Viral Video: రైలు బోగీలను నెట్టుకుంటూ వెళ్లిన ప్రయాణికులు.. వారు ఇలా ఎందుకు చేశారంటే..
ABN , First Publish Date - 2022-03-06T00:41:44+05:30 IST
ప్రయాణికులంతా కలిసి రైలు బోగీలను నెట్టుకుంటూ వెళ్లే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు ఇలా ఎందుకు చేశారనే విషయం తెలుసుకుని.. చివరకు అంతా..

బస్సులు, కార్లు, బైకులను నెట్టుకుంటూ వెళ్లడం చూశాం గానీ.. ఇలా రైలు బోగీలను నెట్టుకుంటూ వెళ్లడమేంటీ! అని ఆశ్యర్యపోతున్నారా. మీరు విన్నది ముమ్మాటికీ నిజమే. ప్రయాణికులంతా కలిసి రైలు బోగీలను నెట్టుకుంటూ వెళ్లే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు ఇలా ఎందుకు చేశారనే విషయం తెలుసుకుని.. చివరకు అంతా వామ్మో ఇలా జరిగిందా, అని ఆశ్యర్యపోతున్నారు..
ఉత్తరప్రదేశ్‌లో మీరట్ సమీపంలో ఉన్న దౌరాలా రైల్వే స్టేషన్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. షహరాన్‌పూర్, ఢిల్లీ మధ్య నడిచే రైలు ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ట్రైన్‌లో రద్దీగా ఉన్న ప్రయాణికులు.. అనుకోని వార్త విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. రైలు ఇంజిన్, పక్కనే ఉన్న రెండు బోగీల్లో మంటలు వ్యాపించాయని తెలియడంతో ఒక్కసారిగా అంతా ప్లాట్‌ఫామ్ మీదికి పరుగులు తీశారు. అయితే అంతటితో ఆగకుండా ప్రమాదాన్ని నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. వెంటనే ముందు వైపునకు వెళ్లి.. మంటలు వ్యాపించిన ఇంజిన్, బోగీలను వేరు చేశారు. తర్వాత మిగతా బోగీలను అక్కడి నుంచి దూరంగా తోసుకుంటూ వెళ్లారు. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రయాణికులు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.