Tamil Nadu: నిజంగా ఈ బామ్మ గ్రేట్.. బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు నిరాకరించిన బామ్మ.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-10-02T00:56:56+05:30 IST

ఎంత సంపాదిస్తున్నా, జేబులో డబ్బులున్నా ఉచితమంటే ఉండే క్రేజే వేరు. ఏదైనా ఉచితంగా వస్తోందంటే దాని కోసం చాలా మంది ఎగబడుతుంటారు.

Tamil Nadu: నిజంగా ఈ బామ్మ గ్రేట్.. బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు నిరాకరించిన బామ్మ.. వైరల్ అవుతున్న వీడియో!

ఎంత సంపాదిస్తున్నా, జేబులో డబ్బులున్నా ఉచితమంటే ఉండే క్రేజే వేరు. ఏదైనా ఉచితంగా వస్తోందంటే దాని కోసం చాలా మంది ఎగబడుతుంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ బామ్మ మాత్రం అలా ఉచితాలను కోరుకోలేదు. కండక్టర్ డబ్బులు వద్దంటున్నా అతనితో వాదించి మరీ టికెట్ కొనుక్కొని బస్సులో ప్రయాణించింది. తమిళనాడు (Tamil Nadu)లోని కోయంబత్తూర్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. గతేడాది నుంచి మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. తాజాగా కోయంబత్తూర్ (Coimbatore) జిల్లాలోని మధుకరాయ్‌ నుంచి పాలథురాయ్‌ వెళ్తున్న ఓ సర్కారీ బస్సులోకి వృద్ధురాలు ఎక్కింది. బస్సు కండక్టర్ పురుషుల నుంచి మాత్రమే డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్నాడు. ఆ సమయంలో తనకూ టికెట్‌ ఇవ్వాలని ఆ వృద్ధురాలు కండక్టర్‌‌ను అడిగింది. అయితే ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణానికి మహిళలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వెళ్లొచ్చని కండక్టర్‌‌ వివరించే ప్రయత్నం చేశాడు. 


కండక్టర్ ఎంతగా నచ్చ చెప్పినా ఆ బామ్మ వెనక్కు తగ్గలేదు. తాను బస్సులో ఉచితంగా వెళ్లాలనుకోవడం లేదని, టికెట్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది (Old Woman refuses to travel free in govt bus). దీంతో చేసేదేమి లేక కండక్టర్ ఆమె నుంచి డబ్బులు తీసుకుని టికెట్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు, అధికారులు బామ్మ గొప్ప తనాన్ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-10-02T00:56:56+05:30 IST