Rabindranath Tagore Death Anniversary: రవీంద్రుని జీవితంలో ఆసక్తికర ఘటనలు...
ABN , First Publish Date - 2022-08-07T15:13:00+05:30 IST
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి...
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, రచయితగా, నాటక రచయితగా, సంగీతకారునిగా, తత్వవేత్తగా, చిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా దేశానికి ఎనలేని సేవలను చేశారు. బెంగాల్‌తో పాటు భారతీయ సంస్కృతి, సంగీతం, కళలకు కొత్త కోణాన్ని అందించారు. అతని రచనల్లోని ఘనత దేశ సరిహద్దులను దాటి ఐరోపాకు చేరుకుంది. సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి యూరోపియన్‌యేతర వ్యక్తిగా నిలిచారు. ఆగస్టు 7న గురుదేవ్ వర్ధంతి సందర్భంగా ఆయనను అందరూ స్మరించుకుంటున్నారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ తన 80 సంవత్సరాల వయస్సులో 1941 లో యురేమియాతో మరణించాడు. కోల్‌కతాలోని జోరాసంకో ఠాకూర్‌బారిలో 7 మే 1861న జన్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్ చిన్నతనంలోనే తల్లి మరణంతో ఆమె ప్రేమకు దూరమయ్యాడు. బ్రహ్మసమాజంలో యాక్టివ్‌గా ఉండే అతని తండ్రి దేవేంద్రనాథ్ తరచూ ప్రయాణాలు చేసేవారు. ఈ పరిస్థితుల మధ్య రవీంద్రనాథ్ ఠాగూర్ సేవకుల పర్యవేక్షణలో పెరిగారు. సెట్ జేవియర్‌లో విద్యనభ్యసించిన తర్వాత, బారిస్టర్ అయ్యేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లారు. అక్కడ బ్రిడ్జ్‌స్టోన్ పబ్లిక్ స్కూల్ పూర్తిచేసి, యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. అయితే డిగ్రీ తీసుకోకుండానే ఇండియాకు తిరిగొచ్చారు. 8 సంవత్సరాల వయస్సులో, రవీంద్రనాథ్ తన మొదటి కవితను రాశారు. 16 సంవత్సరాల వయసులో అతని తొలి కవితా సంకలనం ప్రచురితమయ్యింది. రవీంద్రుని రచనలు బెంగాలీ సాహిత్యానికి కొత్త శిఖరాలను అందించాయి. వాటిలో గీతాంజలి, గోరా, ఘరే బైరే ఎంతో ప్రజాదరణ పొందాయి. భారతదేశం, బంగ్లాదేశ్ జాతీయగీతాలను రవీంద్రులు రచించారు. శ్రీలంక జాతీయ గీతం కూడా అతని స్వరకల్పన నుండి ప్రేరణ పొందింది. రవీంద్ర సంగీతం పేరుతో 2,230 పాటలను స్వరపరిచారు. హిందుస్థానీ సంగీతంలోని తుమ్రీ ప్రభావం ఆయన సంగీతంలో కనిపిస్తుంది. స్వామి వివేకానంద తర్వాత ప్రపంచ మతాల పార్లమెంటులో ప్రసంగించిన రెండవ వ్యక్తి గురుదేవ్ రవీంద్రనాథ్.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో ప్రకృతిపై ఆయన చేసిన సంభాషణ ఎంతో ప్రసిద్ధి చెందింది. రవీంద్రునికి మహాత్మా గాంధీతో సన్నిహిత సంబంధం ఉంది. గురుదేవ్ బాపుకి మహాత్మా అనే బిరుదు ఇచ్చారు. తన జీవితపు చివరి సంవత్సరాల్లో గురుదేవులు సైన్స్ సంబంధిత పరిశోధనలు చేశారు. 1937లో వచ్చిన తన వ్యాస సంకలనం విశ్వ పరిచయంలో పలు అంశాలను రాశారు. సైన్స్‌పై అతని ప్రధాన రచనలు సే, టాన్ సాంగిలో ప్రచురితమయ్యాయి. గురుదేవులకు జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళశాస్త్రంపై ఉన్న ఆసక్తి అతని కవితలలో ప్రతిబింబిస్తుంది. మనిషికి, దేవుడికి మధ్య ఉన్న సంబంధం ఆయన రచనల్లో కనిపిస్తుంది. అతని పెయింటింగ్స్ ప్యారిస్, ఐరోపాలలో ప్రదర్శనకు నోచుకున్నాయి.