Sri Ramanjaneya Yuddham: దేవుడు గొప్పా..? దైవ భక్తి గొప్పా..? పాత కథకి బాపు మార్క్ ట్రీట్మెంట్.. పౌరాణిక కథతో ఫిలాసఫీ..!

ABN , First Publish Date - 2022-12-15T22:05:56+05:30 IST

కథ కొత్తగా కల్పించబడిందేమీ కాదు. అప్పటికి ఎన్నో దశాబ్దాలుగా సినీరంగంలో, అంతకుమునుపే నాటకరంగంలో కూడా వింటున్న, చూస్తున్న కథాంశమే; శ్రీరాముడికి, ఆ రాముడికి మహాభక్తుడైన ఆంజనేయుడికీ మధ్య వైరం, అది యుద్ధానికి దారితీయడం. కథ పాతదే; ఆ కథకి అంతర్లీనంగా..

Sri Ramanjaneya Yuddham: దేవుడు గొప్పా..? దైవ భక్తి గొప్పా..? పాత కథకి బాపు మార్క్ ట్రీట్మెంట్.. పౌరాణిక కథతో ఫిలాసఫీ..!

బాపు జయంతి ( Director Bapu Birth Anniversary ) సందర్భంగా

బాపు సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకి అంతర్జాతీయఖ్యాతిని తెచ్చిపెట్టినవి అందులో ఎన్నో. కానీ, అన్నింటికంటే ఒక గొప్ప తత్వాన్ని, ఫిలాసఫీని ఒక పౌరాణిక కథ ద్వారా చెప్పడం - అనే గొప్ప ప్రయోగం చేశారు బాపు (Director Bapu). ఆ సినిమా- ‘శ్రీరామాంజనేయ యుద్ధం (Sri Ramanjaneya Yuddham Movie )!’. బి.సరోజాదేవి - నందమూరి తారక రామారావు సీతారాములుగా, ఆంజనేయుడి వేషానికి ఆనాడు వెండితెర మీద పెట్టింది పేరైన అర్జా జనార్దనరావు, రాజశ్రీ, ముక్కామల, ధూళిపాళ, జయంతి, కాంతారావు ఇతర తారాగణంగా బాపు 1975లో తీసిన సినిమా - శ్రీరామాంజనేయ యుద్ధం!

కథ కొత్తగా కల్పించబడిందేమీ కాదు. అప్పటికి ఎన్నో దశాబ్దాలుగా సినీరంగంలో, అంతకుమునుపే నాటకరంగంలో కూడా వింటున్న, చూస్తున్న కథాంశమే; శ్రీరాముడికి, ఆ రాముడికి మహాభక్తుడైన ఆంజనేయుడికీ మధ్య వైరం, అది యుద్ధానికి దారితీయడం. కథ పాతదే; ఆ కథకి అంతర్లీనంగా ఒక, నీతిని, సందేశాన్ని, తాత్వికతని మేళవించిన కథనం కొత్తది, గొప్పది కూడా. తనకి పరమ భక్తుడైన యయాతిని చంపుతానని శ్రీరాముడే శపథం చేసే పరిస్థితులు వస్తాయి. రామశపథం తెలియని ఆంజనేయుడు, తన సహ రామభక్తుడైన యయాతిని రక్షిస్తానని ప్రమాణం చేస్తాడు. అది రామాంజనేయ వైరానికి దారితీస్తుంది.

"రామా! తగునా...నీ దాసునిపైన రణభేరి వేయ... సాకేత సార్వభౌమా!" అని ఈలపాట రఘురామయ్య గారి గొంతులో ఆర్తిని ఆంజనేయుడు (అర్జా జనార్దనరావు) కళ్లలో తొణికిసలాడిస్తాడు. 'కలనైనా నిను కొలిచే నేను కయ్యానికెటులోర్తురా'........ 'ఏమరినావా చేసిన సేవ నా మొర ఆలింపవా...' అని విలవిలలాడతాడు. ఆయన దేవుడు, సాక్షాత్ శ్రీరామచంద్రుడు. ఈయన ఆంజనేయుడు - శ్రీరాముడి బంటు, పరమ విధేయుడు, భక్తాగ్రేసరుడు. కానీ, నువ్వు ఆరాధించే దేవుడు కూడా తప్పు చేశాడని నీకు నిర్ధారణ అయితే, నీ బుద్ధికి ఖాయమైతే, ఆ దేవుడిని ఎదిరించడానికి వెనకాడకు. ఆ తప్పు సరిచేయడం కూడా నీ విధేయతలో, నీ ప్రేమలో, భక్తిలో భాగమే!

- ఇదీ ఆ సినిమా ద్వారా బాపు ( Director Bapu Movies) బోధించిన నీతి.

Sri-Ramanjaneya-Yuddham-1.jpg

శ్రీరామాంజనేయ యుద్ధంలో ఆ నీతిని చెప్పడం మాత్రమే కాదు, మరో ముఖ్యమైన తాత్విక ప్రశ్నకి జవాబు కూడా ఉంది.

ఏమిటా తాత్విక ప్రశ్న?

శ్రీరాముడు- శ్రీరాముడి మీద భక్తి

- ఈ రెండింటిలో ఏది గొప్ప? ఏది ఎక్కువ? ఏది తక్కువ?

రాముడు- ఆంజనేయుడు పోరుకి సిద్ధమౌతారు. కొంత మాటల యుద్ధం జరుగుతుంది.

శ్రీరాముడు విశ్వరూపం చూపిస్తాడు.

నా విశ్వరూప సందర్శనం అయ్యింది కదా, ఇప్పటికైనా యయాతిని విడిచి, నన్ను శరణు కోరమంటాడు రాముడు.

కానీ, తన శ్రీరాముడి దివ్యరూప సందర్శనానంతర ఉద్వేగం భక్త హనుమానుడిని ఆవహిస్తుంది. ఆ భక్తుడిని మరింత పరిశుద్ధం చేస్తుంది. యయాతిని సంహరించాలనుకున్న రాముడి తప్పిదాన్ని సరిచేసి, ఆయనను మరింత నిష్కళంకమూర్తిని చేయాలన్న తపనని రెట్టింపు అవుతుంది.

అజేయమైన రామబాణాన్ని సంధిస్తాడు శ్రీరాముడు. తన దేవుడ్ని ఎదుర్కోడానికి తన దగ్గరున్న ఆయుధాన్ని సగర్వంగా సంధిస్తాడు:

"సర్వం సహా వసుంధరావలయం నిండిన శ్రీరామ తారకధ్యానమే నా కవచము. తత్పద భక్తితో నిండిన నా మనస్సే ధనస్సు. అందు సంధించిన శ్రీరామ నామమే నా అస్త్రము..."

రామబాణం పైకి వేసిన అస్త్రం రామభక్తి!

ముల్లోకాలూ అల్లాడిపోతాయి. పరమశివుడి ప్రమేయంతో చివరికి కథ సుఖాంతమౌతుంది.

దేవుడు- ఆ దైవం మీద భక్తి

- ఈ రెండింటిలో ఏది ఎక్కువ? ఏది తక్కువ? అనే ప్రశ్నకి బాపు తాత్వికంగా ఇచ్చిన బదులు:

దైవభక్తి కంటే దేవుడు గొప్పవాడు కాదు.

అదీ పాత కథకి బాపు ( Bapu Movies ) మార్క్ ట్రీట్మెంట్!

Sri-Ramanjaneya-Yuddham-3.jpg

వెంకటరమణ కాదు, వెంకటరావు:

బాపు దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR )నటించిన తొలి చిత్రమది. తన చిరకాల మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ (Mullapudi Venkata Ramana ) చేత బాపు ఈ సినిమాకి మాటలు రాయించలేదు. అందుకోసం ఆయన అన్వేషించి వెతుక్కున్న కలం - గబ్బిట వెంకటరావు!

శ్రీరామకర్ణామృతంలో సంప్రదాయక శ్లోకం-

"జయతు జయతు మంత్రం

జన్మ సాఫల్య మంత్రం

రామ్ రామ్ రామ్

జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం

రామ్ రామ్ రామ్

సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం

రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం.. "

- అది పరమ రామభక్తుడైన బాపు పలవరించే మంత్రం. తన ఇష్టదైవమైన సకల గుణాభిరాముడ్ని ఎన్టీఆర్ రూపాన చూపించడం కాదు ఈ సినిమా విషయంలో బాపు లక్ష్యం. రామతత్వాన్ని చూపించడం. అందుకోసం, తన లాగా రామభక్తుడై, రామతత్వాన్ని అర్థం చేసుకొన్న కవి, రచయిత కోసం వెదికారు; గబ్బిట వెంకట్రావు దొరికారు.

గబ్బిట వెంకట్రావు కోస్తాంధ్రుడు. కేవలం ఫోర్త్ ఫాం వరకే చదువు. 'దాసుని దోసము దండముతో సరి...భండనమేలనయా' అని ఆంజనేయుడు విలపిస్తాడు. అదే భక్తితో ఎప్పుడో రాసుకున్నాడు 'హనుమద్రామ సంగ్రామం' అనే నాటకం! తర్వాత మద్రాసు చేరారు, ఏవో చిన్నా చితకా సినిమాలకి రాశారు. కానీ, అన్నింటినీ మించి ఆయన రామభక్తి వల్లే బాపు దృష్టిలో పడ్డారు. ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ సినిమాకి మాటలు... పాటలు... పద్యాలు...స్క్రీన్ ప్లే - అన్నీ వెంకటరావే. అవన్నీ వేర్వేరు విభాగాలు అనుకోలేదు ఆయన. తన దైవం శ్రీరాముడికి వేసే దండలో గుదిగుచ్చిన రకరకాల పూలు అనుకున్నారు.

"గజ్జలందెలు ఘల్లు ఘల్లున కౌసల్య అంకసీమను నాట్యమాడనెద్ది ఈ ఈ ...

లోకపావనియైన ఆకాశ గంగకు జన్మకారణమైన స్థానమెద్ది ఈ ఈ.......

పతిశాపమున రాతి బండయై పడి యున్న ఇంతికి నిజరూప నిచ్చేనెద్ది ఈ ఈ....

అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిందెనెద్ది ఈ ఈ.....

జానకీ దేవి నిచ్చుచు జనకరాజు కనకపాత్రను పన్నీట కడిగినెద్ది

అట్టి నీ పాద నీరేజ మయ్యో నాదు కఠిన దేహంబు తాకంగ కందినేమో

తారక బ్రహ్మ నామ కోదండరామ అ అ అ......." శ్రీరాముడు తనని కాలితో తన్నినప్పుడు, ఆ పాదం కందిందేమో అని ఈ పద్యం పాడతాడు ఆంజనేయుడు. అంతకుముందు, ‘ప్రేమనిధాన న్యాయమిదేనా...ఇంకేల ఈ శోధనా...' అంటూ శరణు శరణయా జానకిరామా అంటూ శ్రీరాముడికి ఆ పూల మాల వేశారు గబ్బిట వెంకట్రావు. అదే బాపుకి ఎంతగానో నచ్చింది. బాపు (Director Bapu Biography) చిత్రకారులు కదా, సొగసైన ఆ మాలని ఎలా అలంకరించాలో ఆయన కంటే ఎవరికి బాగా తెలుసు!

*****

Updated Date - 2022-12-15T22:09:48+05:30 IST