Kaikala Satyanarayana: ఎవరీ జె ఎన్ చౌధురి..? ఏరికోరి మరీ ఆయన పాత్రలో కైకాలను ఎన్టీఆర్ ఎందుకు నటింపజేశారంటే..

ABN , First Publish Date - 2022-12-23T12:57:16+05:30 IST

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ సినీ నటజీవితంలో ఎన్నోన్నో మరపురాని పాత్రలు వేశారు. అవన్నీ ఒకెత్తు, 'జయం మనదే' అనే నాటకంలో వేసిన జనరల్ జె ఎన్ చౌధురి (Jayanto Nath Chaudhuri) పాత్ర ఒక్కటే ఒకెత్తు.

Kaikala Satyanarayana: ఎవరీ జె ఎన్ చౌధురి..? ఏరికోరి మరీ ఆయన పాత్రలో కైకాలను ఎన్టీఆర్ ఎందుకు నటింపజేశారంటే..

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) సినీ నటజీవితంలో ఎన్నోన్నో మరపురాని పాత్రలు వేశారు. అవన్నీ ఒకెత్తు, 'జయం మనదే' అనే నాటకంలో వేసిన జనరల్ జె ఎన్ చౌధురి (Jayanto Nath Chaudhuri) పాత్ర ఒక్కటే ఒకెత్తు.

నందమూరి నిర్దేశకత్వంలో...

నటరత్న నందమూరి తారక రామారావు (NTR) నిర్దేశికత్వంలో ‘జయం మనదే’ నాటకం ప్రదర్శించబడింది. దేశభక్తి ప్రభోదకంగా వేసిన ఆ నాటకంలో ఎన్టీఆర్ ఒక సామాన్య సైనికుడిగా నటించగా, జనరల్ జె ఎన్ చౌధురిగా కైకాల సత్యనారాయణ (Satyanarayana Biography) , రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గా వేయిగొంతుకల నేరెళ్ళ వేణుమాధవ్ (ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు) నటించారు.

రెండవ కాశ్మీర్ యుద్ధంగా పేరుపొందిన ఇండో- పాకిస్తాన్ యుద్ధకాలం - అంటే 1965. యుద్ధకాలంలో దేశానికి ఆలంబనగా జాతీయ రక్షణ నిధి కోసం ఎన్టీఆర్ ఈ దేశభక్తి ప్రభోదం ప్రధానంగా సాగే జయం మనదే నాటకం వేసి, ఆ నాటకం ద్వారా వసూలైన మొత్తాన్నీ జాతీయ రక్షణ నిధికి విరాళం ఇచ్చారు.

పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో మన దేశ రక్షణదళాధిపతి ( Chief of the Army Staff- COAS) జనరల్ జె ఎన్ చౌధురి వేషానికి తగిన నటుడు కైకాల మాత్రమేనని భావించారు ఎన్టీఆర్. అప్పటి మన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంగ్లీషులో చేసిన 3- పేజీల ఉపన్యాసాన్ని, తెలుగులో ఆయన గొంతుని అనుకరిస్తూ నేరెళ్ళ వేణుమాధవ్ చెప్పారట. జనరల్ జె ఎన్ చౌధురి - సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వయంగా వచ్చి నటించారా అని ప్రేక్షకులు సమ్మోహితులయ్యారని ఒక ఇంటర్యూలో నేరెళ్ల చెప్పారు.

ఎవరీ జయంతొ నాథ్ చౌధురి..

1965 పాకిస్తాన్ పై యుద్ధంలో మన దేశాన్ని విజేతగా నిలిపిన జనరల్ జయంతొ నాథ్ చౌధురి 1908లో అప్పటి బెంగాలులో పుట్టారు, 1983లో కీర్తిశేషులయ్యారు. స్వాతంత్ర్యానికి ముందు 1928 నుంచి ఇండియన్ ఆర్మీలో పలు హోదాల్లో పనిచేసిన చౌధురి, స్వాతంత్ర్యానంతరం న్యూఢిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో Military Operations & Intelligence డైరక్టర్ గా నియమితులయ్యారు. 1948లో హైదరాబాద్ పోలీస్ యాక్షన్ గా పేరొందిన Operation Polo కి నాయకత్వం వహించారు చౌధురి. హైదరాబాద్ విముక్తి అనంతరం, భారతదేశంలో విలీనమయ్యాక, హైదరాబాద్ రాష్ట్రానికి ఆయన మిలిటరి గవర్నర్ గా నియమించబడ్డారు.

1962 ఇండో-చైనా యుద్ధంలో, ఇండియా ఓటమికి బాధ్యుడిగా తప్పించబడ్డ అప్పటి ఆర్మీ ప్రధానాధికారి ప్రాణ్ నాథ్ థాపర్ స్థానంలో చౌధురి బాధ్యతలు స్వీకరించారు. ఇండో- పాక్ యుద్ధంలో మన దేశాన్ని గెలిపించారు. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా సరిహద్దు రక్షణ దళం (Border Security Force- BSF) అనే పారామిలిటరీ దళం స్థాపనకి బీజం వేశారు. ఆ రోజుల్లోనే ఆయనని పద్మవిభూషణ్ అవార్డు వరించింది. 38 ఏళ్ల సుదీర్ఘమైన సేవల తర్వాత 1966లో ఉద్యోగవిరమణ చేశారు. ఆ తర్వాత మూడేళ్లు కెనడాకు భారత హై కమీషనర్ గా కొనసాగారు.

కైకాల మాత్రమే

ఆరడుగుల ఆజానుబాహుడు జనరల్ జె ఎన్ చౌధురి ఆకారానికి, ఆహార్యానికి, ఆంగికానికి, అభినయానికీ తగిన నటుడు కైకాల మాత్రమేనని ఎన్టీఆర్ నిర్ణయించారు. ఎన్టీఆర్ (NTR Movies) అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కైకాల (Satyanarayana Movies) పోషించిన చౌధురి పాత్రకి గొప్ప ప్రశంసలు దక్కాయి.

Updated Date - 2022-12-23T13:10:02+05:30 IST