Srinivasa Ramanujan: ఆయనపై సినిమా తీసేందుకే పదేళ్లు ఎందుకు పట్టింది..? గణిత మేధావికి సరైన గుర్తింపు దక్కిందా..?

ABN , First Publish Date - 2022-12-22T17:51:14+05:30 IST

"మొత్తం 20 అరటిపళ్లని క్లాసులో ఉన్న 20 మంది పిల్లలకి సమానంగా పంచితే- ఒక్కొక్కరికీ ఒక పండు వస్తోంది కదండీ. మరి పండ్లు ఏమీ లేనప్పుడు, పిల్లలు ఒక్కరు కూడా లేనప్పుడు..

Srinivasa Ramanujan: ఆయనపై సినిమా తీసేందుకే పదేళ్లు ఎందుకు పట్టింది..? గణిత మేధావికి సరైన గుర్తింపు దక్కిందా..?

నేడు జాతీయ గణిత దినోత్సవం (National Mathematics Day)

"మొత్తం 20 అరటిపళ్లని క్లాసులో ఉన్న 20 మంది పిల్లలకి సమానంగా పంచితే- ఒక్కొక్కరికీ ఒక పండు వస్తోంది కదండీ. మరి పండ్లు ఏమీ లేనప్పుడు, పిల్లలు ఒక్కరు కూడా లేనప్పుడు కూడా ఒక్కొక్కరికీ ఒక పండు వస్తుందా?"

ఇంత ‘తలతిక్క’ ప్రశ్న వేసిన కుర్రాడికి ఎటువంటి ఎగతాళి ఎదురవుతుందో చెప్పనక్కర్లేదు కదా. అప్పుడు అవమానాలు జరిగాయి గానీ, ఇప్పుడు మాత్రం అదే కుర్రవాడి పుట్టినరోజు -డిసెంబర్ 22ని ‘జాతీయ గణిత దినోత్సవం (National Mathematics Day)’ గా జరుపుకుంటున్నాం.

ఆ ‘పిచ్చి’ ప్రశ్నల బాలుడే- ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్!

భాగహారం (division) కి సంబంధించిన ఆ ప్రశ్నకి జవాబు కోసం ఆయన చేసిన అన్వేషణే ఆయన జీవితం అని చెప్పవచ్చు. లెక్కల మాష్టారు విస్తుబోయేలా, విసుక్కునేలా చేసిన ప్రశ్న – ‘n’ ను ‘n’ తో భాగహారిస్తే (ఒక సంఖ్యని అదే సంఖ్యతో భాగహారం చేస్తే), ఒకటి వస్తున్నప్పుడు, ‘n’ విలువ సున్నా అయితే, సున్నా / సున్నా కూడా ఒకటే అవ్వాలి కదా, అని ఆ కుర్ర రామానుజన్ ప్రశ్నలోని తర్కం.

1887 డిసెంబర్ 22న పుట్టి, కేవలం 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికి, అనారోగ్యంతో అర్థాంతరంగా రాలిపోయిన గణిత మేధావి- రామానుజన్ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? ప్రపంచ గణిత విజ్ఞానానికి ఆయన అదనంగా తనవంతు అందించినదేమిటి అని పాశ్చాత్య ప్రపంచం చెప్పేంత వరకూ మనకి తెలియకపోవడం మన దురదృష్టం. పుట్టింది తమిళ కుటుంబంలో అయినా, తొలిగా తెలుగు వర్ణమాల నేర్చిన ఆయనకి తెలుగుతో బంధం ఏర్పడటం మన అదృష్టం.

'The Man Who Knew Infinity'

"అనంతం గురించి తెలిసినవాడు (The Man Who Knew Infinity)" అన్నాడు రాబర్ట్ కానిగల్ (Robert Kanigel) అనే ఓ అమెరికన్ బయోగ్రాఫర్. రామానుజన్ జీవిత కథని- "The Man Who Knew Infinity: A Life of the Genius Ramanujan" పేరిట రాబర్ట్ రచించిన తర్వాతే మనకి రామానుజన్ నిజంగా పరిచయమయ్యారు అనవచ్చు. అప్పటివరకూ రామానుజన్ గురించిన సమగ్రమైన సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల దగ్గర గానీ, దేశంలోని ప్రముఖ గణిత సంఘాల దగ్గరగానీ లేదు. 2012లో చెన్నైలో జరిగిన రామానుజన్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అప్పటి ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్, డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చి, ఆ మేరకు ఆదేశాలివ్వడం మాత్రమే రామానుజన్‌కి దక్కిన ఈ పాటి గుర్తింపు.

"సంగీతానికి మోజార్ట్ (Mozart), భౌతికశాస్త్రానికి ఐనిస్టైన్ (Einstein) ఎటువంటి వారో గణితానికి రామానుజన్ అటువంటి మేలైన రత్నం.." అని ప్రముఖ రచయిత క్లిఫ్ఫోర్డ్ స్టోల్ (Clifford Stoll) కోట్‌తో మొదలయ్యే రామానుజన్ బయోగ్రఫీ "The Man Who Knew Infinity: A Life of the Genius Ramanujan"- 468 పేజీల సమగ్ర జీవన చిత్రణ. పుట్టుక నుంచి అర్థాంతరంగా 32 ఏళ్లకి ముగిసిపోయిన ఆ గణిత మేధావి జీవితాన్ని చిత్రించాడు రచయిత రాబర్ట్. దక్షిణ గంగగా ప్రసిద్ధి పొందిన కావేరి నదీ తీరాన మొదలైన శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జీవన ప్రస్థానం 8 అధ్యాయాలుగా సాగింది. పుట్టింది కుంభకోణంలో అయినప్పటికీ, కుటుంబ పరిస్థితుల వల్ల కాంచీపురం (కంచి)లో ప్రాథమిక పాఠశాలలో చేరవల్సి రావడం వల్ల, కాంచీపురంలో ఆనాడు తెలుగు బడులే ఉన్న కారణంగా బాల రామానుజన్ తొలుత తెలుగు అక్షరాలు దిద్దారు.

రామానుజన్‌లో ప్రతిభ గుర్తించి, ఆయనని ఇంగ్లండు కేంబ్రిడ్జి యూనివర్శిటీకి రప్పించిన గురువు జి హెచ్ హార్డీ తనను తాను రామానుజన్ మార్గదర్శకుడిగా గుర్తించడానికి నిరాకరిస్తారు.

"నేను రామానుజన్‌ని డిస్కవర్ చేయలేదు. తనలోని మేథ్స్ జీనియస్‌ని తానే కనుగొన్నాడు రామానుజన్.." అంటారు హార్డీ. అందుకే రామానుజన్ ఒక స్వయంభూ!’ స్వయంభూ’ - అనే అధ్యాయంతోనే ముగుస్తుంది ఆయన బయోగ్రఫీ.

“ఒక ప్రేమకథని పుట్టించండి”

"The Man Who Knew Infinity" పేరుతోనే 2015లో ఒక హాలీవుడ్ సినిమా తీశారు, రాబర్ట్ కానిగల్ రాసిన బయోగ్రఫీ ఆధారంగా. రామానుజన్ జీవితాన్ని సినిమాగా తీయాలని అనుకొని, మాథ్యూ బ్రౌన్ (Matthew Brown) స్రిప్ట్ రచనకి పూనుకున్నాక, 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గానీ చిత్ర నిర్మాణం పట్టాలెక్కలేదు. దానికి కారణం, ఆ బయోగ్రఫీలో నిర్మాతలు ఆశించిన మెరుపులు... చమక్కులూ కనిపించకపోవడమేనట. రామానుజన్ పాత్రకి ఆర్ మాధవన్‌ని మొదట ఎంపిక చేసుకున్నారు. కానీ, అంతర్జాతీయంగా పేరు ఉన్న నటుడైతే బాగుంటుందని సినిమాకి పెట్టుబడిదారులు పట్టుబట్టడంతో, ఆయన ఆకారానికి అంతగా సూట్ కాని బ్రిటీష్ నటుడు దేవ్ పటేల్ (Dev Patel)ని ఎంచుకోవల్సి వచ్చింది. అంతేకాదు, రామానుజన్ జీవితంలో లేని ఒక ప్రేమకథని సినిమాలో ఇరికించమని కూడా ఫైనాషియర్స్ వత్తిడి చేశారని, స్రిప్ట్ రచయిత, ఆ సినిమాకి దర్శకుడు కూడా అయిన మాథ్యూ బ్రౌన్ ఒక ఇంటర్వ్యూలో వాపోయాడు. లండన్‌లో అనారోగ్యం పాలయిన రామానుజన్, ట్రీట్మెంటులో ఉన్నప్పుడు ఒక ఇంగ్లీషు నర్స్ ప్రేమలో పడినట్టు స్రిప్టుని మార్చి, ఒక పెద్ద హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ని ఆ నర్స్ పాత్రకు తీసుకుంటే కాసుల వర్షం కురుస్తుందని, కాబట్టి దానికి అనుగుణంగా మార్చమని తనని బలవంత పెట్టినట్టు మాథ్యూ చెప్పాడు. అందుకు మాథ్యూ బ్రౌన్ ఒప్పుకోకపోవడం వల్లే సినిమా పదేళ్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకి 2015లో విడుదలైంది. కోటి డాలర్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 1.23 కోట్ల డాలర్లు వసూలు చేసింది.

ఇప్పటికైనా గుర్తించామా??

"The Man Who Knew Infinity" సినిమా ద్వారా ప్రపంచానికి, మనకి కూడా పరిచయమయ్యారు మేథమ్యాటిక్స్ జీనియస్సు – శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్. క్రీస్తు శకం 5వ శతాబ్దపు గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట నుంచి 12వ శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్యుడి వరకు సుమారు 800 ఏళ్ల పాటు గణితంలో భారతదేశానిదే అగ్రస్థానం. ఆ తర్వాత మరో 700 ఏళ్లకు పుట్టి, గణితంలో మన భారతదేశ ఖ్యాతిని మళ్లీ నిలబెట్టిన మహామేధావి ఆయన. ఆయన జీవితంలో ఒడిదుడుకులు, కష్టనష్టాలు, మలుపులు, గెలుపులు.. అలా తెలిసివచ్చాక, తేటతెల్లమయ్యాక అయినా ఆయనకు ఇవ్వవల్సిన గౌరవం ఇస్తున్నామా? దక్కవల్సిన గుర్తింపు దక్కిందా? ఏటేటా రామానుజన్ జయంతి - డిశంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం జరుపుకొని చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాలే సమాధానం చెప్పాలంటున్నారు ఆయన అశేష అభిమానులు.

Updated Date - 2022-12-22T17:53:02+05:30 IST