ఆ మెసేజ్ చూసి హడలెత్తిపోయిన బాధితులు... ఆ క్షణంలో ఆసుపత్రిలో అల్లకల్లోలం!
ABN , First Publish Date - 2022-12-31T12:29:37+05:30 IST
తాజాగా బ్రిటన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇది రోగుల ప్రాణాలతో చెలగాటం మాదిరిగా పరిణమించింది.
తాజాగా బ్రిటన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇది రోగుల ప్రాణాలతో చెలగాటం మాదిరిగా పరిణమించింది. అయితే రోగులకు నిజం తెలిసేలోపు వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఆసుపత్రిలో సుమారు ఎనిమిది వేల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. వీరు రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వీరికి క్రిస్మస్ రోజున భయాందోళనకు గురిచేసే ఒక సందేశం వచ్చింది. దానిని చదివినవారంతా విపరీతమైన షాక్‌కు గురయ్యారు.
‘మీ అందరికీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంది. ఇది చివరి దశకు చేరుకుందని’ ఆ సందేశంలో ఉంది. వెనువెంటనే వచ్చిన మరో మెసేజ్‌లో ‘క్షమాపణలు’ అని రాసి ఉంది. ఇంతలోనే తీవ్ర గందరగోళం నెలకొంది. బాధితులు ఇప్పుడు తాము ఏం చేయాలని వైద్యులను అడగడం ప్రారంభించారు. రోగుల బంధువులు తదుపరి ఏర్పాట్లకు ఉపక్రమించారు. కొంతసేపటి తర్వాత ఇంతకు ముందు వచ్చిన మెసేజ్ పొరపాటున అందరికీ చేరిందని దానిలో తెలిపారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం, ఆసుపత్రి పరిపాలనా విభాగం బాధితులందరికీ క్రిస్మస్ సందేశాన్ని పంపింది. అయితే పొరపాటున రోగులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అనే సందేశాన్ని పంపించింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రి నిర్వాహకులు తమ తప్పును గ్రహించి, బాధితులకు క్షమాపణలు తెలిపారు. ఆసుపత్రిలో సుమారు ఎనిమిది వేల మంది రోగులకు ఈ సందేశం పంపినట్లు వారు చెప్పారు.