Hyderabad Book Fair : గ్రంథాలయాలు శిథిల ఆలయాలుగా మారుతున్నాయి తప్పితే, పూర్వ వైభవం లేదు..!

ABN , First Publish Date - 2022-12-30T13:08:13+05:30 IST

నవలలు రాయికట్టి చెరువులో పడేసినట్టే... ఎవరు చదువుతున్నారు.

 Hyderabad Book Fair :  గ్రంథాలయాలు శిథిల ఆలయాలుగా మారుతున్నాయి తప్పితే, పూర్వ వైభవం లేదు..!
Hyderabad Book Fair

తెలుగులో ఈమధ్యకాలంలో వచ్చిన గొప్ప నవల మధురాంతకం నరేంద్ర 'మనోధర్మపరాగం'. ఈ నవలకు గాను నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. తండ్రి మధురాంతకం రాజారాం సాహిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నరేంద్ర రచనలు మనిషిలో అంతుచిక్కని జీవన సంఘర్షణలను బయటిలోకానికి చూపే దర్పాణాలు.. బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ మధురాంతకం నరేంద్రతో జరిపిన ఆత్మీయ సంభాషణ.

మధురాంతకం నరేంద్ర రచనలలో ముఖ్యంగా మైక్రోకోమ్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా,కథాంజలి, కుంభమేళా, అస్తిత్వానికి అటు ఇటు, రెండేళ్లు పద్నాలుగు, భూచక్రం, కొండకింద కొత్తూరు, రూపాంతరం, పాటాంతరం, వెదురుపువ్వు, నరేంద్ర కథలలో, నాలుగు కాళ్ల మండపం, కథాయాత్ర, తాత్వికకథలు, కథా సంకలనాలలో ముఖ్యమైనవి.

1. తెలుగు పుస్తకాలు చదవడం తగ్గిందంటారా? దీనికి ప్రధాన కారణం ఏమిటి?

తెలుగు పుస్తకాలు చదవడం చాలా వరకూ తగ్గింది. పాఠకులు లేని ప్రపంచంలో ఉన్నానేమోననే భయం కలుగుతుంది ఒక్కోసారి. 75, 80లలో నేను సాహిత్య రచన చేయడం ప్రారంభించాను. ఆ కాలంలో చాలా పత్రికలుండేవి. ఆంధ్ర ప్రభ, భూమి, ఆంధ్రజ్యోతి, వారపత్రికలు, యువ, జ్యోతి, స్వాతి, మంత్లీలు, ఇండియా టుడే పత్రిక, విపుల, చతుర, ఇన్ని పత్రికల మధ్య చదువుకోవడానికి కథలు సమృద్ధిగా ఉండేవి. నేను ఎక్కడో మారుమూల కూర్చుని కథను రాస్తే, దానిని చదివామని చెప్పేవారు చాలామందే ఉండేవారు. ఇప్పుడు మనం ప్రతికలు లేని కాలంలో ఉన్నాం. ఆదివారం అనుబంధంలో తప్పితే కథలు లేవు. చాలా పత్రికల వాళ్లు కరోనా పేరు చెప్పి పత్రికలను మూసేసారు. కొన్ని వెబ్ పత్రికలు మాత్రమే మిగిలున్నాయి. మిత్రుల్లో కొందరు ఎప్పుడన్నా కలిసినపుడు ఇంకా రాస్తున్నావా అని అడుగుతున్నారు. అదీ మాకున్నటువంటి పరిస్థితి.

2. ఇప్పుడు చదువుతున్నవారితో పాటు, ప్రచురించే పుస్తకాలు కూడా తగ్గాయంటారా?

కరోనా తరువాత అన్నిరంగాల్లోనూ మార్పులు వచ్చాయి. పేరున్న రచయితలే 500 కాపీలు వేసుకుంటామని బయలుదేరారు. ఒక నవల కన్నడంలో రాస్తే నాతోపాటు నాకన్నా చిన్నవాళ్ళు, కొత్తగా రాసేవారు, ఒక్కొక్కరివీ 10, 12 ఎడిషన్లు అమ్మేసామని ఆనందంగా చెపుతుంటారు. ఇతర భాషల్లో మొదటి ఎడిషన్ కి 5000 కాపీలు వరకూ ప్రచురిస్తారు. తమిళం, మలయాళంలోనూ అలాగే ఉంది పరిస్థితి. ఒక్క తెలుగులోనే పరిస్థితి అధ్యాన్నంగా ఉంది. ప్రచురణ కర్తలు భయపడిపోతున్నారు. అసలు పుస్తకాన్ని కొంటే కదా! ఇప్పుడు బుక్ ఫెయిర్ లో పుస్తకాలు బాగానే అమ్ముడు పోతున్నాయని విన్నాను అది కాస్త సంతోషంగా ఉంది.

3. పుస్తకాలు చదివే అలవాటు పిల్లలకు ఎలా వస్తుందంటారు. దీనికి పెద్దలు ఏం చేయాలి.

పిల్లలకి పుస్తకాభిలాష రావాలంటే ముందు పెద్దలు, తల్లిదండ్రులు పుస్తకాలు చదవాలి కదా.. కాస్త సమయమున్నా ఫోన్ పట్టుకుంటారు. అసలు ఒకప్పుడు బజారుల్లో, రైల్వేస్టేషన్స్ లలో ఎన్ని బుక్ స్టాల్స్ ఉండేవి. ఇప్పుడు మచ్చుకన్నా కనిపిస్తున్నాయా? మొబైల్ పట్టుకుని మురిసిపోతున్నారు తప్పితే చదివేవాళ్లు ఎవరున్నారు.

4. సాంకేతికత పెరిగే కొద్దీ పుస్తకం మనుగడ ఇబ్బందిలో పడుతుందంటారా?

మనుగడ ఇబ్బందిలో పడుతుందా అనేది మనం భవిష్యత్ దర్శనం చేసి చెప్పలేం, కానీ తల్లిదండ్రులు పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలి. పిల్లలకు నేర్పించాలి. కథలు, కబుర్లు వాళ్లతో కాసేపు సమయం గడిపితే అవే పుస్తకం వైపుకు లాక్కొస్తాయి. రచయితలు అనబడే వాళ్ళు కూడా పుస్తకాలు కొని చదవడం నేర్చుకోవాలి. వాళ్ళ పిల్లలకు కూడ రచయితలు తెలుగు చదవడం నేర్పించాలి. అంతే కాదు గవర్నమెంట్ గ్రంథాలయాలను చంపేసింది. గ్రంథాలయాలు శిథిలాలయాలుగా మారుతున్నాయి. తప్పితే వాటికి పూర్వ వైభవం లేదు. ఒకసారి వెస్ట్రన్ కంట్రీస్ లలో చూస్తే లైబ్రెరీ అనేది వాళ్లకు ఒక పెద్ద కల్చరల్ సెంటర్ గా ఉంటుంది. ఈమధ్య కాలంలో నేను వెళ్ళిన ఎడిన్ బర్గ్ లో కాలనీకి ఒక లైబ్రెరీ ఉంది. కరోనా కాలంలో కేరళ గవర్నమెంట్ ఇంటింటికీ వెళ్ళి పుస్తకాలను చదవమని ఇచ్చింది. ప్రతి కాలేజీలో స్టూడెంట్ లైబ్రెరీ ఫండ్ కడతాడు. ఆ డబ్బులు కాలేజీలు మింగేస్తాయి తప్పితే పిల్లలకు పుస్తక జ్ఞానం ఇవ్వలేక పోతున్నాయి. ఇప్పుడున్న సామాజిక, మానసిక రుగ్మతలకు దివ్య ఔషదం పుస్తకం మాత్రమే. దానిని గుర్తించలేకపోతే మన భవిష్యత్ తరాలు ఇంకా పతనావస్థలోకి పోతాయి. కనీసం పక్క రాష్ట్రాలలో జరుగుతున్నదన్నా చూసి మనం ఆచరించలేక పోతున్నాం. మొత్తం దేశంలో అన్ని భాషలకూ ఉన్న పరిస్థితులు వేరు ఒక్క తెలుగు భాష పరిస్థితి వేరు. మనకు భాషపట్ల గానీ, సాహిత్యం పట్ల గానీ ఉండాల్సినంత గౌరవం లేదు.

5. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ప్రకటించిన సందర్భంగా మీ స్పందన?

అవార్డ్ అనేది సాహిత్య ప్రయాణంలో ఒక ముఖ్యమైన సన్నివేశం మాత్రమే. కానీ రచన ఒక జీవితకాలపు సాధన, ఈ సాధన సాగుతూ ఉంటుంది. రచయిత చెప్పాలనిపించింది రాసుకుంటూ ఉంటాడు. తన పని తను చేస్తాడు. రచయిత ప్రజల తరుపున ఉండి, ప్రజలకొక గళమై వాళ్ళ తరపున ఏదైనా సమాజానికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంటాడు షెల్లీ.. దీనికి రచయిత వాక్ స్వతంత్రాన్ని పరిరక్షించాల్సిన అవసరం కూడా చాలా ఉంది.

6. మీకు నచ్చిన రచయితలు గురించి చెపుతారా?

నాకు చాలామంది ఇష్టమైన రచయితలున్నారు. ఇప్పటివారి రచనలు కూడా నేను చదువుతూనే ఉంటాను. అయితే ఒకే రచయిత మీద ఫాసినేషన్ ఉండదు నాకు. మహా గ్రంథాలు ఉంటాయి గానీ, మహా రచయితలు ఉండరు. పోనీ మహారచయితల పుస్తకాల్లో కూడా అన్నీ బావుండవు. నాకు రష్యన్ మాస్టర్స్, బెంగాలీ మాస్టర్స్ అంటే ఇష్టం. ముఖ్యంగా లియో టాల్‌స్టాయ్, దాస్తొయేవ్ స్కీ, శరత్ ఇష్టమైన రచయితలు. ఇక మన తెలుగులో ఉన్నంత మంది గొప్ప కథకులు, మాస్టర్ రచయితలు మరే భాషలోనూ లేరని నా నమ్మకం.

7. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ కు ఎంపికైన మీ రచన మనోధర్మపరాగం గురించి చెపుతారా?

నేను రాసాననే దానికంటే ఆ నవలే నాతో రాయించుకుంది అనడం సబబు. ప్రారంభించిన తరువాత ఒక అరవై, డబ్భై ఏళ్ళ నాకు తెలిసిన జీవితం మాత్రమే అనుకున్నాను, కానీ మా ప్రాంతాలదైన ఒక రెండు మూడు వందల సంవత్సరాల జీవితం నాకు తెలుసుననే విషయమే తెలీలేదు. ఆ రచన అంత చిత్రంగా జరిగింది. సంగీతంతో అంత సంబంధం ఉందని కానీ, ఆ వ్యక్తులతో అంత స్నేహాలున్నాయనే తెలీలేదు. రాస్తున్న క్రమంలో కొలంబస్ ప్రయాణం చేసినట్టుగా భారతదేశానికి పోతానని అమెరికా పోయినట్టు నాకేతో తీగ దొరికితే డొంక కదిలింది. ఈ నవల రాయడం నాకో చిత్రమైన అనుభవం. ఈ రచనకు చాలా కష్టపడ్డాను.

8. మనోధర్మపరాగం రచనకు పాఠకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?

ఈ నవల రాస్తున్నప్పుడు చాలా సంతోషంలో వున్నా ను. అందుకు ఆ పాత్రలూ, ఆ సంగీత ప్రపంచమూ కారణమనుకుంటున్నాను. నవలకు పాఠకుల నుంచి ఆదరణ వచ్చింది. ఎందుకంటే దానికి ఆటా బహుమతి రావడం వల్ల వచ్చింది. అందుకనే చదివారు. నేను అంతక ముందు మూడు నాలుగు నవలలు రాసాను. వాటికి దీనికి పడినంతే శ్రమే పడ్డాను. అందులోనూ ఇవే రకమైన విషయాలు రాసుంటాను. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఆర్కే నారాయణ ఒకసారి ఎవరూ కొనని పుస్తకాలను ఇటుకరాయి కట్టి చెరువులో పడేయమన్నాడు. అలా మేం రాసే చాలా నవలలు రాయికట్టి చెరువులో పడేసినట్టే... ఎవరు చదువుతున్నారు. ఇదేదో బహుమతి వచ్చిందని చదివారు. దానికి తగ్గట్టు చిన్న కాంట్రవర్సీ కూడా ఒకటి దొరికింది జనాలకి. దేవదాసీలు జీవితాలలో ముడిపడిందంతా బ్రహ్మణులు, వైశ్యులే. కులము ఈ దేశంలో ఒక సత్యము. అదేదో నేను రాస్తే వీడు బ్రాహ్మణ ద్వేషి అన్నారు. మన వైతాళికుల్లో ఎందరో బ్రాహ్మణులే కాదా. మన గొప్ప రచయితలంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణులను ఎందుకు ద్వేషిస్తాం. వాళ్ల వెనకున్న బ్రాహ్మణిజాన్ని, ఆ పితృస్వామ్య గొడవల్ని వాటిని వ్యతిరేకిస్తాం. ఇలాంటి కాంట్రవర్సీ ఒకటి వచ్చింది కనుక జనాలు చదివారు. ఎలాగైతే ఏం జనాలు చదవడం ముఖ్యం. ఈ బహుమతి వల్ల ఇంకొందరు చదువుతారు.

- శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2022-12-31T09:22:34+05:30 IST