొద్దుగా ఉండేది . పైగా మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. కానీ ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉండేది. హీరోయిన్ కు కావాల్సిన నాజూకు లక్షణాలు విజయలక్ష్మితో లేకపోవడం, నల్లగా ఉండడం ఆమెకు మైనస్ అయింది. అయినా ప్రయత్నాలు ఆపలేదు. ఇంట్లో ఊరికే ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక జూనియర్ ఆర్టిస్ట్ గా నటించడానికి   సిద్ధపడింది. తన పేరును విజయగా కుదించుకొని కొన్ని చిత్రాల్లో గుంపులో గోవిందా వేషాలు వేసింది. నీకు ఇంతకన్నా గొప్ప వేషాలు ఎవరు ఇస్తారు అనే వారి మాటలు పట్టించుకునేది కాదు. భవిష్యతు మీద మాత్రం ఎంతో ఆశతో ఉండేది. సరిగ్గా అలాంటి సమయంలోనే మలయాళంలో నటించే అవకాశం విజయకు వచ్చింది . మలయాళ దర్శక నిర్మాతలకు భాషతో, టాలెంట్తో పనిలేదు. అందాలు ఆరబోయడానికి వెనుకాడని యువతులు కావాలి. అంతే..  పూర్తిగా సెక్స్ అప్పీల్ ఉన్న ఆ పాత్ర పోషించడానికి విజయ మొదట తటపటాయించింది . తెలుగులో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి. అంతా నటనే అయినప్పుడు పరిధులు, హద్దులు ఎందుకు అనుకుని విజయ తెగించేసింది. విలువలతో  పాటు వలువలు  వదిలేసింది. అంతే తొలి మలయాళ చిత్రం తోనే విజయ అందరినీ ఆకట్టుకొంది. తమిళ నిర్మాతల దృష్టి కూడా ఆమెమీద పడింది. 

Silk-smitha-2.jpg--3.jpg

తమిళంలో విజయ నటించిన తొలి చిత్రం వండి చక్రం. ఆ సినిమాతో విజయ పేరే కాదు ఆమె జాతకం కూడా మారిపోయింది . సిల్క్ స్మితగా సెక్సీ డాన్స్ లతో ముందుకు వచ్చిన విజయను చూసి ప్రేక్షకులు పిచ్చెక్కి పోయారు . వండి చక్రం సినిమాను తెలుగులో ఘరానా గంగులు పేరుతొ రీమేక్ చేసారు . శోభన్ బాబు హీరో.  తమిళంలో చేసిన పాత్రను తెలుగులో కూడా స్మిత పోషించింది. నిషా కళ్ళతో సెక్సీగా  కనిపించిన స్మితకు ఆడియన్స్ బ్రహ్మ రధమ్ పట్టారు. ఇక అప్పటినుంచి హీరో ఎవరైనా సినిమాలో స్మిత డాన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే.  అది ప్రేక్షకుల, డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ కావడంతో నిర్మాతలు నోరెత్తకుండా పాటించేవారు .

ఒకప్పుడు స్మిత నిర్మాతల చుట్టూ తిరిగింది. చిన్న వేషమైనా ఇవ్వండి ప్లీజ్ అని బతిమాలింది  కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. నటిగా ఆమె ఎదిగిన తర్వాత ఆ నిర్మాతలే ఆమె చుట్టూ తిరగడం ప్రారంభించారు. కేవలం ఓ డాన్స్ సీన్ కోసం స్మిత 50000 రూపాయలు డిమాండ్ చేసినా అంతా రేటా అని ఎవరూ వెనక్కి పోలేదు మాకు కాల్షీట్స్ ఎప్పుడు ఇస్తావు అని మాత్రమే అడగడం స్మితకు ఉన్న డిమాండ్ కు ఒక నిదర్సనమ్ . 1981 నుండి 1996  వరకు స్మిత కెరీర్ ఉజ్వలంగా వెలిగిపోయింది. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో 450 కి పైగా చిత్రాల్లో నటించింది కాదు కాదు నర్తించింది. ఇంత సుదీర్ఘమైన కెరీర్ కలిగిన లేడీ డాన్సర్ మరెవరు లేరు.

నృత్య తార గానే పరిమితం కాకుండా కొన్ని చిత్రాల్లో నటనకు ప్రాధాన్యం కలిగిన పాత్రలు పోషించింది స్మిత. అంతేకాదు వీరవిహారం, ప్రేమించి చూడు చిత్రాలను సొంతంగా నిర్మించి చేతులు కాల్చుకొంది. అనుకొన్నది సాధించి, హాయిగా సినీ జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో డాక్టర్ రాధాకృష్ణ ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. కెరీర్ పరంగా నీకు అండగా ఉంటానని చెప్పి మెల్లిగా స్మితను లోబరచుకొన్నాడు .  అతని తీయని మాటలకూ ఆమె కరిగిపోయింది.  రాధాకృష్ణ చెప్పినట్లు నడుచుకోవడం ప్రారంభించింది ఆమె వ్యవహారాలన్నీ చక్కపెట్టేవాడు. అతను ఎంత చెబితే అంత. ఎంత డబ్బు వస్తుందో, ఎంత పోతోందో ఏమి స్మిత పట్టించుకునేది కాదు. అవన్నీ చూసుకోవడాని రాధాకృష్ణ ఉన్నాడు కదా అనేది. అతనికి అప్పటికే పెళ్లి అయింది. పిల్లలు ఉన్నారు. అయినా రాధాకృష్ణను గాఢంగా ప్రేమించి పెళ్లి చూసుకోవడానికి సిద్ధపడింది . జెమినీ గణేశన్ ను నమ్మి మహానటి సావిత్రి ఎలా మోసపోయిందో రాధాకృష్ణను నమ్మి స్మిత ఆలా మోసపోయింది . స్మిత పూర్తిగా తన చేతుల్లోకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ మరింత విజృభించాడు. ఆమె కు ఆంక్షలు విధించాడు. తల్లిని, తమ్ముడిని ఆమె దగ్గరకు రాకుండా చేసాడు. ఇవన్నీ చూసి మానసికంగా స్మిత తట్టుకోలేక పోయింది. మోసపోయానని తెలుసుకొని 1996 సెప్టెంబర్ 23 న తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని తనువు చాలించింది స్మిత . కొన్ని ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోటులో రాసిందే తప్ప రాధాకృష్ణ తన మరణానికి కారణం అని పేర్కొనలేదు. అతడంటే ఆమెకు అంత ప్రాణం. జీవితం గురించి ఎన్నో కలలు కన్న స్మిత అవేమీ తీరకుండానే చిన్న వయసులోనే ఓ మోసగాడి వల్ల కన్ను మూయాల్సి వచ్చింది. ఎగిసి ఎగిసి పడిన జీవితం స్మితది . ఆమె ఆత్మకథను ది డర్టీ పిక్చర్ పేరుతో హిందీలో సినిమా తీసి ఏక్తా కపూర్ సొమ్ము చేసుకొంది.

(ఈరోజు సిల్క్ స్మిత జయంతి సందర్భంగా..)

- యు. వినాయకరావు

Updated Date - 2022-12-02T18:11:56+05:30 IST