డిజిటల్ ఇండియాకు తొలి అడ్డంకి ప్రభుత్వ పాఠశాలలు... డొల్లతనాన్ని బయటపెట్టిన గణాంకాలు!
ABN , First Publish Date - 2022-12-15T09:43:52+05:30 IST
మన దేశంలోని 90 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూటర్లు లేవు. ఇంతేకాదు దేశంలోని 66 శాతం పాఠశాలలు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో డిజిటల్ ఇండియాగా మార్చాలనే ప్రచారం ఎంతవరకూ నెరవేరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
మన దేశంలోని 90 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూటర్లు లేవు. ఇంతేకాదు దేశంలోని 66 శాతం పాఠశాలలు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో డిజిటల్ ఇండియాగా మార్చాలనే ప్రచారం ఎంతవరకూ నెరవేరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక నివేదికలో దేశంలోని విద్యా వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు ఆశ్చర్యగొలుపుతున్నాయి. ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లోని డొల్లతనం వెల్లడయ్యింది.
ప్రభుత్వం పాఠశాల విద్యావ్యవస్థలో అనేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. పాఠశాలల్లోని గ్రంథాలయాలు, విద్యుత్ వ్యవస్థ, ఆటస్థలాల పరిస్థితి కొంతవరకూ మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. దేశంలో మొత్తం 14.9 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల లైబ్రరీలో మొత్తం 106 కోట్ల పుస్తకాలు ఉన్నాయి. అంటే ప్రతి పాఠశాలలో దాదాపు 713 పుస్తకాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్లేగ్రౌండ్‌ల గురించి చెప్పాలంటే.. ఈ విషయంలో పంజాబ్‌లోని పాఠశాలలు ముందంజలో ఉన్నాయి.
పంజాబ్‌లోని 97.5% పాఠశాలల్లో ఆట స్థలాలు ఉన్నాయి. పంజాబ్ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్‌ల పేర్లు వస్తాయి. ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ ఇండియాతో అనుసంధానించడానికి మరిన్ని ప్రయత్నాలు అవసరమని నివేదికలోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశంలో కేవలం 10 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. 34 శాతం పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది. బాలికలకు మరుగుదొడ్లు లేని పాఠశాలలు దాదాపు 79 వేలు ఉన్నాయి. వీటిలో 50 శాతం అస్సాం, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో ఉన్నాయి.