Hit: The Second Case film review: అడవి శేషు ఖాతాలో మరో విజయం

ABN , First Publish Date - 2022-12-02T13:24:51+05:30 IST

అడవి శేషు కథానాయకుడిగా, ప్రముఖ నటుడు నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకుడుగా వచ్చిన సినిమా ‘హిట్: ది సెకండ్ కేస్’.

Hit: The Second Case film review: అడవి శేషు ఖాతాలో మరో విజయం

సినిమా: హిట్: ది సెకండ్ కేస్

నటీనటులు: అడివి శేషు, మీనాక్షి చౌదరీ, రావు రమేష్, హర్షవర్ధన్, కోమలీ ప్రసాద్, శ్రీనాధ్ మాగంటి, పోసాని తదితరులు

సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన్

నిర్మాతలు: నాని, ప్రశాంతి టి

రచన దర్శకత్వం: శైలేష్ కొలను

- సురేష్ కవిరాయని

అడవి శేషు కథానాయకుడిగా, ప్రముఖ నటుడు నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకుడుగా వచ్చిన సినిమా ‘హిట్: ది సెకండ్ కేస్’. ఇది హిట్ ఫ్రాంచైజీలో రెండో సినిమా. ‘హిట్: ది ఫస్ట్ కే’స్ మొదటి సినిమాలో విశ్వక్ సేన్ పరిశోధన అధికారిగా కనిపిస్తే.. ఈ రెండో కేస్ లో అడవి శేషు పరిశోధన అధికారిగా కనిపించాడు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రమోషనల్ వీడియోస్ ఆసక్తికరంగా ఉండటం, రాజమౌళిలాంటి పెద్ద దర్శకుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రావటం, ప్రచారం ఇవన్నీ ఈ సినిమాకి మంచి హైప్‌ని తీసుకొచ్చాయి. అలాగే అడివి శేషు మంచి నటుడు, తను నటించిన గత సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి పెద్ద హిట్ అయ్యాయి. అందుకని ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యిందో లేదో చూద్దాం..

సంజన అనే అమ్మాయి హత్య అవుతుంది. ఆ హత్య నేరాన్ని పరిశోధించడానికి కృష్ణదేవ్ అలియాస్ కేడి (అడవి శేషు)ని నియమిస్తారు. అయితే ఫోరెన్సిక్ విభాగం అధికారులు అది సంజన బాడీ కాదని తల మాత్రమే సంజన అని మిగతా బాడీ పార్ట్స్ అన్నీ వేరే వేరే అమ్మాయిలవి అని తేలుస్తారు. అది విని కేడి ఆశ్చర్యపోయి పరిశోధన సాగిస్తాడు. ఈ పరిశోధనలో అతనికి వర్ష (కోమలీ ప్రసాద్), అభిలాష్ (శ్రీనాథ్ మాగంటి) అనే ఇద్దరి అధికారులు కూడా సహాయంగా వుంటారు. వీళ్ల పరిశోధన అటు ఇటు తిరిగి రఘు అనే అబ్బాయి దిశగా సాగుతుంది. రఘుని అరెస్ట్ చేసి అతనే ఈ హత్యలకు కారకుడని నిర్ధారించి ఈ కేసు అయిపోయిందని అనుకుంటారు. ఇంతలో కేడీకి ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఓ ఈ మెయిల్ వస్తుంది. అందులో రఘు అనే కుర్రాడు నిర్దోషి అని చంపింది వేరే వ్యక్తి అని రఘు వేరే దగ్గర వున్నాడు అని ప్రూఫ్స్‌తో సహా అందులో ఉంటుంది. ఇంతకీ అసలు హంతకుడు ఎవరు? ఎందుకిలా ఆడవాళ్లని టార్గెట్ చేసి చంపుతున్నాడు. దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

hit5.jpg

విశ్లేషణ:

దర్శకుడు శైలేష్ కొలను కుర్రాడు. అందుకని అతని ఆలోచనలు కూడా కొంచెం కొత్తగానే ఉంటాయి. మొదటి సినిమా 'హిట్' తీశాక, అదే ఫ్రాంచైజీల కంటిన్యూ చెయ్యాలని అనుకున్నాడు. ఈ సినిమాకి నిర్మాత వ్యవహరించిన ప్రముఖ నటుడు నాని కూడా శైలేష్‌కి సపోర్ట్‌గా నిలిచాడు. అందువల్ల శైలేష్ ఈ ‘హిట్: ది సెకండ్ కేస్’ కోసం అడివి శేషుని పరిశోధన అధికారిగా ఎంచుకున్నాడు. ఓటీటీలో ఇలాంటి హోమిసైడ్ కేసులు అని చెప్పి చాలా వెబ్ సిరీస్ వస్తూ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో కేసుని చూపిస్తూ వుంటారు. అలాగే ఈ హిట్ సినిమాని కూడా ఆలా ఒక్కో కేస్ ఒక్కో సినిమాగా సుమారు ఒక ఏడూ ఎనిమిది కేసుల వరకు సినిమాలు చేయొచ్చు అని ముందే చెప్పారు. ఇప్పుడు రెండో కేసు వచ్చింది. శైలేష్ తీసే విధానం, చూపించే తీరు ఆకట్టుకున్నాయి. ఊరికే ఎదో కొన్ని సన్నివేశాలు ఆలా డ్రాగ్ చెయ్యకుండా.. ఆసక్తికరంగా అన్ని సన్నివేశాలను మలిచాడు. అలాగే చివరి వరకూ కూడా కిల్లర్ ఎవరు అనేది చిన్న సస్పెన్స్‌లో ఉంచడంతో సఫలం అయ్యాడు. ప్రేక్షకులకి ఇద్దరు, ముగ్గురు మీద అనుమానం ఉండే విధంగా కొంచెం కథని కూడా అలా తిప్పాడు. కథ నడుస్తున్నంత సేపూ ఎక్కడ బోర్ కొట్టకుండా.. ప్రేక్షకుడిలో ఉత్సుకత కలిగించడంలో శైలేష్ విజయం సాధించాడని చెప్పాలి.

ఇలాంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో కామెడీ చేయడం కష్టమే. కానీ శైలేష్ మధ్య మధ్యలో చిన్న చిన్న సన్నివేశాలు, వాటికీ తగ్గ మాటలు రాసి కొంచెం నవ్వించాడు కూడా. అతని బలం రాయటం, అదే ఈ సినిమాకి అదే చాలా ముఖ్యం అయింది. డైలాగ్స్ బాగా రాశాడు, సన్నివేశాలకి తగ్గట్టుగా. ఇంక చివరి 20 నిముషాలు అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్‌లో కిల్లర్ ని ఇరిటేట్ చేసే విధానం.. ఆ సన్నివేశం బాగా వచ్చింది. అలాగే తన తదుపరి అంటే ‘హిట్: ది థర్డ్ కేస్’ లో ఎవరు పరిశోధన అధికారి అన్నది కూడా ఇందులో చివర్లో చూపించాడు.

hit3.jpg

ఇంకా సంగీతం విషయానికి వస్తే, ఈ సినిమాకి ముగ్గురు పని చేశారు. ఎం.ఎం.శ్రీలేఖ చేసిన ‘ఉరికే ఉరికే’ పాట బాగుంది. అలాగే స్క్రీన్ మీద ఆ పాటని బాగా ప్రజెంట్ చేశారు. ఇలాంటి సస్పెన్స్ సినిమాలకి బ్యాక్‌గ్రౌండ్ సంగీతం చాలా ముఖ్యం. దాన్ని ఈ సినిమాకి జాన్ స్టీవర్ట్ అందించాడు. సూపర్ అనేంతగా కాకపోయినా బాగుంది అన్నట్టుగా ఇచ్చాడు. అలాగే సినిమాకి మణికందన్ ఛాయాగ్రహణం మంచి ఆయువు పట్టు లాంటిది అనే చెప్పాలి. కథకి తగ్గట్టుగా పాటుగా ఛాయాగ్రహణం ఉంటుంది. చాలా బాగుంది, సన్నివేశాలు అన్నీ కథకి అనుగుణంగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే, అడివి శేషు మరోసారి అదరగొట్టాడు. అతను మంచి నటుడు అని ఎప్పుడో నిరూపించుకున్నాడు, ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. కృష్ణ దేవ్ అనే ఒక పోలీస్ అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. కొంచెం నోటి దూల ఉన్న అధికారిగా, అలాగే తాను పరిశోధించే కేస్ గురించి పరితపించే అధికారిగా ఒక పక్క, అలాగే ప్రియురాలిని చూసుకునే ప్రేమికుడిగా ఇన్ని షేడ్స్ ఒకే పాత్రలో బాగా చేశాడు. క్లైమాక్స్‌లో శేషు నటన హైలైట్ అని చెప్పాలి. ఒక రకంగా శేషునే సినిమాని నడిపించాడు. ఇంకో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకా మీనాక్షి చౌదరి చాలా బాగా నటించింది. తన పాత్రకి తగ్గట్టుగా ఎంతో చక్కగా అభినయించింది. ఆమెకి మంచి భవిష్యత్తు ఉందనే చెప్పాలి. రావు రమేష్ మరోసారి మెరిశాడు. చిన్న పాత్ర అయినా, హుందాగా తనదయిన స్టైల్‌లో నటించాడు. కోమలీ ప్రసాద్‌కి మంచి పాత్ర దక్కింది. ఆమె మహిళా పోలీస్ అధికారి ఎలా ఉంటుందో అంత చక్కగా చేసి చూపించింది. శ్రీనాథ్ మాగంటి కూడా బాగా చేశాడు. ఇంకా చాలామంది పరిశోధన టీంలో వుంటారు. వాళ్ళందరూ సహజంగా బాగా నటించారు. అంతేకాకుండా రెండు సన్నివేశాల్లో దర్శకుడు శైలేష్ కూడా కనిపిస్తాడు.

hit4.jpg

చివరగా.. ‘హిట్ 2’ కథతో ప్రేక్షకుడిలో చివరి వరకు ఆసక్తి రేకెత్తించడంతో దర్శకుడు శైలేష్ విజయం సాధించాడు. అడవి శేషు నటన సినిమాకి హైలైట్ గా ఉంటుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ నచ్చే వాళ్లకి ఈ సినిమాని కచ్చితంగా ఇష్టపడతారు. అడవి శేషుకి ఇది మరో విజయం. అతనికి మరో వైవిధ్యమయిన పాత్ర.

Updated Date - 2022-12-02T13:29:28+05:30 IST