54ఏళ్ల క్రితమే మృతి.. అయినా బార్డర్‌లో డ్యూటీ చేస్తున్న భారత జవాన్.. చైనా సైనికుల నుంచీ ప్రత్యేక గౌరవం!

ABN , First Publish Date - 2022-10-07T17:35:21+05:30 IST

ఆ జవాన్.. 54ఏళ్ల క్రితమే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కానీ ఆయనలో మాత్రం దేశ భక్తి మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. ఇప్పటికీ ఆ జవాన్‌ సరిహద్దులో పహారా కాస్తున్నాడు. అంతేకాదు.. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న ఇతర

54ఏళ్ల క్రితమే మృతి.. అయినా బార్డర్‌లో డ్యూటీ చేస్తున్న భారత జవాన్.. చైనా సైనికుల నుంచీ ప్రత్యేక గౌరవం!

ఇంటర్నెట్ డెస్క్: ఆ జవాన్.. 54ఏళ్ల క్రితమే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కానీ ఆయనలో మాత్రం దేశ భక్తి మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. ఇప్పటికీ ఆ జవాన్‌ సరిహద్దులో పహారా కాస్తున్నాడు. అంతేకాదు.. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న ఇతర జవాన్‌లనూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చైనా సైనికుల నుంచీ ప్రత్యేక గౌరవ మర్యాదలను స్వీకరిస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఆ సోల్జర్ పేరు హర్భజన్ సింగ్. 1946 ఆగస్టు 30న పంజాబ్‌లోని గుజ్రావాలా(ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో జన్మించాడు. ఈయన 1966లో పంజాబ్ రెజిమెంట్ నుంచి ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు. అనంతరం సిక్కింలో ఆర్మీ కానిస్టేబుల్‌గా పోస్టింగ్ పొందాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు ఆయన మరణించాడు. 1968లో గాడిద సాయంతో నదిని దాటుతూ అందులో పడి మృతి చెందాడు. సుమారు రెండు రోజుల తర్వాత హర్భజన్ సింగ్ మృతదేహం లభ్యమైంది. ఆయన మృతదేహానికి అధికారిక లాంఛనాలతో అధికారులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే.. మరణించిన తర్వాత కూడా హర్భజన్ సింగ్ డ్యూటీ చేస్తున్నాడని అక్కడ పని చేస్తున్న ఆర్మీ జవానులు గట్టిగా నమ్ముతున్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ సమయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వారిని ఎప్పటికప్పుడు హర్భజన్ సింగ్ అలర్ట్ చేస్తారట. డ్యూటీలో ఉండి నిద్రలోకి జారుకున్న సైనికుల చెంపలు వాయించి మరీ.. మేల్కొలుపుతాడట. సిక్కింలోని భారత్-చైనా సరిహద్దుల వద్ద డ్యూటీ చేస్తున్న/చేసిన అనేక మంది సైనికులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. అక్కడ పని చేస్తున్న ఓ సైనికుడికి హర్భజన్ సింగ్ కలలో కనిపించి.. హుటాహుటిన సరిహద్దు వెంట పెట్రోలింగ్ చేయమని హెచ్చరించాడట. దీంతో వెంటనే నిద్రలోంచి మేల్కొన్న ఆ జవాన్.. పెట్రోలింగ్‌కు వెళ్లాడట. అప్పుడే చైనా సైన్యం సరిహద్దు వెంట రెక్కీ నిర్వహించినట్టు ఆధారాలు బయటపడ్డాయట. ఈ విషయాన్ని ఆ సైనికుడు ఉన్నతాధికారు దృష్టికి తీసుకెళ్లడంతో.. అధికారులు కూడా హర్భజన్ సింగ్ ఆత్మ డ్యూటీ చేస్తుందన్న విషయాన్ని నమ్మారు. ఇతర సైనికుల మాదిరిగానే అన్ని సౌకర్యాలను హర్భజన్ సింగ్‌కు కల్పించారు. ప్రత్యేకంగా రూమ్‌ను కేటాయించడం దగ్గర నుంచి ప్రమోషన్ల వరకు నిబంధనల ప్రకారం అన్నీ కరెక్ట్‌గా చేశారు. ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు నెల నెలా జీతాన్ని మంజూరు చేసి, ఆ మొత్తాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో సాధారణ జవాన్‌గా ఆర్మీలో చేరిన హర్భజన్ సింగ్.. మరణానంతరం కెప్టెన్ హోదాలో రిటైర్ అయ్యారు.


హర్భజన్ సింగ్ కోసం ఉన్నతాధికారులు సరిహద్దులో ఆయన స్మారక భవనాన్ని నిర్మించారు. దాన్ని అక్కడి సైనికులు దేవాలయంగా భావిస్తారు. నాథులా పాస్‌లో పోస్టింగ్‌ వచ్చిన వాళ్లు, అక్కడికి వెళ్లిన వెంటనే పై అధికారులకు రిపోర్ట్‌ చేయడానికంటే ముందు హర్భజన్‌ స్మారక మందిరానికి వెళ్లి సెల్యూట్‌ చేస్తారు. ఇప్పటికీ సిక్కింలోని ఆర్మీ బేస్‌లో హర్భన్ సింగ్ కోసం ఓ గది కేటాయించి ఉంటుంది. రోజూ సైనికులు హర్భజన్ బూట్లు పాలిష్ చేస్తారు. బెడ్ షీట్లు మారుస్తారు. ఆయన గది బయట సెంట్రీగా ఒక సిపాయి డ్యూటీ చేస్తాడు. అంతేకాదు.. ఇండో-చైనా సరిహద్దులో ఉన్న జరిగే ఫ్లాగ్‌మీట్‌ కార్యక్రమంలో హర్భజన్ సింగ్ కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీ వంక చూసి సైనికులు సెల్యూట్ సైతం చేస్తారు. 


Read more