ప్రధాని పదవిలో ఉంటూ కూడా లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు అప్పు చేశారంటే...

ABN , First Publish Date - 2022-10-02T15:22:10+05:30 IST

జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల...

ప్రధాని పదవిలో ఉంటూ కూడా లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు అప్పు చేశారంటే...

జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న జరుపుకుంటారు. నేడు భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి. దేశ స్వాతంత్ర్య సాధనలో ఆయన చేసిన కృషి మరువలేనిది. శాస్త్రీజీని అత్యుత్తమ రాజనీతిజ్ఞునిగా పరిగణిస్తారు. జీవితంలో ఎదురైన కష్టాలను చాలా తేలికగా అధిగమించడంతో ఆయన అందరికీ స్ఫూర్తిదాయకునిగా నిలిచారు.  ప్రధాని అయ్యాక కూడా ఆయన ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. శాస్త్రీజీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2, 1904న మొఘల్‌సరాయ్ (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్)లో జన్మించారు. అతని తండ్రి పేరు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ తల్లి పేరు రామదులారి దేవి. అతని అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ. కుల వ్యవస్థను వ్యతిరేకించే ఆయన తన పేరులో నుండి ఇంటిపేరును తొలగించారు. లాల్ బహదూర్ శాస్త్రి బాల్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అతని తండ్రి మరణించాక అతనిని అతని మామ దగ్గరకు పంపారు. పాఠశాలకు వెళ్లేందుకు శాస్త్రి రోజూ రెండుసార్లు గంగా నదిని ఈదుతూ దాటి వెళ్లి వచ్చేవారని చెబుతారు. 1925లో వారణాసిలోని కాశీ విద్యాపీఠం నుండి పట్టభద్రుడై "శాస్త్రి" బిరుదు పొందారు. 'శాస్త్రి' అనే పదం 'విద్వాంసుడు' లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన వ్యక్తిని సూచిస్తుంది. 1946లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, పాలనలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అర్హులైన అభ్యర్థుల కోసం వెతుకుతున్న సమయంలో పార్టీ ఆయనను ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించింది. 1947 ఆగస్టు 15న పోలీసు, రవాణా మంత్రిగా నియమితులయ్యారు. 


1951లో న్యూఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రివర్గంలో అనేక శాఖలు నిర్వహించారు.  లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కారు కొనుగోలు చేయాలనున్నారు. అయితే ఆ రోజుల్లో ఫియట్ కారు కొనుగోలు చేయాలంటే రూ. 12 వేలు కావాలి. కానీ ఆ సమయంలో అతని వద్ద రూ. 7 వేలు మాత్రమే ఉంది. దీంతో ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ 5 వేలు రుణంగా పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన నాడు కొనుగోలు చేసిన కారు ఇప్పుడు న్యూఢిల్లీలోని శాస్త్రి మెమోరియల్‌లో కనిపిస్తుంది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మరణం తరువాత, లాల్ బహదూర్ శాస్త్రి 1964, జూన్ 9న భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి అయ్యారు. అతని పదవీకాలం 1966, జనవరి 11 వరకు కొనసాగింది. శాస్త్రి ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆ సమయంలో ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు శాస్త్రిజీ తాష్కెంట్‌లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌ను కలవడానికి వెళ్ళారు. సమావేశం ముగిసిన కొన్ని గంటలకే ఆయన మరణించారు. 

Read more