Hyderabad Book Fair : రచనతో కనెక్ట్ అవగలిగితేనే అనువాదం కుదురుతుంది..!

ABN , First Publish Date - 2022-12-30T19:44:07+05:30 IST

అన్నింటికీ అదే అప్లేయ్ చేయలేము.

 Hyderabad Book Fair : రచనతో కనెక్ట్ అవగలిగితేనే అనువాదం కుదురుతుంది..!
Hyderabad Book Fair

తెలుగులో చూడలేమనుకున్న రచనను అనువదించి వెలుగులోకి వచ్చారు అరుణా ప్రసాద్. దొస్తొయేవ్‌స్కీ బృహత్ నవల ‘ద బ్రదర్స్ కరమజొవ్’కు ఆమె చేసిన తెలుగు అనువాదం మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చెకోవ్ ప్రసిద్ధ కథలను రెండు భాగాలుగా అనువదించే పనిలో ఉన్నారు. అందులో మొదటి భాగం ఇటీవలే మార్కట్లోకి విడుదలైంది. బుక్ ఫెయిర్ సందర్భంగా అనువాదకురాలు అరుణా ప్రసాద్ తో ఆంధ్రజ్యోతి వెబ్ జరిపిన సంభాషణ ఇది:

1. మీ నేపథ్యం గురించి చెపుతారా? కుటుంబంలో ఎవరైనా సాహితీ ప్రియులున్నారా?

మాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. మా నాన్న గారు పప్పు హనుమంతరావు గారు హైస్కూలు హెడ్ మాస్టరు. మా అమ్మ గారు శ్రీ మతి శుభలక్ష్మి గారి ప్రోత్సాహంతో పుస్తక పఠనం అలవాటు అయింది. మా నాన్నగారు హైస్కూలు హెడ్ మాస్టరుగా పనిచేసేవారు. పుస్తకపఠనం మా తల్లిదండ్రుల ద్వారానే నాకు అలవాటైంది. మా బంధువులు ఉణుదుర్తి సుధాకర్ కూడా పుస్తకాలు చదవడంలో నాకు పెద్ద ఊతమనే చెప్పాలి. ఆ అభిరుచే నన్ను సాహిత్యం వైపుకు తీసుకువచ్చింది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలు కాస్త తెలుసు, కనుక ఆ పుస్తకాలన్నీ చదివేదాన్ని. నేను ఇప్పటి వరకూ చదివిన వాటితో పోల్చితే ఇంకా చదవాల్సిన పుస్తకాలు బోలెడున్నాయి.

2. మీకు నచ్చిన రచయితలు ఎవరు? అనువాదం చేయాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది?

అందరి రచనలూ చదువుతాను. ప్రత్యేకించి ఇష్టపడే రచయిత దొస్తొయేవ్‌స్కీ . ఆయన రచనలంటే ప్రత్యేకమైన మక్కువతోనే ఆయన రచనను తెలుగులోకి అనువదించాను. రచయిత్రి అరుణ పప్పుగారికి ఒక సందర్భంలో ఓ పుస్తకం అనువదించడంలో సాయం చేసాను. ఆమె మీరే సొంతంగా అనువాదం చేయవచ్చుకదా అన్నారు. అలా ఇటువైపు వచ్చాను. అప్పుడు కూనపరాజు కుమార్ గారు దొస్తొయేవ్ స్కీ నవలలన్నీ తెలుగులోకి అనువాదం చేయిస్తూ, నన్ను కూడా ఆ ప్రోజెక్టులోకి రికమెండ్ చేసారు. నేను డిగ్రీ చదువుతున్న కాలంలోనే దొస్తొయేవ్‌స్కీ ని విపరీతంగా అభిమానించేదాన్ని. ఆ ఇష్టం అలా కొనసాగుతూ వచ్చింది. దొస్తొయేవ్‌స్కీ అనువాదం అనగానే వెంటనే ఒప్పుకున్నాను. అందులో కరమజోవ్ సోదరులు అనువాదం అంటే అది ఒక అదృష్టంగానే భావించాను.

3. ‘కరమజోవ్ సోదరులు’ అనువాదానికి వచ్చిన స్పందన ఎలా ఉంది?

ఆ అనువాదం ఇంతమంది పెద్దలకి నచ్చుతుంది అని అనుకోలేదు. తెలుగు పాఠకులు ఇంతలా ఆదరిస్తారనీ అనుకోలేదు. అనుకున్నదానికంటే మంచి స్పందన వచ్చింది. చాలామంది హాయిగా చదవగలిగాం అని ఫోన్ చేసి చెప్పడం సంతోషంగా అనిపించింది. విసృతంగా అనువాదాలు చేసేయడం అన్నది అంత తేలికైన పనికాదు. దొస్తొయేవ్‌స్కీ, అంటోన్ చెకోవ్ కథల మీద ఉన్న అభిమానం, ఆసక్తి మాత్రమే నన్ను ఈ అనువాదాలను ఇంత తేలికగా చేసేలా తోడ్పడ్డాయి. అన్నింటికీ ఇదే పద్ధతిని అన్వయించలేము.

4. ‘కరమజోవ్ సోదరులు’ నవల 900 పేజీలకు పైగా ఉంది. అలానే ఇప్పుడు వచ్చిన చెకోవ్ కథల పుస్తకం 800 పేజీలు. ఇంత విస్తారమైన రచనల అనువాదం కష్టమనిపించలేదా?

రచయిత రచనకు కనెక్ట్ అవగలిగితే అనువాదం కుదురుతుంది. అప్పుడే మెకానికల్‌గా కాకుండా రచన వస్తుంది. దీనికంటూ సమయాన్ని ప్రత్యేకించి కేటాయించింది లేదు. నేను గృహిణిని, పిల్లలు వెళిపోయాకా, రాత్రి సమయాల్లో వాళ్లతో కూర్చుని చాలావరకూ పనిచేసాను. నేను చేసిన అనువాదాలు మానవ సంబంధాలతో ముడిపడినవే కనుక గదిలో తలుపులు వేసుకు చేయలేదు. నేను ఎక్కడుంటే పుస్తకాలు కూడా నాతోనే ఉన్నాయి. నా పనిని నలుగురితో ఉంటూనే చేసుకువచ్చాను.

దొస్తొయేవ్‌స్కీ తరువాత చెకోవ్ కథలు అనువదించేటప్పుడు అతను మానవ సంబంధాల పట్ల కాస్త తృణీకారం ఉన్న మనిషిగా అపోహపడ్డాను. కానీ అతని కథ ‘వార్డు నెం.6’ కథ చదివాకా చెకోవ్ పట్ల నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. మానవత్వానికి, హ్యూమన్ డిగ్నిటీకీ ఒకరూపం ఇస్తే చెకోవ్ అవుతాడు అనిపించింది. ఆ తరువాత ఒకదానిని మించి ఒకటి మంచి కథలు కనిపించాయి ఆయనవి. కాబట్టే అనువాదంలో కష్టం తెలీలేదు. ఈ ప్రయత్నంలో నా వెనుక ఉండి నడిపించిన మిత్రులు నా కుంటుబం- మావారు బాబు ప్రసాద్, మా అన్నయ్య, నాపిల్లలు.. వీళ్ళే. టెక్నికల్ సపోర్ట్ నా పిల్లల ద్వారా తీసుకున్నాను.

5. ఈ మధ్య కాలంలో తెలుగుపుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గటంపై మీ స్పందన ఏమిటి?

పుస్తకాలు చదివేవారు తగ్గారని నేను చెప్పను. ఈ పుస్తకాలను లాంచ్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చినవారిలో ఎక్కువమంది చదువుకునే పిల్లలే. బుక్ ఫెయిర్ లో కూడా పుస్తకాలు కొనేవారి సంఖ్య బాగానే ఉంది. ఇక చదువుకునే పిల్లలకు వాళ్ళ క్లాసు బుక్స్ తప్పితే మరో పుస్తకం చదివే వీలు ఎక్కడుంది. స్కూల్లో కూడా క్లాసు పుస్తకాలకు ఇస్తున్న ప్రాధాన్యత, భాషలు నేర్పించడానికి ఇవ్వడంలేదు. తల్లిదండ్రులు కూడా పరీక్షల వెనుక పిల్లల్ని పరుగులు పెట్టిస్తున్నారు తప్పితే వాళ్లకు మరో ధ్యాస ఉండటంలేదు. అసలు విద్యా విధానమే అలా ఉంది. ఇంత ఇబ్బందిలో కూడా పిల్లలు సాహిత్యం వైపుకు వస్తున్నారు అంటే మనం ఇంకాస్త డైరెక్షన్ ఇస్తే సాహిత్యం వాళ్ళకు పూర్తి స్థాయిలో అందుతుంది.

6. ఇన్ని కథల అనువాదం తర్వాత రచయితగా చెకోవ్ గురించి మీరేం చెప్తారు?

శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అంటాడు తులసీ దాస్. రాముడి సంగతి ఏమోగానీ కథకులలో మర్యాద పురుషోత్తముడు మాత్రం చెకోవ్ అనిపిస్తుంది. అతను మిగతా అన్ని సమస్యలకన్నా మానవ మర్యాద కోసం ఎక్కువ తాపత్రయపడ్డాడు. ఏరకమైన వల్గారిటీ ఏ రకమైన అణచివేతాలేని సమాజం కోసం కలగన్నాడు. తన కథ ‘వార్డు నెంబర్.6’ కథలో ఒక వాక్యం ఉంటుంది: ‘‘పిచ్చాసుపత్రులు, జైళ్ళు లేని ఒక సమాజాన్ని మన ముందు తరాలు చూస్తాయి’’ అని. ఎంత మంచి స్వప్నం అది. నిజంగా నేరరహిత సమాజంకోసం ఆయన తాపత్రయపడ్డాడు. అది వస్తుందని నమ్మాడు. మనుషుల్ని అమితంగా ప్రేమించిన కథకుడు చెకోవ్.

- శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2022-12-30T21:29:56+05:30 IST