MS Subbulakshmi Love Story: సీతామహాలక్ష్మి ఉత్తరాలు చదివారు.. ఈ సుబ్బులక్ష్మి ప్రేమ లేఖలు చదవరూ..!

ABN , First Publish Date - 2022-09-17T02:44:26+05:30 IST

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అనబడే మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి - సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న - నిజజీవితంలో భగ్న ప్రేమ గీతాలు..

MS Subbulakshmi Love Story: సీతామహాలక్ష్మి ఉత్తరాలు చదివారు.. ఈ సుబ్బులక్ష్మి ప్రేమ లేఖలు చదవరూ..!

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) అనబడే మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి - సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న - నిజజీవితంలో భగ్న ప్రేమ గీతాలు (MS Subbulakshmi Songs) ఆలపించారని తెలుసా? ప్రగాఢమైన తన ప్రేమని అక్షరాల్లోకి ఒంపి, పదాలుగా మలిచి, వాక్యాలుగా పంక్తులు పేర్చి అనేకానేక ఉత్తరాలు అతనికి అందించారని విన్నారా?


అలా మొదలయ్యింది... 

వీణా విద్వాంసురాలు షణ్ముగవడివేర్ ఎమ్మెస్ తల్లి మాత్రమే కాదు, తొలి గురువు. కర్ణాటక సంగీతంలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, హిందుస్థానీలో పండిట్ నారాయణ్ వ్యాస్ ఆమె గురువులు. వారి శిష్యరికంలో 11 ఏళ్ళకే కచేరీ చేసే స్థాయికి వెళ్లిపోయారు ఎమ్మెస్. ఆనంద వికటన్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న త్యాగరాజ సదాశివం ప్రోద్బలంతో సినిమాల్లో నటించారు. నాలుగు తమిళ సినిమాలు, ఒక హిందీ సినిమా మీరాబాయ్ (1947)లో నటించారు. 1938లో మొదటి సినిమా- 'సేవాసదనమ్(1938)'. ఆ తర్వాత శకుంతలై (1940), సావిత్రి (1941), మీరా (1945) సినిమాల్లో నటించారు ఎమ్మెస్.


'శకుంతలై' సినిమాలో కథానాయకుడుగా నటించిన సంగీతజ్ఞుడు, మంచి స్ఫురద్రూపి గుడలూర్ నారాయణస్వామి బాలసుబ్రమణియం (GNB) ప్రేమలో పడ్డారు ఎమ్మెస్ (MS Subbulakshmi Love Story). సాన్నిహిత్యం పెరిగి, ఎడబాటు తప్పనిసరైన స్థితిలో ఇద్దరి మధ్య ప్రేమలేఖలు నడిచాయి. కానీ, ఎమ్మెస్ ను దక్కించుకోవాలని ఎత్తులు వేసిన సదాశివం, ఆమెను జీఎన్బీ (GNB)కి దూరం చేసి అనుకున్న ప్రకారమే పెళ్ళి చేసుకుంటాడు.



అతనికి ఎమ్మెస్ రెండో భార్య... 

ఎన్నో మలుపులు... ఎన్నెన్నో ఒడిదుడుకుల ఎమ్మెస్ జీవితం కూడా సినిమా లాంటిదే. ఆమె తల్లి షణ్ముగవడివేర్ ది దేవదాసి కులమైతే, తండ్రి సుబ్రమణ్య అయ్యర్ బ్రాహ్మణ కులస్థుడు. ఎదిగిన సుబ్బులక్ష్మిని ఒక చెట్టియార్ ప్రాపకానికి అప్పగిద్దామని తల్లి ప్రయత్నిస్తే, ఆమె పారిపోయి మద్రాసులో సదాశివం పంచన చేరుతుంది. సదాశివం అప్పటికే పెళ్లయినవాడు, ఇద్దరు పిల్లలు. అయినా, ఎమ్మెస్ ను పెళ్లిచేసుకోవాలని పావులు కదిపారు సదాశివం. అందులో భాగంగానే జీఎన్బీని  ఎమ్మెస్ కు దూరం చేస్తాడు. గ్రహాలు అనుకూలించి సదాశివం పక్షాన నిలవడం వల్ల కాబోలు ఆయన పెద్ద భార్య అపితకుచంబాల్ తేలు కాటుకి గురై అర్థాంతరంగా చనిపోతుంది. సదాశివం- ఎమ్మెస్ పెళ్లికి అడ్డుతొలిగిపోతుంది. ఆ తర్వాత 57 ఏళ్ళు కలిసి అన్యోన్యమైన దాంపత్య జీవితం గడిపింది ఆ జంట అంటారు.



ఆ రహస్య ప్రణయం బైట పడిందెప్పుడు?

వెనకటి తరాలకి తెలిసిన 1940ల నాటి ఎమ్మెస్ ప్రణయగాథ రహస్యంగానే మిగిలిపోయింది తాజా తరాలకి. ఎమ్మెస్ జీవిత కథని 'MS – A Life in Music' పేరిట రాసిన ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ టీజేఎస్ జార్జి (TJS George) - ఆ సంగీత సామ్రాజ్ఞి జీవితంలోని ప్రణయవర్ణాలనీ, వియోగ దుఃఖాలనీ కూడా (ఆమె అనుమతితోనే) బైటపెట్టాడు. తన ప్రేమికుడికి ఆర్తితో రాసిన ఆమె ఆర్ద్రమైన లేఖల్ని ఆ పుస్తకం చివర్న అనుబంధంగా కూడా పొందుపరిచారు.



నా జీవన సౌహార్దానికి, నా జీవన సర్వస్వాన్నీ, మనశ్శరీరాల్నీ వశం చేసుకున్న నా నేస్తానికి... అని మొదలు పెట్టి ఎమ్మెస్ తన మనసుని పరిచారు ఆ లేఖల్లో. ఆమె ప్రగాఢమైన ప్రేమ, అతని సంశయం చాటు నిర్లక్ష్యానికి బదాబదలౌతున్న ఆమె బేల హృదయం... ఆ లేఖల్లో కనిపిస్తాయి. తల్లి వల్ల ఇబ్బందులు, శత్రువుగా వ్యవహరిస్తున్న అన్నయ్య, నరకప్రాయమైన ఇంటి వాతావరణం గురించి చెప్పుకున్నారామె. తాము కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తయినా కూడా తాము మాత్రం విడిపోకూడదనీ, కలకాలం కలిసి ఉండాలనీ ఆమె వేడుకుందా ఉత్తరాల్లో.



హిందుస్థానీ సంగీతానికి రారాణి కిశోరి అమోన్ కర్ చేత సప్తస్వరాలకూ అందని ఎనిమిదవ స్వరంగా ప్రశంసించబడ్డ, సుస్వరలక్ష్మి సుబ్బులక్ష్మి అని ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ నోట ప్రసంసలు పొందిన సంగీత తపస్విని, సామగాన సరస్వతి ఒక దీనగా, బేలగా, అబలగా... కన్నా నువ్వే నా సర్వస్వం అని సాగిలపడటం అద్భుతం... అపురూపం. స్వచ్ఛమైన ఆ ప్రేమ  ఎమ్మెస్ మహోన్నత వ్యక్తిత్వాన్ని మరో మెట్టు ఎక్కించి, ఆమెని మరింత పరిపూర్ణం చేసింది.

Updated Date - 2022-09-17T02:44:26+05:30 IST