విదేశీ యువకుడి చేతిలో మోసపోయిన యువతులు.. ఖరీదైన గిఫ్టుల పేరిట వల.. అతనేం చేసేవాడంటే..

ABN , First Publish Date - 2022-05-22T05:41:12+05:30 IST

సోషల్ మీడియాలో యువతులతో స్నేహం చేసిన ఒక యువకుడు.. విదేశాల నుంచి విలువైన బహుమతులు పంపుతున్నానని చెప్పేవాడు. కొన్నిరోజుల తర్వాత సదరు బహుమతులకు జీఎస్టీ కట్టాలంటూ మరొకరు సదరు యువతులకు ఫోన్లు చేసేవారు. ఆ డబ్బు చెల్లించకపోతే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని కేసులు పెడతామని బెదిరించేవారు...

విదేశీ యువకుడి చేతిలో మోసపోయిన యువతులు.. ఖరీదైన గిఫ్టుల పేరిట వల.. అతనేం చేసేవాడంటే..

సోషల్ మీడియాలో యువతులతో స్నేహం చేసిన ఒక యువకుడు.. విదేశాల నుంచి విలువైన బహుమతులు పంపుతున్నానని చెప్పేవాడు. కొన్నిరోజుల తర్వాత సదరు బహుమతులకు జీఎస్టీ కట్టాలంటూ మరొకరు సదరు యువతులకు ఫోన్లు చేసేవారు. ఆ డబ్బు చెల్లించకపోతే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని కేసులు పెడతామని బెదిరించేవారు. ఇలా సుమారు 16 మంది యువతులను మోసం చేసి, రూ.1.6 కోట్లు కాజేసిందా గ్యాంగ్. ఇటీవల ఇలాగే మోసపోయిన ఒక యువతి.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన యూపీలోని నోయిడాలో జరిగింది. 


నైజీరియాకు చెందిన ఒక యువకుడు విజిటింగ్ వీసాపై భారత్‌కు వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత నోయిడాకు చెందిన ఒక యువకుడు, ఒక యువతితో కలిసి సైబర్ నేరాలు చేయడం ప్రారంభించాడు. సోషల్ మీడియాలో అందమైన యువతులకు గాలం వేసేవాడు. వాళ్లకు ఖరీదైన బహుమతులు పంపుతున్నాని చెప్పేవాడు. ఆ తర్వాత అతని గ్యాంగ్ మెంబర్ అయిన మహిళ ఫోన్ చేసి సదరు బహుమతికి జీఎస్టీ కట్టి తీసుకోవాలని చెప్పేది. ఇలా స్థానికంగా ఒక మహిళకు ఇటీవలే ఫోన్ చేశారు. బహుమతి విలువ రూ.కోటి అని, జీఎస్టీ కింద రూ.28 లక్షలు కట్టాలని చెప్పారు. ఆమె కట్టనంటే ఉగ్రవాదం కింద కేసు పెడతామని బెదిరించారు. దాంతో అప్పు చేసి మరీ డబ్బు కట్టిన యువతి.. తనకు ఎలాంటి బహుమతీ అందకపోవడంతో షాకైపోయింది. 

ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా ఇప్పటి వరకు మొత్తం 16 మంది యువతులను మోసం చేసినట్లు వాళ్లు అంగీకరించారు. మరింత దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే నిందితులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-05-22T05:41:12+05:30 IST