Leg Lengthening Surgery: మూడంగుళాల పొడవు పెరిగేందుకు.. రూ. 1.2 కోట్లు ఖర్చు చేసిన 68 ఏళ్ల వృద్ధుడు!
ABN , First Publish Date - 2022-11-18T16:55:41+05:30 IST
పొట్టిగా ఉండేవారు గట్టిగా ఉంటారన్నది సామెత. ఆత్మన్యూనత నుంచి వారిని బయటపడేసేందుకే బహుశా ఈ సామెత పుట్టుకొచ్చి ఉండొచ్చు.
లాస్‌వెగాస్: పొట్టిగా ఉండేవారు గట్టిగా ఉంటారన్నది సామెత. ఆత్మన్యూనత నుంచి వారిని బయటపడేసేందుకే బహుశా ఈ సామెత పుట్టుకొచ్చి ఉండొచ్చు. జన్ముపరమైన కారణాలు, వంశపారంపర్యం వంటివి పొట్టిపొడవులను నిర్ణయిస్తుంటాయి. పొట్టిగా ఉండేవారిలో ఆత్మన్యూతన ఎక్కువని చాలా అధ్యయనాలు కూడా తేల్చాయి. దీంతో ఎలాగైనా కాస్తంత పొడవు పెరగాలని చాలామంది భావిస్తుంటారు. ఇలాంటి వారిలో సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిఖిల్‌రెడ్డి ఒకరు. ఎత్తుపెంచుకునేందుకు ఆయన చేసుకున్న లెగ్ లెంథనింగ్ ఆపరేషన్ (Leg Lengthening Surgery) అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.
తాజా విషయానికి వస్తే అమెరికాకు చెందిన రాయ్ కాన్ (Roy Conn) 68 ఏళ్ల వయసులో లెగ్ లెంథనింగ్ ఆపరేషన్ చేయించుకుని రికార్డులకెక్కాడు. మూడు అంగుళాల ఎత్తు పెరిగేందుకు భారత కరెన్సీలో రూ. 1.2 కోట్లు ఖర్చు చేశాడు. తొడ ఎముకలు విరగ్గొట్టి వాటి మధ్య దూరం పెంచే ఈ ఆపరేషన్ చాలా బాధకరమైనది. అయినప్పటికీ ఎత్తు పెరగాలన్న ఒకే లక్ష్యంతో అంతటి బాధను భరించాడు. ఐదడుగుల ఆరంగుళాలు ఉన్న రాయ్ కాన్ ఈ సంక్షిష్టమైన ఆపరేషన్ తర్వాత ఐదడుగుల 9 అంగుళాలకు పెరిగాడు. అంటే మూడంగుళాలు పెరిగేందుకు ఏకంగా రూ.1.20 కోట్లు ఖర్చు చేశాడు.
లెగ్ లెంథనింగ్‌లో నిపుణుడైన కాస్మొటిక్ సర్జన్ కెవిన్ డెబిపర్షద్ (Kevin Debiparshad) ఈ ఆపరేషన్ నిర్వహించారు. లాస్‌వెగాస్‌లో ఆయనకు క్లినిక్ ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటాలో పనిచేసే ఉద్యోగులు ఆయన క్లయింట్లుగా ఉన్నారు. కాన్ తన అనుభవం గురించి చెబుతూ.. ఇది చాలా పెద్ద సమస్యని అన్నారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచే తనకు ఈ విషయం తెలుసన్నారు. ఆపరేషన్‌కు డబ్బులు భరించే స్థోమత తనకు ఇప్పుడు కలగడంతో సర్జరీ చేయించుకున్నట్టు చెప్పారు.
పొట్టిగా ఉంటానన్న భావన తనను వేధించేదని కాన్ పేర్కొన్నారు. ఈ విషయంలో తన కంటే తన భార్యే ఎక్కువగా బాధపడేదని అన్నారు. అయితే, తానెలా ఉన్నా తన భార్య ఇష్టపడేదని, కానీ తన కోసం తాను పొడవు పెరగాలని అనుకున్నట్టు వివరించారు. సర్జరీకి తక్కువ సమయమే పట్టినా కోలుకునేందుకు మాత్రం కొన్ని నెలలు పడుతుందని కాన్ వివరించారు.
పొడవు పెరగడానికి కొన్ని నెలల సమయం పడుతుందని డాక్టర్ డేవిపర్షద్ తెలిపారు. రోజుకు మిల్లీమీటరు పొడవు మాత్రమే పెరుగుతారని అన్నారు. అంటే ఈ లెక్కన 25 రోజులకు అంగుళం పెరుగుతారని, మూడు అంగుళాలు పెరిగేందుకు రెండు నెలల సమయం పడుతుందని వివరించారు. ఎంత పొడవు పెరగాలన్న దానిపై ఖర్చు ఆధారపడి ఉంటుందన్నారు. లెంథనింగ్ విధానంలో తొలుత తొడ ఎముకలను విరగ్గొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటి మధ్య లోహపు గోర్లు అమరుస్తారు. వాటిని మూడు నెలలపాటు ప్రతి రోజూ మాగ్నటిక్ రిమోట్ కంట్రోల్‌తో సర్దుబాటు చేస్తుంటారు.
ఇక నిఖిల్‌రెడ్డి విషయానికి వస్తే.. ఇంట్లో వారికి సమాచారం ఇవ్వకుండా పొడవును పెంచుకునేందుకు గ్లోబల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత నిఖిల్ దాదాపు 8 నెలలపాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత మాత్రం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడం మొదలైంది. మరోవైపు, నిఖిల్‌కు శస్త్రచికిత్స చేసిన వైద్యుడిని మెడికల్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.