-
-
Home » Prathyekam » Odisha Tribals express anger over woman forced to dance with Padma Shri awardee Kamala Pujari kjr spl-MRGS-Prathyekam
-
Kamala Pujari: పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఇచ్చే గౌరవం ఇదా..? అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే బలవంతంగా డాన్స్ చేయించారు..!
ABN , First Publish Date - 2022-09-02T23:54:07+05:30 IST
పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పుజారి.. ఇటీవల కిడ్నీ సంబంధిత సమస్యతో ఇటీవల ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. పరిస్థితి విషమిస్తున్న తరుణంలో అందరినీ..

పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పుజారి.. కిడ్నీ సంబంధిత సమస్యతో ఇటీవల ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. పరిస్థితి విషమిస్తున్న తరుణంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 70ఏళ్ల వయసులో ఆమె కోలుకుని, డిశ్చార్జి అయ్యారు. అయితే ఆస్పత్రిలో ఆమెతో ఓ మహిళ బలవంతంగా డాన్స్ చేయించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఇచ్చే గౌరవం ఇదా..? అంటూ మండిపడుతున్నారు.
ఒడిశాలోని (Odisha) ప్రధాన షెడ్యూల్డ్ తెగ అయిన పరాజ కమ్యూనిటీకి చెందిన కమలా పుజారి (Kamala Pujari).. 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు (Padma Shri Award) అందుకున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటూ వరి సహా వివిధ పంటలకు చెందిన 100 రకాల దేశీయ విత్తనాలను సంరక్షించినందుకు గాను ఆమెకు ఈ గౌరవం దక్కింది. కాగా, కిడ్నీ సంబంధిత సమస్యతో ఆమె ఇటీవల కటక్‌లోని SCB ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పుజారి త్వరగా కోలుకోవాలంటూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. సోమవారం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే డిశ్చార్జ్ అయ్యే ముందు.. సామాజిక కార్యకర్త అయిన మమతా బెహెరా అనే మహిళ.. కమలా పుజారి వద్దకు వెళ్లి, సెల్ఫీ తీసుకోవడంతో పాటూ తాను డాన్స్ చేయడమే కాకుండా ఆమెతో కూడా బలవంతంగా డాన్స్ చేయించింది. ఈ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ఒడిశాలోని పరాజ గిరిజన సంఘం సభ్యులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారకులపై చర్యలు తీసుకోకుంటే.. ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. కొరాపుట్ జిల్లాలోని స్వగ్రామం నుంచి పుజారి.. మీడియాతో మాట్లాడారు. ‘‘ నేనెప్పుడూ డ్యాన్స్ చేయాలని అనుకోలేదు. కానీ బలవంతం చేశారు. నేను పదేపదే వద్దు వద్దు అంటున్నా.. ఆమె (సామాజిక కార్యకర్త) వినలేదు. దీంతో నేను డాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పటికే నేను అనారోగ్యంతో అలసిపోయి ఉన్నాను’’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆస్పత్రి అధికారులు మాట్లాడుతూ.. పూజారిని ఐసీయూలో కాకుండా ప్రత్యేక క్యాబిన్‌లో చేర్చినట్లు చెప్పారు. నర్సులు లేని సమయంలో సదరు మహిళ లోపలికి వచ్చిందని, ఆమె ఎవరో కూడా తమకు తెలియని అటెండర్ రాజీబ్ హియాల్ తెలిపారు. మరోవైపు మమతా బెహెరా మాట్లాడుతూ.. కమలా పుజారిలో హుషారు నింపేందుకే అలా చేయించానని తెలిపారు.
