నేటి Google doodle ప్రత్యేకత ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-04-23T21:23:06+05:30 IST

ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసిన ఘటనలు, కళాకారులను గూగుల్ తన డూడుల్స్‌లో ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈమారు ప్రముఖ ఇరాకీ కళాకారిణి నజీహా సలీమ్ చిత్రాన్ని గూగుల్.. ఓ డూడుల్ రూపంలో విడుదల చేసింది.

నేటి Google doodle ప్రత్యేకత ఏంటో తెలుసా..

ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసిన ఘటనలు, కళాకారులు, విశిష్ట వ్యక్తుల వివరాలను గూగుల్ తన డూడుల్స్‌ ద్వారా నిత్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈమారు ప్రముఖ ఇరాకీ కళాకారిణి నజీహా సలీమ్ చిత్రాన్ని గూగుల్.. ఓ డూడుల్ రూపంలో విడుదల చేసింది. ఇరాకీ ఆధునిక కళలపై నజీహా తన పెయింటింగ్స్‌తో చెరగని ముద్ర వేశారంటూ గూగుల్ కీర్తించింది. ఇరాకీ గ్రామీణ మహిళల జీవన విధానాన్ని తన ప్రత్యేక పెయింటింగ్ శైలితో కళ్లకుకట్టినట్టు నజీహా చూపించారని పేర్కొంది. నజీహా టర్కీలో 1927లో ఓ ఇరాకీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పెయింటర్ కాగా.. తల్లి ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్. తల్లిదండ్రుల నుంచి కళలను వారసత్వంగా అందుకున్న ఆమెకు చిన్నతనం నుంచే చిత్రకళ పట్ల ఇష్టత పెరిగింది. నజీహాతో పాటూ ఆమె సోదరులు ముగ్గురూ కళల్లో ప్రవేశం ఉన్నవారే. ఆమె సోదరుల్లో ఒకరైన జావేద్ సలీమ్.. ప్రముఖ ఇరాకీ శిల్పకళాకారుల్లో ఒకరిగా పేరు గడించారు. 


ఇక బాగ్దాద్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన నజీహా... ఆ తరువాత తన చిత్రకళా నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకునేందుకు పారిస్ వెళ్లారు. అక్కడ.. e Ecole Nationale Superieure des Beaux-Arts‌లో స్కాలర్‌షిప్‌పై చిత్రకళను అభ్యసించారు. ఫ్రెస్కో, మ్యూరల్ పెయింటింగ్స్‌పై పట్టు సాధించారు. పారిస్‌లోనే మరికొంత కాలం పాటు విద్యార్థులకు చిత్రకళలో శిక్షణ ఇచ్చిన అనంతరం నజీహా ఇరాక్‌కు తిరిగొచ్చారు. తరువాత..  బాగ్దాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కళశాలలో చేరిన ఆమె.. రిటైరయ్యేంత వరకూ అక్కడే కొనసాగారు. పెయింటింగ్స్‌తో పాటూ నజీహా.. ఇరాక్‌ ఆధునిక కళాచరిత్ర తొలిదశలో జరిగిన మార్పులపై  ఓ పుస్తకం కూడా రాశారు. అంతేకాకుండా.. ఆమె, మరికొందరు కళాకారులతో కలిసి అల్-రువ్వాద్ అనే ఆర్టిస్టుల సంఘాన్ని కూడా నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా చిత్రకళలో వస్తున్న మార్పులను ఈ సంఘం సభ్యులు ఇరాక్‌కు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుంటారు. 

Updated Date - 2022-04-23T21:23:06+05:30 IST