Skull in Jar: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 181 ఏళ్లుగా ఓ జాడీలో అతడి తలను భద్రంగా దాచేశారిలా.. ఇంతకీ ఇతడెవరంటే..

ABN , First Publish Date - 2022-10-08T00:56:18+05:30 IST

పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో ఓ వ్యక్తి తలను 181 ఏళ్లకు పైగా జాడీలో భద్రంగా దాచారు.

Skull in Jar: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 181 ఏళ్లుగా ఓ జాడీలో అతడి తలను భద్రంగా దాచేశారిలా.. ఇంతకీ ఇతడెవరంటే..

పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో ఓ వ్యక్తి తలను 181 ఏళ్లకు పైగా జాడీలో భద్రంగా దాచారు. అంత కాలంగా ఆ తలను పరిరక్షిస్తున్నారంటే అది ఎవరిదో గొప్ప వ్యక్తిదే అయి ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే.. అతను గొప్పవాడేమీ కాదు.. అత్యంత కిరాతకుడు. చాలా మంది అమాయకులను కనికరం లేకుండా చంపిన భయంకరమైన సీరియల్ కిల్లర్. పేరు.. డియాగో ఎల్విస్. అతని చేతిలో 70 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 


స్పెయిన్‌లోని గెసెలియా నగరంలో 1819లో డియాగో జన్మించాడు. యుక్త వయసుకు వచ్చాక పని వెతుక్కుంటూ పోర్చుగల్‌లోని లిస్బన్‌కు చేరుకున్నాడు. ఇక్కడ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి ఉద్యోగం దొరకలేదు. దీంతో చిన్న చిన్న నేరాలు చేసే ముఠాతో కలిసి రద్దీ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడేవాడు. ఆ డబ్బుతో జల్సాగా గడిపేవాడు. తను మరింత ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని రైతులను టార్గెట్‌గా చేసుకున్నాడు. మార్కెట్‌లో తమ పంటను అమ్ముకుని డబ్బుతో ఇంటికి వెళ్లే రైతుల కోసం బ్రిడ్జిపై కాపు కాసేవాడు. ఎవరైనా ఒంటరిగా వెళ్తున్నట్టు కనిపిస్తే అతడిని దోచుకుని చంపేసి, బ్రిడ్జిపై నుంచి కిందకు తోసేవాడు. అలా ఎంతో మందిని డియాగో పొట్టన పెట్టుకున్నాడు. 


ఇది కూడా చదవండి..

మూడు నెలల తర్వాత వీడిన మిస్టరీ.. రాత్రికి రాత్రే ఆ కుటుంబంలోని 9 మంది ఆత్మహత్య చేసుకోవడం వెనుక..!


బ్రిడ్జి దగ్గర చనిపోయిన వారందరూ ఆత్మహత్యలు చేసుకుని ఉంటారని పోలీసులు భావించేవారు. ఎందుకంటే అప్పట్లో సైన్సు ఇంతగా అభివృద్ధి చెందలేదు. పోస్ట్‌మార్టమ్ చేసి మృతికి అసలైన కారణం కనుక్కోవడం అప్పట్లో వీలయ్యేది కాదు. పంట నష్టం రావడంతో రైతులు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పోలీసులు, అధికారులు అనుకునేవారు. మృతుల సంఖ్య 50కి పెరగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మృతుల కుటుంబ సభ్యులను విచారించగా వారిలో చాలా మంది డబ్బుకు ఇబ్బంది లేని ధనిక రైతులేనని తేలింది. దీంతో పోలీసులు బ్రిడ్జిపై భద్రతను పెంచారు. దాంతో డియాగో మరో పథకం వేశాడు. చిన్న చిన్న నేరాలు చేసే కొందరితో కలిసి ఓ ముఠాగా ఏర్పడి లిస్బన్ నగరంలోని ధనికుల ఇళ్లను టార్గెట్ చేసుకుని దోపీడీలకి పాల్పడేవాడు. అలా దోచుకున్న ఇంట్లోని వారిని చంపేసేవాడు. 


అలా ఓ వైద్యుడి ఇంట్లో దాడికి పాల్పడి నలుగురిని చంపేసి పారిపోతూ తన ముఠాతో కలిసి పోలీసులకు దొరికిపోయాడు. అతడిని కఠినంగా విచారించిన పోలీసులు మొత్తం విషయాలు రాబట్టారు. విచారణలో డియాగో మొత్తం నేరాలను అంగీకరించాడు. తన చేతిలో 70 మంది కంటే ఎక్కువగానే ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు. దీంతో పోర్చుగల్ కోర్టు 1841లో డియాగోకు మరణ శిక్ష విధించింది. లిస్బన్‌లోని కొంతమంది వైద్యులు తమ పరిశోధన కోసం డియాగో మెదడు కావాలని కోర్టును, ప్రభుత్వాన్ని కోరారు. అలాంటి సీరియల్ కిల్లర్స్ ఎలా ఆలోచిస్తారనే దానిపై పరిశోధన చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. డియాగో మెదడును వైద్యులకు ఇచ్చేందుకు కోర్టు, ప్రభుత్వం అనుమతించాయి. దీంతో అప్పటి నుంచి, అంటే 181 ఏళ్లుగా డియాగో తల లిస్బన్ విశ్వవిద్యాలయ మ్యూజియంలోనే ఉండిపోయింది. 

Read more