Kamal Haasan - Vamsy: వంశీ నోట ఆయన పేరు.. అప్పటిదాకా నిల్చోబెట్టి మాట్లాడిన కమల్ వెంటనే కుర్చీ వేయించి మరీ..

ABN , First Publish Date - 2022-09-18T03:22:16+05:30 IST

అక్కడ ఉళగ నాయకుడు కమల్ హాసన్ (kamal haasan) - ఎదురుగా వైవిధ్య చిత్రాల విశిష్ట దర్శకుడు వంశీ (Director Vamsy). అయితే అప్పటికి లోకనాయకుడు కాకపోయినా..

Kamal Haasan - Vamsy: వంశీ నోట ఆయన పేరు.. అప్పటిదాకా నిల్చోబెట్టి మాట్లాడిన కమల్ వెంటనే కుర్చీ వేయించి మరీ..

అక్కడ ఉళగ నాయకుడు కమల్ హాసన్ (kamal haasan) - ఎదురుగా వైవిధ్య చిత్రాల విశిష్ట దర్శకుడు వంశీ (Director Vamsy). అయితే అప్పటికి లోకనాయకుడు కాకపోయినా, కమల్ పెద్ద హీరోనే. కానీ, వంశీ మాత్రం ఒకే ఒక సినిమాకి డైరక్టరు, అంతే.


వంశీ రాసిన జాబిల్లికూనలు నవల నచ్చి, కె విశ్వనాథ్ సతీమణి కళాతపస్వికి సిఫార్సు చేసి ‘శంకరాభరణం’ (sankarabharanam) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వేయించారు. వంశీ రాసిన ‘మహల్లో కోకిల’ని మహా ఇష్టపడిన ఏడిద నాగేశ్వర్రావు సతీమణి సిఫార్సు వల్ల వారి పూర్ణోదయా బ్యానరులో ‘సితార’కి (Sitaara) దర్శకుడిగా ఛాన్స్ కొట్టేశాడు వంశీ. ఆ రోజుల్లో - అంటే 1982లో.. మద్రాసు అరుణాచలం స్టూడియోలో.. ‘సాగరసంగమం’ (sagara sangamam) షూటింగ్... నూతి మీద కమల్ చేసే తకిట తథిమి తకిట తథిమి తందానా.. హృదయలయల గతుల జతుల థిల్లానా.. పాట చిత్రీకరణకి ముందు సాయంత్రం టిఫిన్ బ్రేక్‌లో అరుగు మీద కూర్చున్న కమల్ దగ్గరకి వంశీని తీసుకెళ్లి పరిచయం చేశారు నిర్మాత ఏడిద నాగేశ్వర్రావు.



హీరో గారి పొడి పొడి పలరింపు... కొద్ది నిమిషాల్లోనే ఆసక్తికరమైన సంభాషణగా సాగింది. అందుకు ముఖ్య కారణం - మహాదర్శకుడు గొడార్డ్. ప్రపంచ సినిమా స్థితిగతుల్ని, రూపురేఖల్ని మార్చేయడంతో పాటు ప్రపంచ సాహిత్యరంగం మీద కూడా తన ప్రభావం చూపించిన మహా దర్శకుడు, ఫ్రెంచ్ న్యూ వేవ్ (Nouvelle Vague) సినిమాకి ఆద్యుడైన దర్శకుడు గొడార్డ్ (Jean-Luc Godard ఝా-లుక్ గోడా) సెప్టెంబర్ 13 మంగళవారం స్విట్జర్లాండ్ చివరిశ్వాస తీసిన విషయం తెలిసిందే. ప్రపంచ సినిమాని ఇష్టపడే కమల్ హాసన్ గొడార్డ్‌కి మొదటి నుంచీ వీరాభిమాని. కాబట్టే ఒక పిల్ల డైరక్టర్ నోటి నుంచి గొడార్డ్ పేరు వినబడగానే ఒక్కసారి ఎలర్ట్ అయ్యారాయన. అప్పటిదాకా నిల్చోబెట్టే మాట్లాడిన హీరో ఆ కుర్ర డైరక్టర్‌కి కుర్చీ వేయించేశాడు.


"గొడార్డ్ 'Weekend' సినిమా చూశాను, అర్థం కాలేదు. అయితే, అకిరా కురసోవా (Akira Kurosawa) తీసిన 'దెర్సు ఉజ్లా (Dersu Uzala)' గొప్ప సినిమా," అని ముక్కు మీద గుద్దినట్టు తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పేశాడు కుర్ర డైరక్టర్ వంశీ. పిట్ట కొంచెమైనా కూత ఘనమే అనుకున్నాడు కమల్.


"లోతైన ఆలోచనలు, ఆబ్ స్ట్రాక్ట్ భావాలు, అంతుచిక్కని కథనాలు...  గొడార్డ్ అంత తేలికగా కొరుకుడు పడే ఘటం కాదు. ‘వీకెండ్’ సినిమా ఓ క్లాసిక్. బ్లాక్ హ్యూమర్... డార్క్ కామెడి అంటే నవ్వుల వెనక దాగిన కన్నీళ్లుగా చూడాలి. అప్పుడే బోధపడుతుంది సృజనశీలి అయిన దర్శకుడి బాధ," చెప్పాడు కమల్.



ఇంకా ఎన్నో మాటలు నడిచాయి... కబుర్లు దొర్లాయి... హితవులు దక్కాయి... ఇద్దరి మధ్య.


వంశీ: మీ అన్నయ్య చారుహాసన్ గారి అమ్మాయి సుహాసిని- నా మొదటి సినిమా మంచుపల్లకి హీరోయిన్. ఆ సినిమా ఎడిటింగ్ మీ ఇంటి మీదే చేశామండీ..

కమల్: ఇంతకీ రామూ కరియత్ తీసిన చెమ్మీన్ చూశావా?

వంశీ: లేదండీ, కానీ, తగళి శివశంకర పిళ్ళై రాసిన ఆ నవలకి గన్నవరపు సుబ్బరామయ్య చేసిన తెలుగు అనువాదం చదివేను.

కమల్: అవునా! తమిళం నుంచి తెలుగు అనువాదాలు ఏమి చదివావు?

వంశీ: జయకాంతన్ రాసిన 'కొన్ని సమయాల్లో కొందరు మనుషులు (సిల నేరంగిళిల్ సిలమణి దరగళ్) చదివాను. ఇంకా... 

"సరేగానీ వంశీ! క్లాడ్ చాబ్రోవ్ (Claude Chabrol)తీసిన 'ఎ డబుల్ టూర్ (À double tour)',  'జస్టే అవంత్ లా నూయిట్ (Juste avant la nuit)', నాడా (Nada/ The Nada Gang)' సినిమాలు చూడు. మళ్ళీ కలుద్దాం..."


షాట్ రెడీ అని పిలుపు రావడంతో లేచాడు కమల్.

Updated Date - 2022-09-18T03:22:16+05:30 IST