పాపం ఈ పాప సరదా ప్రాణాలమీదకొచ్చింది.. జరిగింది చూసి నెవ్వెరపోతున్న నెటిజన్లు!!
ABN , First Publish Date - 2022-10-17T20:27:21+05:30 IST
తన పేరెంట్స్ దగ్గరున్న మొబైల్ ఫోన్ తీసుకుని ఆ దృశ్యాలను రికార్డ్ చేయడానికి ప్రయత్నించింది. అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి కదా!!
చిన్నపిల్లలను వీకెండ్లో సరదాగా బయటకు తీసుకెళ్తుంటారు తల్లిదండ్రులు. పార్క్, జూ, సినిమా, షాపింగ్ ఇలా ఏదో ఒక చోటుకు తీసుకెళ్ళడం చేస్తుంటారు. ఇలానే ఒక పాపను ఆమె తల్లిదండ్రులు జూకు తీసుకెళ్ళారు. జూలో ఒక చోట కోతులు అటూ, ఇటూ గెంతుతూ ఉండటంతో ఆ పాప వాటిని చూసి ముచ్చట పడింది. తన పేరెంట్స్ దగ్గరున్న మొబైల్ ఫోన్ తీసుకుని ఆ దృశ్యాలను రికార్డ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి కదా!! అదే విధంగా ఈ పాప ఆ కోతిని రికార్డ్ చేయడంలోనే లీనమైపోయినపుడు అనుకోకుండా కోతి ఒక్కసారిగా ఆ పాప జుట్టును పట్టుకుంది. ఆ పాప ఎంత గింజుకున్నా ఆ కోతి పట్టు నుండి వదిలించుకోలేకపోయింది. చివరకు ఆ పాప ఓ స్థాయిలో భయపడిపోయి ఏడుపు అందుకుంది. దీంతో సమయానికి అక్కడికి ఆ పాప తల్లిదండ్రులు వచ్చి ఆ కోతిని తరిమేయడంతో ఆ పాప ఊపిరిపీల్చుకుంది.
కోతి చేతి నుండి తప్పించుకున్నానని ఆ పాప సంబరపడిందో ఏమో కానీ, అది జరిగి నిమిషం కూడా కాకముందే మళ్ళీ మొబైల్ పట్టుకుని ఆ కోతి దగ్గరికి వెళ్ళింది. ఈసారి ముందు ఉడుం పట్టు పట్టిన కోతితో పాటు దాని ఫ్రెండ్ కూడా జతకలిసి పాప జుట్టును పట్టేసుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ కోతులు పాప జుట్టును వదల్లేదు. ఇందంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ పాప ఆ కోతుల చేతుల్లో నుండి బయటపడిందో లేదో వీడియో చివరలో కనిపించలేదు. ఇదంతా ఎక్కడ జరిగిందో కూడా తెలియదు.. అయితే సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. కానీ అమాయక ప్రాణులను బంధించి వాటి స్వేచ్ఛను హరించడమే కాకుండా వాటికి కోపం తెప్పించేలా ప్రవర్తించడం అందరూ చేస్తున్న తప్పు.
ఆ జంతువుల పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయం ఆ పాపకు తెలియక అలా చేసుండచ్చు, స్వేచ్ఛను కోల్పోయి ఆ కోతులు వాటి అసహనం అలా బయటపెట్టి ఉండచ్చు. ఏది ఏమైనా జంతువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి.