ఇంటర్ మార్క్ షీట్‌లో ఒక్క మార్కు కోసం 3 ఏళ్లు న్యాయ పోరాటం చేసిన విద్యార్థి.. చివరికి హై కోర్టు ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-03-15T05:55:37+05:30 IST

మార్క్ షీట్‌లో తనకు ఒక్క మార్కు తక్కువ వచ్చిందని ఒక విద్యార్థి ఇంటర్మీడియట్‌ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. తన ఆన్సర్ షీట్ మరోసారి రివాల్యూయేషన్ చేయాలని అభ్యర్థించాడు. కానీ బోర్డు అతని అభ్యర్థనను తిరస్కరించింది...

ఇంటర్ మార్క్ షీట్‌లో ఒక్క మార్కు కోసం 3 ఏళ్లు న్యాయ పోరాటం చేసిన విద్యార్థి.. చివరికి హై కోర్టు ఏం చెప్పిందంటే..

మార్క్ షీట్‌లో తనకు ఒక్క మార్కు తక్కువ వచ్చిందని ఒక విద్యార్థి ఇంటర్మీడియట్‌ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. తన ఆన్సర్ షీట్ మరోసారి రివాల్యూయేషన్ చేయాలని అభ్యర్థించాడు. కానీ బోర్డు అతని అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతను మూడేళ్లుగా న్యాయపోరాటం చేశాడు. చివరికి హైకోర్టులో బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేశాడు.


మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో నివసించే శాంతను షుక్లా అనే విద్యార్థి 2018లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాడు. తనకు 75 శాతానికి పైగా మార్కులు వస్తాయని శాంతను ధీమాగా ఉన్నాడు. కానీ అతనికి 74.8 శాతం మార్కులు వచ్చాయి. దీంతో శాంతనుకి మధ్యప్రదేశ్ ప్రభుత్వ నుంచి మేధావి ఛాత్రా పథకం కింద వచ్చే స్కాలర్ షిప్ అందకుండా పోయింది.


తనకు తప్పకుండా కనీసం 75 శాతం మార్కులు వస్తాయని.. ఏదో పొరపాటు జరిగిందని శాంతను ఎంతో నమ్మకంతో బోర్డుకు ఫిర్యాదు చేశాడు. బోర్డు అతనికి రీకౌంటింగ్‌కు అప్లై చేసుకోవాలని సూచించింది. రీకౌంటింగ్ చేసినా అతనికి 74.8 శాతం మార్కులే వచ్చాయి. అయినా శాంతనుకు ఏదో తేడా ఉందని అనిపించింది. అందుకే తన ఆన్సర్ షీట్ కాపీ ఇవ్వమని బోర్డుకు అప్లై చేశాడు. దీంతో బోర్డు అతనికి ఆన్సర్ షీట్ కాపీ ఇచ్చింది. అందులో అసలు విషయం బయట పడింది. ఆన్సర్ షీట్‌లో ఒక జవాబుకి మార్కులు వేయకండా వదిలేశారు. అది గుర్తించిన శాంతను తప్పు ఎక్కడ జరిగిందో బోర్డుకి వివరిస్తూ లేఖ రాశాడు. కానీ బోర్డు అతడి లేఖను తిరస్కరించింది. ఆన్సర్ షీట్‌లో మార్కులు పెంచడం కుదరదని చెప్పింది.


దీంతో శాంతను తనకు న్యాయం చేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో బోర్డుకు వ్యతిరేకంగా పిటిషన్ వేశాడు. ఈ న్యాయపోరాటంలో 40 సార్లు కోర్టు చూట్టూ తిరిగాడు. దాదాపు రూ.50 వేలు ఖర్చు చేశాడు. చివరికి కోర్టులో అతనికి న్యాయం జరిగింది. శాంతను ఆన్సర్ షీట్‌లో జరిగిన తప్పును సరిదిద్దాలని ఇంటర్ బోర్డును కోర్టు అదేశించింది. ఆ తరువాత ఇంటర్మీడియట్ బోర్డు శాంతనుకి అదనంగా 28 మార్కులు ఇచ్చి 80.4 శాతం మార్కులతో సవరించిన మార్క్ షీట్ ప్రదానం చేసింది.


Updated Date - 2022-03-15T05:55:37+05:30 IST