కట్నం వేధింపుల కేసులో జైలు కెళ్లిన భర్త.. 23 ఏళ్ల తరువాత నిర్దోషిగా తేల్చిన కోర్టు

ABN , First Publish Date - 2022-02-03T10:12:18+05:30 IST

కట్నం వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మరణానికి భర్త కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో జిల్లా కోర్టు నిందితుడి జైలు శిక్ష విధించింది...

కట్నం వేధింపుల కేసులో జైలు కెళ్లిన భర్త.. 23 ఏళ్ల తరువాత నిర్దోషిగా తేల్చిన కోర్టు

కట్నం వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మరణానికి భర్త కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో జిల్లా కోర్టు నిందితుడి జైలు శిక్ష విధించింది. కానీ నిందితుడు కోర్టు తీర్పు సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ కేసులో 23 ఏళ్ల తరువాత హైకోర్టు నిందితుడిని నిర్ధోషిగా తీర్పు చెప్పింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ నగరంలో నివసించే లక్ష్మీకాంత్ అనే వ్యక్తికి అదే నగరానికి చెందిన హర్షలత అనే మహిళతో 1997లో వివాహం జరిగింది. కానీ ఆరు నెలల తరువాత హర్షలత ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిన నాలుగు రోజుల తరువాత హర్షలత తండ్రి అశోక్ కుమార్ తన అల్లుడి వల్లనే కూతురు చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి కట్నం కింద ఒక స్కూటర్, సోఫా సెట్, బంగారం, ఒక కలర్ టీవి ఇవ్వాలని హర్షలతను వేధించేవారని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే హర్షలత చనిపోయే ముందు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరాన్ని ఆధారంగా చూపించాడు.


ఈ కేసులో లక్ష్మీకాంత్‌కు జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. 1999లో జైలు నుంచి బెయిల్‌పై బయటికొచ్చిన లక్ష్మీకాంత్‌ జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ బిలాస్‌పూర్ హైకోర్టులో పిటీషన్ వేశాడు. ఆ కేసు 23 ఏళ్ల వరకు విచారణలో ఉంది. ఇటీవలే హైకోర్టు మృతురాలు రాసిన ఉత్తరాన్ని పరిశీలించి.. అందులో హర్హలత ఎక్కడా తన భర్త వేధిస్తున్నాడనే అంశం లేదని గమనించింది. అది ఆమె తన భర్తకు చివరిసారిగా భావోద్వేగంతో రాసిన ఉత్గరమని చెప్పి.. లక్ష్మీకాంత్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.


Updated Date - 2022-02-03T10:12:18+05:30 IST