chanakya niti: ఈ విషయాలను ఎవరితో పంచుకున్నా మీరు నవ్వులపాలవుతారు... సరిదిద్దుకోలేని తప్పు మిమ్మల్ని చుట్టుముడుతుంది!
ABN , First Publish Date - 2022-10-19T12:00:09+05:30 IST
ఆచార్య చాణక్యుడు తన సదాలోచనలను దండగా గుచ్చడం...
ఆచార్య చాణక్యుడు తన సదాలోచనలను దండగా గుచ్చడం ద్వారా నీతిని రూపొందించాడు. అతని విధానాలు నేటికీ అమలు పరిచేవిధంగా ఉన్నాయి. వాటిలో మానవ జీవితానికి సంబంధించిన పలు అంశాలు వివరంగా ఉన్నాయి. అలాంటి జీవన విధానాలలో... మనిషి ఎవరికీ చెప్పకూడని విషయాలు ఏమిటో ఆచార్య చాణక్యుడు మనకు తెలియజేశాడు. ఈ విషయాలు ఇతరులకు తెలిస్తే, ఆ వ్యక్తికి సమాజంలో మనుగడం కష్టమవుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటిలోని లోటుపాట్లు
ఇతరులకు మీ ఇంటిలోని లోటుపాట్లను ఎప్పుడూ తెలియజేయవద్దు. ఇలా అన్ని విషయాలను బయట పెట్టుకోవడం వల్ల మీ కుటుంబానికి అపకీర్తి వస్తుంది. అందుకే ఇంటిలోని సమస్యను మీరే పరిష్కరించుకోండి. ఇంటిలోని దోషాలను ఇతరులకు చెప్పడం ద్వారా శత్రువులు దీనిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఇతరుల ముందు గౌరవం దెబ్బతింటుంది.
వైవాహిక జీవితం
భార్యాభర్తలు తమ వైవాహిక జీవితం గురించి ఇతరుల ముందు బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే వారి వైవాహిక జీవితంలో పొరపొచ్చాలు చోటుచేసుకుంటాయి. భార్యాభర్తల మధ్యగల సంబంధానికి సంబంధించిన ఏ విషయం కూడా మూడో వ్యక్తికి చేరకూడదని ఆచార్య చాణక్య సూచించారు.
సిద్ధ ఔషధం
సిద్ధ ఔషధం గురించి బహిరంగపరిస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాణక్యుడు తెలిపాడు. సిద్ధ ఔషధాల గురించి తెలిసిన వ్యక్తి దాని తయారీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. అప్పుడే ఆ ఔషధాలు సక్రమంగా పనిచేస్తాయని ఆచార్య చాణక్య తెలిపారు.
దానం
చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం దాతృత్వం అనేది చాలా గొప్ప విషయం. రహస్య దానం అందులో ప్రధానమైనది. ఇది పలువిధాలైన మంచి ఫలితాలను ఇస్తుంది. దానధర్మాల వలన కర్మ భారం తగ్గుతుంది. దానం చేయడం వలన చిత్తశుధ్ది ఏర్పడుతుంది.