ఏ కర్మకు ఎటువంటి ఫలితం? ఎలాంటి జన్మ వస్తుంది? 8 పాయింట్లలో సమగ్రంగా వివరించిన గరుడ పురాణం!
ABN , First Publish Date - 2022-10-19T15:52:34+05:30 IST
వివిధ మత గ్రంథాల ప్రకారం మనిషి...
వివిధ మత గ్రంథాల ప్రకారం మనిషి తాను చేసిన కర్మలకు అనుగుణంగా స్వర్గనరకాలను పొందుతాడు. గరుడ పురాణంలో మనిషి చేసే కర్మల ఫలితాలను తెలియజేశారు. మనిషి చేసిన కర్మల ఆధారంగా అతని మరణానంతరం స్వర్గం లేదా నరకాన్ని పొందుతాడని నమ్ముతారు. గరుడ పురాణంలో కర్మ ఆధారంగా ఒక వ్యక్తి మరుసటి జన్మలో ఏ రూపంలో జన్మిస్తాడనేది వివరంగా తెలిపారు. మనిషి చేసే చర్యలు అతని తదుపరి జన్మను నిర్ణయిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు, వారిని కష్టాలకు గురిచేసేవారు మరుజన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారని గరుడ పురాణంలో పేర్కొన్నారు. ఇదేవిధంగా అక్రమ సంబంధాలు కలిగిన వ్యక్తి తదుపరి జన్మలో నపుంసకుడవుతాడు. గురువు భార్యతో తప్పుగా ప్రవర్తించే వ్యక్తి కుష్టు రోగిగా జన్మిస్తాడు.
2. మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబగా జన్మిస్తారని గరుడ పురాణం చెబుతోంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవారు తదుపరి జన్మలో అంధునిగా పుడతాడు.
3. గరుడ పురాణం ప్రకారం ఇతరులను దోచుకోవడం, జంతువులను హింసించడం లేదా వేటాడటం వంటి హింసాయుత పనులు చేసి, కుటుంబాన్ని పోషించే వ్యక్తి తదుపరి జన్మలో కసాయి చేతిలో బలి అయ్యే మేక అవుతాడు.
4. తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తి తదుపరి జన్మలో తల్లి గర్భంలోనే చనిపోతాడు. అతను భూమిపైకి వచ్చే అవకాశం ఉండదు.
5. గురువును అవమానించడం అంటే భగవంతుడిని అవమానించడం. అలా చేసేవారు నరకానికి చేరుతారు. గురువుతో అనుచితంగా ప్రవర్తించిన శిష్యుడు మరుజన్మలో నీరులేని అడవిలో బ్రహ్మరాక్షసుడవుతాడు అని గరుడపురాణంలో పేర్కొన్నారు.
6. పురుషుడైనప్పటికీ స్త్రీలా ప్రవర్తిస్తే, స్త్రీల అలవాట్లను కలిగివుంటే, అటువంటి పురుషుడు తదుపరి జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతాడు.
7. ఎవరైనా మరణ సమయంలో భగవంతుని పేరు జపిస్తే, అతను ముక్తి మార్గంలో పయనిస్తాడు. అందుకే మరణ సమయంలో రామ నామం జపించాలని గ్రంథాలలో పేర్కొన్నారు.
8. స్త్రీని హత్యచేసిన లేదా ఆమెకు గర్భస్రావము చేయించిన వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధి బారిన పడతాడు. గోవును చంపినవారు నరక యాతనలు అనుభవించి, వచ్చే జన్మలో చండాలునిగా జన్మిస్తారని గరుడ పురాణంలో పేర్కొన్నారు.