Osey Ramulamma: విజయశాంతి కెరీర్‌‌ని పదేళ్లు పొడిగించిన చిత్రం

ABN , First Publish Date - 2022-11-26T11:51:38+05:30 IST

సాధారణంగా క్లాస్‌ చిత్రం అనీ, మాస్‌ సినిమా అనీ, యూత్‌ ఫిల్మ్‌ అనీ, లేడీస్‌ సినిమా అనీ... ఒక్కో సినిమాకు ఒక్కో బ్రాండ్‌ పడుతుంటుంది. . ఈ వర్గీకరణ ఆధారంగానే అయా చిత్రాలకు ఆయా వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. కానీ విజయశాంతి..

Osey Ramulamma: విజయశాంతి కెరీర్‌‌ని పదేళ్లు పొడిగించిన చిత్రం
Vijayashanti

సాధారణంగా క్లాస్‌ చిత్రం అనీ, మాస్‌ సినిమా అనీ, యూత్‌ ఫిల్మ్‌ అనీ, లేడీస్‌ సినిమా అనీ... ఒక్కో సినిమాకు ఒక్కో బ్రాండ్‌ పడుతుంటుంది. . ఈ వర్గీకరణ ఆధారంగానే అయా చిత్రాలకు ఆయా వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. కానీ విజయశాంతి (Vijayashanti) కథానాయికగా దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) రూపొందించిన ‘ఒసేయ్‌ రాములమ్మా’ (Osey Ramulamma) చిత్రానికి అన్ని వర్గాల ఆదరణ లభించి, అఖండ విజయం సొంతం చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం చర్చనీయాంశ విజయం సాధించింది. 69 ప్రింట్లతో విడుదల అయిన ఈ చిత్రం.. వారం తిరగకుండానే మరో 34 ప్రింట్లు పెంచుకుంది. రోజురోజుకీ కలెక్షన్లతో పాటు ప్రింట్ల సంఖ్య పెరగడం అన్నది చాలా రోజుల తర్వాత ‘ఒసేయ్‌ రాములమ్మా’ చిత్రం విషయంలోనే జరిగింది. ట్రేడ్‌ పండితులు ఆశ్చర్య పోయేలా ఈ చిత్రం ఆ రోజుల్లో అంటే పాతికేళ్ల క్రితం రూ. 22 కోట్లు వసూలు చేసింది. అలాగే ఈ చిత్రం ఆడియో అమ్మకాలు కూడా భారీ స్థాయిలోనే జరిగాయి. 5 లక్షల క్యాసెట్లు అమ్ముడై, దాసరి కెరీర్లోనే భారీ ఆడియో విజయంగా ‘ఒసేయ్‌ రాములమ్మా’ నిలిచింది.

రెండు దశాబ్దాల తన నట జీవితంలో నేటి భారతం, ప్రతిఘటన, కర్తవ్యం వంటి సంచలన చిత్రాల్లో నటించి, మంచి నటిగా గుర్తింపు పొందిన ఆమెకు ఇమేజ్‌ తగ్గక పోయినా.. విజయాలు లేక కొంచెం డల్‌గా ఉన్న తరుణంలో వచ్చిన ‘ఒసేయ్‌ రాములమ్మా’ చిత్రం ఆమె నట జీవితాన్ని మరో దశాబ్దం పొడిగించిందని చెప్పాలి. ‘కుంతి పుత్రుడు’ చిత్రం తర్వాత విజయశాంతి దాసరి దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదే. ఇందులోని రాములమ్మ పాత్రకు తన అభినయంతో ప్రాణ ప్రతిష్ట చేసిన విజయశాంతి తొలిసారిగా తనకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. అమాయక రాములమ్మగా, విజృంభించిన అపర కాళి రాములక్క‌గా విజయశాంతి నటన సూపర్బ్‌. ఈ సినిమా విజయంతో అందరూ ఆమెను ‘రాములమ్మ’ (Ramulamma) అని పిలవడం ప్రారంభించారు. ఈ చిత్రంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ (Superstar Krishna) పోలీస్‌ ఆఫీసర్‌‌గా గెస్ట్‌ రోల్‌ పోషించారు.

-వినాయకరావు

Updated Date - 2022-11-26T18:22:57+05:30 IST