Hyderabad Book Fair : ఈ-బుక్ యాప్స్ వల్ల ప్రింట్ బుక్స్ వినియోగం ఏమాత్రం తగ్గదు..!

ABN , First Publish Date - 2022-12-29T13:41:11+05:30 IST

తగ్గిపోతున్న పాఠకుల సంఖ్య పెరగాలి. మళ్ళీ తెలుగు సాహిత్యానికి మంచి రోజులు రావాలి.

 Hyderabad Book Fair : ఈ-బుక్ యాప్స్ వల్ల ప్రింట్ బుక్స్ వినియోగం ఏమాత్రం తగ్గదు..!
Hyderabad Book Fair

పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని చదివే అలవాటు మనలో చాలామందికి ఉంది. చదవలేని వారు, చదివే వీలులేనివారి కోసం, పుస్తకాన్ని చదవాలనుకునేవారి కోసం వెంకట సిద్థారెడ్డి, సంజయ్ మాదాల, మహి బెజవాడ 'చదువు' యాప్ ని తీసుకువచ్చారు. ఈ మొదటి తెలుగు మొబైల్ ఈబుక్ యాప్ లో 100కు పైనే ఈ-బుక్స్ తోపాటు, ఆడియో బుక్స్, షార్ట్ స్టోరీస్, పుస్తక పరిచయాలు, మ్యాగజైన్స్ ఇలా పుస్తకాన్ని చదవాలనుకునేవారికి సెల్ ఫోన్ లోనే, గ్రంథాలయాన్ని తక్కువ ధరకే అందిస్తున్నారు. వీరి ప్రయత్నం గురించిన విశేషాలను బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ తో పంచుకున్నారు.

1. 'చదువు' యాప్ గురించి చెప్పండి.

తెలుగులో ఒక పుస్తకం ప్రచురిస్తే వెయ్యి కాపీలు అమ్ముడు పోవడం కష్టంగా ఉంది. కానీ పది కోట్లమంది ఉన్న తెలుగు వాళ్ళల్లో వెయ్యి మంది పాఠకులు లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. మేము చేసిన పరిశోధన బట్టి మాకర్థమైందేంటంటే మన దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళతో కలిపి సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు లక్షల్లో ఉండొచ్చు. కాకపోతే వాళ్ళందరికీ పుస్తకాలు అందుబాటులోకి తేలేకపోతున్నాం. ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాలలో సైతం పుస్తకాల షాపులు కరువయ్యాయి. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా చదివే యువత హైటెక్ సిటీ లో ఉంటే పుస్తకాల షాపులు కోటి, నాంపల్లిలో ఉన్నాయి. ఇలా ఎన్నో సమస్యలకు ఒక పరిష్కారం వెతికే క్రమంలో మేము “చదువు” యాప్ తయారు చేశాం. చదువు భారతదేశంలోనే మొట్టమొదటి ఈ-బుక్ యాప్. ప్రస్తుతానికి కొన్ని యాప్స్ ఉన్నప్పటికీ అవి ఆడియో బుక్స్ కోసం, లేదా షార్ట్ స్టోరీస్ కోసం, పుస్తక పరిచయాల కోసం, వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ చదువు యాప్ లో ఈ-బుక్స్, ఆడియో బుక్స్, షార్ట్ స్టోరీస్, పుస్తక పరిచయాలు, మ్యాగజైన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో బాలసాహిత్యం, ఒరిజినల్ సీరీస్ ఇంకా ఎన్నో కొత్త ఫీచర్స్ తో అప్ డేట్ చేస్తాము.

2. చాలామంది భౌతికంగా పుస్తకాన్ని చేతిలోకి తీసుకునే చదవాలనుకుంటారు..ఈ అనుభవాన్ని మీ యాప్ ఎంతవరకూ పూరించగలదనుకుంటున్నారు.

మేము కూడా పబ్లిషింగ్ రంగంలో గత నాలుగేళ్ళుగా ఉన్నాం. దాదాపు వంద పుస్తకాల దాకా ప్రచురించాం. యాభై నుంచి అరవై మంది కొత్త రచయితల రచనలను ప్రచురించాం. కానీ కాలం మారుతోంది. మొబైల్ ఫోన్ లోనే మన జీవితం సగభాగం గడిచిపోతోంది. అందుకే కాలానుగుణంగా మేము ఈ-బుక్ యాప్ అందుబాటులోకి తెచ్చాం. ప్రపంచవ్యాప్తంగా కూడా యాభైశాతం పాఠకులు ఈ-బుక్స్, ఆడియో బుక్స్ వైపు మళ్ళారు. ఈ-బుక్ యాప్స్ ద్వారా ప్రింట్ బుక్స్ వినియోగం తగ్గదు. నిజానికి ఈ-బుక్ గా చదువుకుని పుస్తకం నచ్చినట్టయితే ఆ పుస్తకం ఫిజికల్ కాపీ కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఇది ప్రచురణ రంగానికి, పాఠకులకు మంచి చేసే సదుపాయం అని మా అభిప్రాయం. అంతేకాకుండా ఇది PDF ఆధారిత ఈ-బుక్ రీడర్ కాదు. ఇందులో ఫాంట్ సైజు పెంచుకోవచ్చు, తగించుకోవచ్చు. మన కళ్ళకు ఇంపుగా ఉండేలా బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో డిక్షనరీ, నచ్చిన వాక్యాలను హైలైట్ చేసుకునే సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తాం.

CHADHUVU.gif

3. యాప్ మొదలయ్యాకా పాఠకుల నుంచి స్పందన ఎలా ఉంది. లేదా మీరు యాప్ మొదలుపెట్టాకా రెస్పాన్స్ గురించి చెప్పండి.

మేము ముందుగా ఊహించినట్టూగానే అనూహ్యమైన స్పందన లభిస్తోంది. పది రోజుల్లో పదివేలమంది దాకా చదువు యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు. మార్చి ఆఖరి కల్లా లక్షమంది చదువు యాప్ ని వినియోగిస్తారని మా అంచనా. యాప్ వాడుతున్న వాళ్ళనుంచి చాలా మంచి సమీక్షలు వస్తున్నాయి. మేము ఈ యాప్ విషయంలో ప్రపంచంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ఈ-బుక్ యాప్స్ పరిశీలించాం. వాటిలో ఉన్న అన్ని మంచి ఫీచర్స్ మా చదువు యాప్ లో తీసుకొచ్చాం.

4. ఎటువంటి పుస్తకాలు ఈయాప్ ద్వారా చదవచ్చు.

చదువు యాప్ ద్వారా అన్ని రకాల సాహిత్యం అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఇందులో అసమర్థుని జీవియాత్ర, కొల్లాయి గట్టితేనేమి లాంటి క్లాసిక్స్ నుంచి, యండమూరి వీరేంద్రనాథ్, గొల్లపూడి మారుతీరావు లాంటి రచయితల పాపులర్ సాహిత్యం వరకూ అన్నీ ఉన్నాయి. అంతే కాకుండా గత ఇరవై ఏళ్ళుగా వచ్చిన కొత్త తెలుగు సాహిత్యం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కాకుండా మనం మర్చిపోయిన, ఇగ్నోర్ చేసిన విస్మృత సాహిత్యం మీద కూడా మా ఫోకస్ ఉంది. చాలామంది తెలుగు వాళ్లకి పరిచయం లేని అద్భుతమైన సాహిత్యం చదువు ద్వారా తీసుకొస్తాం. ఉదాహరణకు, పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన డిటెక్టివ్ నవల 'డెత్ ఆన్ ఏ ట్రైన్', కర్నాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన శ్యామశాస్త్రి జీవితం అధారంగా వచ్చిన నవల ఇప్పుడు చదువు యాప్ లో అందుబాటులో ఉన్నాయి.

5. ఈ కొత్త అడుగు వెనుక బలమైన కారణం ఏదైనా ఉందా? దాని గురించి చెప్పండి.

ఒక రచయిత తన పుస్తకాన్ని లక్షల్లో ఉన్న పాఠకులకు అందుబాటులోకి తేవాలి. తగ్గిపోతున్న పాఠకుల సంఖ్య పెరగాలి. మళ్ళీ తెలుగు సాహిత్యానికి మంచి రోజులు రావాలి. ఇదొక్కటే మమ్మల్ని నడిపించిన ఒకే ఒక్క కారణం.

6. చదువు యాప్ తో రచయితకు ఎటువంటి సపోర్ట్ అందుతుంది.

మేము ఆన్వీక్షికి ప్రచురణ సంస్థ స్థాపించినప్పుడే రచయితల సొమ్ముతో పుస్తకాలు ప్రచురించే ఆచారానికి అడ్డుకట్ట వేశాం. అంతేకాకుండా రచయితలకు పది శాతం రాయల్టీ కూడా అందచేస్తున్నాం. అలాగే చదువు యాప్ విషయంలో కూడా ఇప్పటికే మేము వందలమంది రచయితలకు అడ్వాన్స్ రాయల్టీ చెల్లించి వాళ్ళ రచనలను ప్రచురించడానికి అనుమతి పొందాం. చదువు యాప్ ద్వారా వచ్చిన లాభాల్లో పాతిక శాతం రచయితలకు రాయల్టీ రూపంలో అందచేస్తున్నాం.

7. చదువు యాప్ నుంచి రాబోయే రోజుల్లో ఇంకా ఏం ఆశించవచ్చు.

చదువు యాప్ లో ఇప్పటికి దాదాపు వంద పుస్తకాలు, రెండొందల కథలు, పదిహేను ఆడియో బుక్స్ ఉన్నాయి. యాభై పుస్తక పరిచయాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెల నుంచి ప్రతి వారం నాలుగు కొత్త పుస్తకాలు, 25 కథలు, 10 పుస్తక పరిచయాలు, కొత్త పత్రికలు తీసుకురానున్నాం. ఇవన్నీ కూడా సంవత్సరానికి 299 రూపాయలకే పాఠకులకు అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2022-12-29T14:56:03+05:30 IST