Itlu Maredumilli Prajaneekam film review: పాత కథే, మళ్ళీ చెప్పారు!
ABN , First Publish Date - 2022-11-25T16:05:07+05:30 IST
ఇప్పుడు అదే బాటలో మరో సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (Itlu Maredumilli Prajaneekam) అనే సినిమా చేసాడు. సినిమా విడుదలకి ముందు ఇది ఎన్నికల నేపథ్యంలో రూపొందిన కథాంశంగా చెప్పారు.
నటీనటులు : అల్లరి నరేష్ (Allari Naresh), ఆనంది (Anandi), వెన్నెల కిశోర్ (Vennela Kishore), ప్రవీణ్, సంపత్ రాజ్, భరత్, రఘుబాబు తదితరులు
సినిమాటోగ్రఫీ : రామ్ రెడ్డి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
మాటలు : అబ్బూరి రవి
నిర్మాత : రాజేష్ దండా
రచన, దర్శకత్వం : ఏ.ఆర్. మోహన్
-- సురేష్ కవిరాయని
అల్లరి నరేష్ (Allari Naresh) ఈమధ్య కొంచెం సీరియస్ సినిమాలు చేద్దామని అనుకున్నట్టున్నాడు. అతని ముందు సినిమా 'నాంది' అతనికి మంచి పేరు తీసుకువచ్చింది. అది కొంచెం ఆలోచింప చేసే చిత్రం. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (Itlu Maredumilli Prajaneekam) అనే సినిమా చేసాడు. సినిమా విడుదలకి ముందు ఇది ఎన్నికల నేపథ్యంలో రూపొందిన కథాంశంగా చెప్పారు. అయితే ఈ సినిమా ఎలా వుంది, 'నాంది' సినిమా తెచ్చినట్టు ఈ సినిమా కూడా నరేష్ కి మంచి పేరు తీసుకు వస్తుందా లేదో చూద్దాం.

Itlu Maredumilli Prajaneekam story కథ:
శ్రీపాద శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఒక మామూలు తెలుగు ఉపాధ్యాయుడు. తెలుగు బాషా అంటే ప్రాణం, అలాగే అతను ఎవరయినా ఆపదలో వున్నా, కష్టాల్లో వున్నా సాయం చేసే గుణం ఉన్న మనిషి. ఎన్నికల విధి నిర్వహణ కోసం రంప చోడవరం సమీపంలోని కొండ ప్రాంతం అయిన మారేడుమిల్లి వెళతాడు. అక్కడ ప్రజలు తమకు కనీస అవసరాలు అయిన పాఠశాల, ఆసుపత్రి, వూరు నుండి బయట రవాణా కోసం ఏటి మీద ఒక బ్రిడ్జి కావాలని, అవి ఇస్తేనే ఓటు వేస్తాము అని నిర్ణయం తీసుకుంటారు. అక్కడి గ్రామ ప్రజలు ఆలా అన్నా కూడా శ్రీనివాస్ తన విధి నిర్వహణ తాను చేస్తా అని చెప్తాడు. ఈలోపు పురిటి నొప్పులు పడుతున్న ఒక మహిళలను ప్రకృతి వైద్యం ద్వారా శ్రీనివాస్ బిడ్డను, తల్లిని బతికిస్తాడు. ఆ తరువాత అక్కడి గిరిజన ప్రజలు అందరూ ఈ ఉపాధ్యాయుడు ఏమి చెపితే అది చేస్తాం అని అక్కడ నూటికి నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ వాళ్ళు కోరుకున్న సదుపాయాలు ప్రభుత్వానికి తెలపాలి అంటే బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను గ్రామ ప్రజలు కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ అయిన అధికారులను విడిపించడానికి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం కొండ ప్రాంత గిరిజనల సమస్యలు తీర్చిందా? ఈ కిడ్నాప్ వెనక అసలు కథ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఓటు హక్కు, ఎన్నికలు ఇలాంటి నేపధ్యం వున్న సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. అయితే అవి 80, 90 దశకాల్లో చాలా ఎక్కువగా వచ్చాయి. అలాగే రాజకీయ నాయకులకి కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారన్న విషయం మీద కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమా కూడా అయిదేళ్లకొకసారి వచ్చే ఎన్నికలు, సమస్యలు తీర్చకపోవటం లాంటి కథనే దర్శకుడు మోహన్ ఎంచుకున్నాడు. పోనీ కథ పాతదే అయినా, మోహన్ ఏమైనా కొత్తగా చూపిస్తాడా అని అనుకుంటే అదీ లేదు. ఏమి జరగబోతోంది అన్న విషయం ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతూ ఉంటుంది. అదీ కాకుండా, దర్శకుడు చెప్పే కథనం కూడా అంత ఆసక్తికరంగా ఉండదు. కొన్ని సన్నివేశాల్లో మరీ సాగదీసినట్టుగా ఉంటూ ఉంటుంది.

ఎటువంటి సినిమా అయినా భావోద్వేగాలు ప్రేక్షకుడి మనసుని కట్టిపడేయాలి. అది ఎంటర్ టైన్ మెంట్ అయినా, వేరే డ్రామా అయినా, ఇంకో కథ అయినా అందులో చెప్పే పాయింట్ ప్రేక్షకుడికి ఆసక్తిగా ఉండాలి, కట్టి పడేయాలి. అలాంటిది ఈ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మామూలుగా సాగిపోతుంది. కొండ ప్రాంతాల ప్రజలు తమ సమస్యల కోసం ఓటు వేయం అంటారు, కానీ ఒక ఉపాధ్యాయుడు వచ్చి అదే ఓటు హక్కుతో వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఎలా సాధించుకోవాలో చెప్తాడు. ఇదీ టూకీగా కథ. కానీ చెప్పడం లోనే దర్శకుడు విఫలం అయ్యాడనే చెప్పాలి. పాత కథనే మళ్ళీ పాతగానే చెప్పాడు దర్శకుడు, కానీ కొత్తగా ఏమి చెప్పలేదు. అలాగే కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా వున్నాయి, సహజత్వం లోపించింది.
అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. సినిమా కథ, చూపించే విధానం పాతదే అయినా, మాటలు మాత్రం కొత్తగా వున్నాయి. మాటల రచయిత అబ్బూరి రవిని ఖచ్చితంగా అభినందించాలి. మంచి మాటలు రాసినందుకు, అవి అర్థవంతంగా వున్నందుకు, కొన్ని అయితే ఆలోచింపచేసేవిగా ఉంటాయి. 'అందరం గొప్పవాళ్ళం అయిపోవాలని అనుకుంటున్నాం, కానీ ఎవరూ ముందుగా మనిషిగా అనుకోవటం లేదు' లాంటి మాటలు హత్తుకుంటాయి. ఇలాంటి మాటలు చాలా వున్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పచ్చని పొలాలు, అడవి చక్కగా చూపించారు. సంగీతం కూడా పరవాలేదు అనిపించింది.

ఇంకా నటీనటుల విషయానికి వస్తే, నరేష్ మరో సరి తాను ఒక ఒక సీరియస్ రోల్ చెయ్యగలను అని మరోసారి నిరూపించాడు. ఇంతకు ముందు చేసిన 'నాంది' సినిమా పాత్రకి దీనికి చాల వ్యత్యాసం వున్నా, ఇది కూడా అలాంటి సీరియస్ పాత్రే. బాగా చేసాడు. ఆనంది కథానాయికగా అంటే గిరిజన యువతి గా బాగుంది, కానీ ఆమె పాత్ర అంత శక్తివంతమయినది కాదు. వెన్నెల కిశోర్, ప్రవీణ్ అప్పుడప్పుడు నవ్వులు చిందించారు. అలాగే రఘుబాబు కూడా కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. సంపత్ రాజ్ కి కూడా ఇలాంటి కలెక్టర్ రోల్ చెయ్యడం కొత్త ఏమి కాదు, అతనిలో కొత్తదనం కూడా ఏమి కనిపించదు. గిరిజన పాత్రలో వేసిన వాళ్ళు అందరూ బాగా చేసారు.
చివరగా, 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా కథ పాతదే, కొత్తగా ఏమి లేదు అందులో. నరేష్ నటన, అబ్బూరి రవి మాటలు ఇందులో హైలైట్స్. అంతే. దర్శకుడు మోహన్ ప్రేక్షకులను కట్టి పడేశాలా భావోద్వేగాలను చూపించలేకపోయారు. ఇంకా కొంచెం శ్రద్ధ చూపించి తీసే బాగుండేది.