Smoking Inside Plane : విమానంలో స్మోకింగ్.. షాకింగ్ వీడియో వైరల్.. మంత్రి జ్యోతిరాధిత్య సింథియా రియాక్షన్ ఇదీ
ABN , First Publish Date - 2022-08-12T01:58:26+05:30 IST
విమానం(Plane)లో స్మోకింగ్(smoking).. వినడానికే షాకింగ్‌గా అనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

న్యూఢిల్లీ : విమానం(Plane)లో స్మోకింగ్(smoking).. వినడానికే షాకింగ్‌గా అనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్స్టాగ్రామ్(Instagram)లో 6.30 లక్షలకుపైగా ఫాలోయర్స్ కలిగివున్న బాబీ కటారియా(Bobby kataria) అనే గుర్గావ్ నివాసి ఈ ఆకతాయి చర్యకు పాల్పడ్డాడు. స్పైస్‌జెట్(SpiceJet) విమానంలో వెలుగుచూసిన ఈ ఘటనపై డీజీసీఏ(Directorate General of Civil Aviation) విస్మయం వ్యక్తం చేసింది. నిందితుడు బాబీ కటారియాపై వెంటనే కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా నిందితుడు విమానంలో సీటుపై దర్జాగా పడుకొని సిగరెట్ కాల్చుతున్నట్టు వీడియోలో స్పష్టమైంది. లైటర్ వెలిగించి సిగరెట్ కాల్చాడు. వీడియో కట్ అవ్వడానికి ముందు 2 సార్లు పొగ ఊదడం వీడియోలో కన్పించింది.
ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాబీ కటారియాకు శిక్ష ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింథియాకు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు. ‘ విచారణ జరుగుతోంది. ఇలాంటి హానికరమైన ఘటనల విషయంలో ఉపేక్షించేదే లేదు’ అని ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. కాగా ఇది పాత వీడియోగా తమ దృష్టికి వచ్చినట్టు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని, తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై నిందితుడు బాబీ కటారియా తనను తాను సమర్థించుకున్నాడు. న్యూస్ రిపోర్టుల స్ర్కీన్ షార్ట్‌లను తన ఇన్‌స్టా వాల్‌పై పోస్ట్ చేశాడు. టీఆర్పీ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మీడియాపై నిందలు వేసే ప్రయత్నం చేశాడు. కాగా విమానాల్లో ధూమపానం ప్యాసింజర్లకు అసౌర్యంతోపాటు అత్యంత ప్రమాదకరం. భారత్‌లో విమానాల్లో ధూమపానం నిషేధించబడింది. కాగా గతంలో కూడా నిందితుడు కటారియా నడి రోడ్డుపై కూర్చుని మద్యం సేవించినందుకు అతడిపై ఒక కేసు నమోదయ్యింది.