Mahesh Daughter Sitara: ఊరుకోరా.. సితార.. మహేష్ కూతురు అంత ఎమోషనల్ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-28T19:17:03+05:30 IST

అమ్మమ్మ, నాయనమ్మ అనే బంధాల విలువ తెలుసుకోలేనంతగా పురోగతి సాధించిన రోజులివి. కొందరు కన్న కొడుకులే వృద్ధులైన అమ్మానాన్నలను..

Mahesh Daughter Sitara: ఊరుకోరా.. సితార.. మహేష్ కూతురు అంత ఎమోషనల్ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే..

అమ్మమ్మ, నాయనమ్మ అనే బంధాల విలువ తెలుసుకోలేనంతగా పురోగతి సాధించిన రోజులివి. కొందరు కన్న కొడుకులే వృద్ధులైన అమ్మానాన్నలను నడి వీధికి నెట్టేస్తున్న ప్రస్తుత సమాజంలో ఆ అనుబంధాల మాధుర్యం.. అమ్మమ్మ, నాయనమ్మల మమతానురాగం మనుమడు, మనవరాలికి ఎలా తెలుస్తుందనుకోగలం. కానీ.. అందరూ అలా ఉన్నారనుకోవడం కూడా పొరపాటే. ఈరోజుల్లో కూడా అమ్మమ్మ ఒడిలో తలపెట్టి, నాయనమ్మ చెప్పే కథలు వింటూ ఆ అనుబంధాల మాధుర్యాన్ని ఆస్వాదించే మనమళ్లూ, మనుమరాళ్లు కూడా ఉన్నారని తాజాగా కనిపించిన ఒక దృశ్యం కళ్లకు కట్టింది. నాయనమ్మ అంటే ఆ మనమరాలికి ఎంత ప్రేమో అందరికీ తెలిసేలా చేసింది. ఆ చిన్నారి మరెవరో కాదు. టాలీవుడ్ నటుడు (Tollywood Hero) మహేష్ బాబు (Mahesh Babu) కుమార్తె ఘట్టమనేని సితార (Mahesh Babu Daughter Sitara). మనమరాలికి మరపురాని జ్ఞాపకాలకు మిగిల్చిన ఆ నాయనమ్మే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (Mahesh Mother Indira Devi). బుధవారం వేకువజామున ఇందిరా దేవి (80) (Mahesh Mother Passed Away) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మహేష్ బాబుకు అమ్మంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సందర్భాల్లో తల్లితో తనకు ఉన్న అనుబంధాన్ని మహేష్ చెప్పడం చూసే ఉంటారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా తన తల్లిని ఏనాడు మహేష్ నిర్లక్ష్యం చేయలేదు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.కానీ.. మహేష్ బాబు కూతురు సితారకు నాయనమ్మతో ఎంతటి అనుబంధం ఉందో తెలిశాక మహేష్ అభిమానులు భావేద్వేగానికి లోనయ్యారు. ఎప్పుడూ నవ్వుతూనవ్విస్తూ హుషారుగా, ఛలాకీగా ఉండే సితార నాయనమ్మ ఇక లేదని తెలిశాక వెక్కివెక్కి ఏడ్చింది. నాయనమ్మ భౌతికకాయాన్ని చూసి బోరుమని విలపించింది. తండ్రి ఒడిలో కూర్చుని ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక ఆ లేత హృదయం తల్లడిల్లిన దృశ్యాలు మహేష్ అభిమానులను, మనసున్న ప్రతీ ఒక్కరి కళ్లను చెమ్మగిల్లేలా చేశాయి. సితార చిన్నబోయిన ఆ వీడియో (Sitara Crying Video) అమ్మమ్మ, నాయనమ్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకునేలా చేసింది. తల్లి భౌతికకాయం కళ్ల ముందు కనిపిస్తుంటే బరువెక్కిన గుండెతో బాధను దిగమింగుకుని సితారను మహేష్ ఓదార్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాయనమ్మ తనను వదిలి వెళ్లిపోయిందని తెలిసి సితార వ్యక్తం చేసిన బాధను మాటల్లో చెప్పలేం. ఇప్పుడు మాత్రమే కాదు.. నాయనమ్మపై సితార తనకు ఉన్న ప్రేమను ఇన్‌స్టాగ్రాం వేదికగా ఇటీవలే పంచుకుంది.ఇందిరా దేవి పుట్టినరోజు నాడు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘Happy Birthday Nainamma!! There’s no other like you.. Love you so much’ అని సితార పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. కన్న తండ్రిని, కన్న కూతురిని, తోబుట్టువులను ఓదార్చుతూ మహేష్ బయటకు కాస్తంత నిబ్బరంగానే కనిపించినప్పటికీ తల్లి లేని లోటు మాత్రం ఎవరూ పూడ్చలేనిది. లోలోపల మహేష్‌‌ను తొలిచేసే బాధది. మహేష్ కుటుంబంలో 2022లో జరిగిన రెండో విషాదం ఇది. 2022 జనవరిలో మహేష్ సోదరుడు రమేష్ బాబు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ తల్లి ఇందిరా దేవి మృతి చెందడం.. ఈ రెండు ఘటనలు మహేష్‌తో పాటు ఆయన తండ్రి ఘట్టమనేని కృష్ణను కూడా మరింత కుంగదీశాయి. మహేష్ బాబు కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకున్నారు. గుండె ఆపరేషన్లు చేయించి ఎన్నో పసి హృదయాలకు ప్రాణం పోసిన మహేష్ లాంటి హీరోను తమకు ఇచ్చిన ఆ తల్లికి సోషల్ మీడియా సాక్షిగా నివాళి తెలుపుతున్నారు.

Read more