Moodami 2022: మూఢమి వచ్చేసింది బాబోయ్.. ఈ 79 రోజులు చేయకూడనివి..చేసుకోదగినవి ఇవే..
ABN , First Publish Date - 2022-09-19T03:30:08+05:30 IST
భాజాభజంత్రీలు, కళ్యాణ మండపాల అలంకరణలు, బంధుమిత్రుల రాకపోకలు, కొత్తగా ఇల్లు కట్టుకోవటం కోసం శంకుస్థాపనల హడావుడి.. ఇటువంటి వాటికి..
ముహూర్తాలకు సెలవు!
ఆరంభమైన మూఢమి
మూడు నెలలు శుభకార్యాలకు విరామం
అనేక రంగాల వారిపై ప్రభావం
భాజాభజంత్రీలు, కళ్యాణ మండపాల అలంకరణలు, బంధుమిత్రుల రాకపోకలు, కొత్తగా ఇల్లు కట్టుకోవటం కోసం శంకుస్థాపనల హడావుడి.. ఇటువంటి వాటికి శ్రావణమాసం నెలవయింది. భాద్ర మాసం ప్రారంభం కావటంతో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనంతో కొద్ది రోజుల కిందట ముగిసింది. సాధారణంగా కొన్ని సంవత్సరాలలో భాద్రపద మాసం, ఆశ్వీయుజం, కార్తీక మాసంలో కూడా శుభకార్యాలకు ముహూర్తాలు ఉంటాయి. దీంతో శ్రావణమాసం తర్వాత అతి కొద్ది విరామంలోనే మళ్లీ శుభకార్యాల సందడి ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం శుభకార్యాలకు దాదాపు మూడు నెలల సుదీర్ఘ విరామం వ చ్చింది. దీనికి కారణం గురువారం నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం కావటమే. దీన్నే మూఢమి అని కూడా పిలుస్తారు. ఇది డిసెంబరు 2వ తేదీ వరకు అంటే 79 రోజులపాటు ఉంటుంది. దీంతో ముహూర్తాలకు విరామం ఇచ్చినట్లయింది.
సూర్యునికి శుక్రుడు దగ్గరగా రావడమే కారణం
గ్రహమండలంలో సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. ఈ తిరిగే క్రమంలో భూమి, సూర్యుడు, ఏదో ఒక గ్రహం ఒకే వరుసలోకి వచ్చినప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్న వారికి కనిపించదు. దీన్ని అస్తంగత్వం అని పిలుస్తారు. గ్రహాలకు రాజైన సూర్యునికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహం వచ్చినా అది తన శక్తిని కోల్పోతుంది. అలా బృహస్పతి(గురువు) సూర్యుని దగ్గరకు వచ్చినప్పుడు గురు మౌఢ్యమి గాను, శుక్రుడు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యమిగాను పిలుస్తారు. అయితే చంద్రుడు, బుధుడు వంటి మిగతా గ్రహాలు కూడా సూర్యునికి ఏదో ఒక సమయంలో దగ్గరగా వస్తున్నప్పటికీ గురువు, శుక్రుడు అలా వచ్చిన ప్పుడు మాత్రమే జ్యోతిష్యశాస్త్రం దానిని మూఢమిగా పేర్కొంటుంది. కారణం శుభకార్యాలకు గురు, శుక్ర గ్రహాల బలం ముఖ్యం. ఆ రెండు గ్రహాలు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి శక్తిని కోల్పోయి బలహీన మవుతాయి కనుక అటువంటి సమయం ఎటువంటి శుభకార్యాలకు పనికిరాదని పంచాంగకర్తలు చెబుతారు. ప్రస్తుతం గురువారం నుంచి శుక్రుడు సూర్యునికి దగ్గరగా రావటంతో శుక్రమౌఢ్యమిగా పరిగణిస్తూ, ఇది వెళ్లేంతవరకు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని పంచాంగాలు నిర్దేశిస్తున్నాయి.
చేయకూడనివి..చేసుకోదగినవి..
అయితే మూఢమి సమయంలో చేసే పనులు.. చేయకూడని పనుల విషయాన్ని కూడా జ్యోతిష్య శాస్త్రం, పంచాంగకర్తలు స్పష్టంగా పేర్కొన్నారు. అన్నప్రాసన, భూముల కొనుగోలు, అమ్మకాలు, నూతన వాహనాల కొనుగోలు, నవగ్రహ శాంతులు, జపాలు, హోమాలు, సీ మంతం, నామకరణం మొదలైన కార్యక్రమాలను ఈ మూఢమిలో సైతం మంచి తిధి, వార నక్షత్రం ప్రకారం చేసుకోవచ్చు. ఇక నిశ్చి తార్థం, వివాహం, పుట్టువెంట్రుకలు తీయించటం, శంకుస్థాపన, నూతన గృహప్రవేశం, ఇల్లు మారటం, ఉపనయనం, విగ్రహ ప్రతిష్ట, వ్రతాలు, బావులు, బోరింగులు, చెరువులు తవ్వించటం, నూతన వ్యాపార ఆరంభం, చెవులు కుట్టించటం వంటివి ఈ మూఢమి సమ యంలో చేయకూడదు.
అనేక రంగాలపై ప్రభావం
మూఢమి ప్రభావంతో దాదాపు మూడు నెలల పాటు ముహూర్తాలు లేకపోవటం, ఆ తర్వాత కొన్ని ఉన్నప్పటికీ అవి అంతగా బలమైనవి కాకపోవటంతో దీని ప్రభావం అనేక రంగాల వారిపై పడ నుంది. గృహప్రవేశాలు, వివాహాలు వంటి శుభకార్యాలపై ఆధారపడి పురోహితుల దగ్గర నుంచి కళ్యాణమండపాల నిర్వాహకులు, డెకరేషన్, లైటింగ్, క్యాటరింగ్, పూల వ్యాపారులు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, మేళతాళాల వారు ఇలా ఎన్నో రంగాల వారు జీవిస్తున్నారు. వీరే కాకుండా సినీ ఆర్కెస్ర్టా నిర్వహించే కళాకా రులు ఇలా వీరికి కూడా ఈ మూడు నెలలు గడ్డుకాలమే. ఇక ముహూర్తాలు ఉంటే వస్త్ర, బంగారు, వెండి, గిఫ్ట్ ఆర్టికల్స్, నిత్యావసర వస్తువుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి శంకుస్థాపనలు లేకపోవటంతో గృహనిర్మాణ రంగంపై పడనుంది. దీంతో ఆయా రంగాల వారికి ఆదాయం తగ్గి జీవనం మరింత భారం కానుంది.