Hyderabad Book Fair : ఈ పుస్తకాల పండక్కి ఎందరో పుస్తక ప్రియులు పుస్తకాలను కొంటున్నారు..!

ABN , First Publish Date - 2022-12-31T09:42:47+05:30 IST

1988నుంచి 'అసమర్థుని జీవిత యాత్ర', 'చివరకు మిగిలేది' తో మొదలు పెట్టి అన్నీ పునః ముద్రించాను.

 Hyderabad Book Fair :  ఈ పుస్తకాల పండక్కి ఎందరో పుస్తక ప్రియులు పుస్తకాలను కొంటున్నారు..!
Hyderabad Book Fair

తెలుగు సాహిత్యాన్ని ప్రచురించి, సాహితీ ప్రియులకు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది పల్లవి పబ్లికేషన్స్. పుస్తక ప్రచురణ రంగంలో ఎదుర్కొన్న ఆటు పోట్లను, మార్కెటింగ్ సమస్యలపై పల్లవి వెంకట నారాయణతో బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ జరిపిన ఆత్మీయ సంభాషణ..

1. పుస్తక ప్రచురణరంగంలోకి అడుగుపెట్టాకా మీరు గమనించిన మార్పులేమన్నా ఉన్నాయా? ఎలాంటి పుస్తకాలకు మార్కెట్ ఉండేది?

1973లో ఈ నవోదయా పుస్తక విక్రేత అయిన రామ్మోహనరావుగారి దగ్గర పుస్తకాలు అమ్మే సేల్స్ మేన్ గా పనిలో చేరాను. అప్పటితో నాకు పుస్తకాలతో పరిచయం అయింది. ఈ పరిచయంతో 1983లో పుస్తకాలు ముద్రించడం మొదలు పెట్టాను. అయితే నాకు పుస్తకాలు విక్రయించడంలో మాత్రమే అనుభవం ఉంది. కానీ రచయితలతో పరిచయం ఏర్పడలేదు. ఆరోజుల్లో తామర తంపరగా కాల్పనిక సాహిత్యం పబ్లిష్ అవుతూ ఉండేది. మొదటగా ఇద్దరు పబ్లికేషన్ మిత్రుల సాయంతో రెండు నవలలు పబ్లిష్ చేసాను. అప్పట్లో నవలలు వేయడంలో పబ్లిషర్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. కాల్పనిక సాహిత్యం తప్ప మరే ఇతర పుస్తకాలు వేసినా అమ్ముడయ్యేవి కాదు. కానీ యద్దనపూడి సులోచనా రాణి, కోడూరి కౌశల్య, మాదిరెడ్డి సులోచన, యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలకు మంచి మార్కెట్ ఉండేది. కొన్ని పుస్తకాలు అమ్ముడయ్యేవి, కొన్ని అమ్ముడయ్యేవి కావు ఇలా ఇబ్బందులు పడినా వీళ్ళ పుస్తకాలే వెళ్ళేవి.

2. మార్కెట్ పోటీని తట్టుకుని ముద్రించిన పుస్తకాలను ఎలా విక్రయించేవారు?

యండమూరి, మల్లాది, యద్దనపూడి, మాదిరెడ్డివి, కౌసల్యాదేవి పుస్తకాలు 2000 కాపీలు వేసినా అమ్మకాలు బావుండేవి. ఆ పుస్తకాలను వేసేందుకు గట్టి పొటీ ఉండేది. మాదాకా అందేవి కాదు. ఇద్దరి ముగ్గురివి వేసినా కొన్ని పుస్తకాలు అమ్ముడయ్యేవి కాదు. ఇలా పుస్తకాలను వేయడం వాటిని అమ్ముకోవడం కష్టంగా ఉన్నా అలానే కాలం గడిపేవాళ్ళం. ఓ సమయంలో అయితే యండమూరి, మల్లాది కాలం నడిచింది. వాళ్ళ రచనలు వచ్చాకా అప్పటివరకూ రాసే మహిళా రచయిత్రుల రచనలు తగ్గాయి. పుస్తకాలు రావడం కూడా తగ్గింది. కాకాపోతే లాభాలు రాలేదు. అప్పట్లో మ్యాగజైన్స్ ఉండేవి వాటిలో యాడ్స్ వేసేవాళ్ళం, అలాగే రెంటెడ్ షాపులకు పంపేవాళ్ళం. ఆ రెంటెడ్ షాపులకు పుస్తకాలు వేసే ఏజెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు గుత్తగా తీసుకుని ఒకసారే డబ్బులు ఇచ్చేవాళ్ళు.

3. కాల్పనిక సాహిత్యాన్ని వదిలి పాత రచయితల పుస్తకాలను వేయాలనే ఎందుకు అనిపించింది?

పేరున్న వాళ్ళవి వేసినా పుస్తకాలు సరిగా అమ్ముడవక, కొన్ని మిగిలిపోయి ఇబ్బందులు వచ్చేవి. అప్పుడే గోపీచంద్ గారి పుస్తకాలు, బుచ్చిబాబుగారి పుస్తకాలు వేయాలన్న ఆలోచన వచ్చింది. ఈ పుస్తకాలకు వారసులు సరిగా లేక, వేసేవాళ్ళు ఉండేవారు కాదు. నేను ఈ పుస్తకాలు వేయాలనుకున్నాను. ఆ పుస్తకాలను వేస్తే మనకు పేరూ వస్తుందని. పుస్తకాల అమ్మకాలు బావుంటాయని చెప్పి గోపిచంద్ అబ్బాయిని కలిసాను, అలాగే బుచ్చిబాబుగారి భార్యను కూడా కలిసి ఒప్పించాను. 1988నుంచి 'అసమర్థుని జీవిత యాత్ర', 'చివరకు మిగిలేది' తో మొదలు పెట్టి అన్నీ పునః ముద్రించాను.

4. ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ని తెలుగులోకి రచయితలు కిచ్చి అనువదించాలనే ఆలోచన ఎవరిది?

ఆ ఆలోచన నాదే. పదివేల కాపీలకు రచయితకు డబ్బులిచ్చి ఐదు వేల కాపీలు వేసాను అవి కొన్ని అమ్ముడు కాలేదు. రైటర్స్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాను. దీనితో పుస్తక విక్రేతగా కొంత అనుభవం ఉండటంతో ఇంగ్లీష్, హిందీ పుస్తకాలు ఇన్ఫర్మేటివ్ బుక్స్ తీసుకుని వాటిని బేస్ చేసుకుని రైటర్స్ ని పెట్టి అనువదించి వాటిని ముద్రించేవాడిని. అందులో హోమియో చికిత్స, ప్రపంచ శాస్త్రవేత్తలు, ప్రపంచ వింతలు వంటి పదిహేను రకాల పుస్తకాలను ముద్రించి విక్రయించాను. వాటిని విజయవాడలో అంతక ముందు ఎవరూ ప్రచురించలేదు. నవలల ప్రచురించే పబ్లికేషన్స్ తప్ప, నాన్ ఫిక్షన్ పబ్లికేషన్స్ అప్పటికి లేవు. అప్పట్లో విశాలాంధ్ర వారు పెట్టిన ఎగ్జిబిషన్ లో నేను ప్రచురించిన పుస్తకాలు దాదాపు 200 పైగా కాపీలు పోయాయి. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. ఇలా నాకు నచ్చిన పుస్తకాలో, ఇన్ఫర్మేటివ్ బుక్స్ వేయడమో చేయాలని., రచయితల వెంటబడి వాళ్ళు రాసిన పుస్తకాలను ముద్రించకూడదని నిర్ణయించుకున్నాను. ఈ 1989 విశాలాంధ్రా బుక్ ఎగ్జిబిషన్ తరువాత నన్ను, నా ఆలోచనను అనుసరించి పుస్తకాలను ప్రచురించిన ప్రచురణ సంస్థలు చాలానే ఉన్నాయి.

ఆ తరువాత నేను ఎమ్మెస్కో విజయకుమార్ ఇంకొందరం కలిసి పబ్లికేషన్ అసోషియేషన్ లా ఫామ్ అయ్యి గవర్నమెంట్ పుస్తకాలను కొనడానికి చాలా ప్రయత్నాలు చేశాం,. జిల్లా గ్రంథాలయ సంస్థల్లో కంబైన్డ్ జిల్లాల్లో పది ఎగ్జిబిషన్స్ ని ఒకేసారి ఏర్పాటుచేసి నిర్వహించాం. దానిని నేను దగ్గరుండి ఆర్గనైజ్ చేసాను మా పబ్లికేషన్ అసోషియేషన్ తరపున. దానితో మేము తెలుసుకున్నది ఏమిటంటే వైవిధ్యమైన పుస్తకాలు, రీడర్స్ ఏం కోరుతున్నారు అనేదాని మీద అవగాహనతో పుస్తకాలు వేస్తే మాత్రమే ఫ్రొఫిషనల్ పబ్లిషర్ బ్రతుకుతాడు అనిపించింది. రైటర్ ని బేస్ చేసుకుని పుస్తకాలు వేస్తే పబ్లిషర్ ఉండడు అని నిర్ణయించుకున్నాం.

1990లో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కింద ఏర్పడి బుక్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించాం. ఇది కరోనా సమయంలో తప్ప 1991 నుంచి నిరాఘాటంగా ప్రతి సంవత్సరం జనవరిలో ఈ బుక్ ఎగ్జిబిషన్ ని నిర్వహిస్తున్నాం. అలాగే హైదరాబాద్ లో కూడా డిసెంబర్ లో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇందులో ఎందరో రచయితలు, పబ్లికేషన్ వారు పుస్తకాలను ఉంచుతున్నారు. ఈ పుస్తకాల పండక్కి ఎందరో పుస్తక ప్రియులు పుస్తకాలను కొంటున్నారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు.

5. పుస్తకాలు అమ్ముడుపోవడంలో రీడర్ కి, పబ్లిషర్ కి మధ్య ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్స్ వల్ల ఉపయోగం ఏదైనా ఉందంటారా?

ఇప్పుడు అనువాదాలైనా, నవలలైనా ఏ పుస్తకాలైనా మార్కెట్ తక్కువగానే ఉంది. అన్ని పుస్తకాలూ యావరేజ్ గానే పోతున్నాయి. గతంలో రాని సబ్జెక్ట్ వస్తే కొని చదివేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రైటింగ్స్ లో దమ్ములేకపోవడం, కొనేవాళ్ళు, చదివేవాళ్ళు లేకపోవడం కూడా మార్కెట్ పడిపోవడానికి కారణం. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లో కొనే పుస్తకాల వల్ల అటు రీడర్, ఇటు పబ్లిషర్ ఎవరికీ ఉపయోగం ఉండటం లేదు. మధ్యలో డీలరే లాభపడుతున్నాడు. రీడర్ ఆన్లైన్ లో కొనే పుస్తకం 250 ఉంటే పబ్లిషర్ కి 120 మాత్రమే ముడుతుంది. అదీ పరిస్థితి. దానికి మనం ఏం చేయగలం. దీనికన్నా వాట్సప్ లో పుస్తకం కావాలని అడిగి గూగుల్ పేనో, ఫోన్ పేనో చేస్తేనే నయం.

- శ్రీశాంతి మెహెర్

Updated Date - 2022-12-31T12:38:10+05:30 IST