Super Star Krishna: నవలా నాయకుడే కాదు, నవలకే నాయకుడు..!

ABN , First Publish Date - 2022-11-15T16:19:07+05:30 IST

తెలుగు సినీ నవలానాయకుడుగా నటభూషణ్ శోభనబాబుకి పేరుండేది. డిటెక్టివ్ కథారచయిత టెంపోరావు డిటెక్టివ్ నవలా నాయకుడిగా, ప్రముఖ అపరాధ పరిశోధక రచయిత కొమ్మూరి సాంబశివరావ్ రాసిన ‘పట్టుకుంటే లక్ష’ వంటి సినిమాల్లో హీరోగా కృష్ణ నటించినప్పటికీ..

Super Star Krishna: నవలా నాయకుడే కాదు, నవలకే నాయకుడు..!

తెలుగు సినీ నవలానాయకుడుగా నటభూషణ్ శోభనబాబుకి పేరుండేది. డిటెక్టివ్ కథారచయిత టెంపోరావు డిటెక్టివ్ నవలా నాయకుడిగా, ప్రముఖ అపరాధ పరిశోధక రచయిత కొమ్మూరి సాంబశివరావ్ రాసిన ‘పట్టుకుంటే లక్ష’ వంటి సినిమాల్లో హీరోగా కృష్ణ నటించినప్పటికీ, ఆయనకి జేమ్స్ బాండ్ సినిమాల డ్యాషింగ్ అండ్ డేరింగ్ హీరోగానే గుర్తింపు. యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కోడూరి కౌసల్యాదేవి నవలల వెండితెర కథానాయకుడు, మధ్యతరగతి ఆడపిల్లల కలల రాకుమారుడు శోభన్‌బాబే.

కానీ, నిండైన విగ్రహం, ఉదాత్తమైన వ్యక్తిత్వం, చెదరని ధీరత్వం, గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక సంస్కారవంతమైన నవలా నాయకుడి పాత్రకి హీరో కృష్ణ ప్రేరణ కలిగించడం మాత్రం విశేషం. ఆ నవలా నాయకుడికి ‘కృష్ణ’ అని పేరుపెట్టడం, అదే నవల సినిమాగా తీసినప్పుడు హీరో కృష్ణ ఆ పాత్రని ధరించడం, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఇంకా ఇంకా విశేషం. ఆ నవల - మీనా, రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి; దాన్ని అదే పేరుతో తెరకెక్కించిన దర్శకురాలు విజయనిర్మల - టైటిల్ రోల్ (మీనా) పోషిస్తే, హీరో కృష్ణ పాత్రలో కృష్ణ సహజంగా ఒదిగిపోయారు.

‘మీనా’ నవలా నాయకుడి పేరు - కృష్ణ. పడవలాంటి కారు, చలవ కళ్లద్దాలతో అమ్మాయిల కలలలో మాత్రమే నిలిచిపోయే చాక్లెట్ బాయ్ కాడతను. ఆత్మాభిమానమే ఆభరణమైన యువకుడు. గాలివాటుగా, సందర్భానికి తగ్గట్టు నడుచుకోవడం తెలియని ముక్కుసూటి మనిషి. తన చుట్టూ ఉన్న మనుషుల్ని, పరిసరాల్నీ ప్రభావితం చేసే వ్యక్తిత్వం కృష్ణది. ముందస్తు ప్రణాళికతో ముందడుగు వేయడం మొదలెట్టాక, దారి మళ్లించే ప్రలోభాలు, తికమక పెట్టే ప్రశ్నలు, సందేహాలూ ఎదురవుతాయి.

కృష్ణ చూసిన సంబంధాన్ని తిరగ్గొట్టమని అతని చెల్లెలు (తన మరదలు) రాజేశ్వరికి పురెక్కిస్తుంది మీనా. మరొక దశలో తనని ఉన్న ఫళాన పెళ్లి చేసుకోమని కృష్ణని సతాయిస్తుంది మీనా. ఇవన్నీ అనూహ్యంగా వచ్చే సమస్యలు, సవాళ్లు. అటువంటి వాటిని స్పాంటేనియస్ గా ఎదుర్కొని నిబ్బరంగా ఎలా ఉండాలో ఒక వ్యక్తిత్వ వికాస బోధకుడిగా చేసి చూపిస్తాడు ఆ నవలలో నాయకుడు కృష్ణ. కాబట్టి, “మీనా’ సినిమాలో ఆ నవలానాయకుడి పాత్రని కృష్ణ పోషించాడు’ అనకూడదు; అటువంటి ఉదాత్తమైన పాత్ర రూపకల్పనకి హీరో కృష్ణ ప్రేరణ అయ్యాడు అనాలి,” అంటారు సినీపండితులు.

Updated Date - 2022-11-15T16:34:28+05:30 IST