లోక్ అదాలత్ గురించి మీకు తెలుసా..? లోక్ అదాలత్ తీర్పు ఫైనలా!

ABN , First Publish Date - 2022-09-26T23:20:57+05:30 IST

అన్నదమ్ములైన రమేశ్, సురేశ్‌లకు వారసత్వంగా కొన్ని ఆస్తులు సంక్రమించాయి. అయితే, పంపకాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో

లోక్ అదాలత్ గురించి మీకు తెలుసా..? లోక్ అదాలత్ తీర్పు ఫైనలా!

అన్నదమ్ములైన రమేశ్, సురేశ్‌లకు వారసత్వంగా కొన్ని ఆస్తులు సంక్రమించాయి. అయితే, పంపకాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరూ శత్రువుల్లా మారారు. వారికి నచ్చజెప్పేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈలోపు ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇక లాభం లేదని సురేష్ కోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లపాటు చెప్పులరిగేలా కోర్టు చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈలోపు న్యాయవాది ఇచ్చిన సలహాతో లోక్ అదాలత్‌ను ఆశ్రయించాడు సురేశ్. అంతే.. రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్య వారాల వ్యవధిలోనే పరిష్కారమైంది. శత్రువులుగా మారిన అన్నదమ్ముల మధ్య  మళ్లీ సత్సంబంధాలు నెలకొన్నాయి.


లోక్ అదాలత్ అంటే ఏమిటీ?

చట్టంలో అందరికీ అవగాహన లేని విషయాలు చాలానే ఉంటాయి. అందులో ఒకటి లోక్ అదాలత్ (పీపుల్స్ కోర్ట్) ఒకటి. కేసుల సంఖ్య పెరిగిపోవడంతో వాటి సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్‌‌ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చు. లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, 1987 ప్రకారం ఒక చట్టబద్ధమైన సంస్థ. దేశంలో ఉపయోగించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానంగా రూపొందించబడింది. పెండింగ్‌లో ఉన్న కేసులు లేదా న్యాయస్థానంలో ప్రీ-లిటిగేషన్ దశలో ఉన్న కేసులను పరిష్కరించే వేదిక ఇది. ఈ చట్టం ప్రకారం.. లోక్ అదాలత్‌లు ఇచ్చే అవార్డు (నిర్ణయం) సివిల్ కోర్టు కేసుగా పరిగణించబడుతుంది. రాజీకి అవకాశం ఉన్న కేసులను మాత్రమే లోక్‌ అదాలత్‌ల ద్వారా సత్వరంగా పరిష్కరించుకోవచ్చు. ఇక్కడ ఇచ్చే తీర్పు అంతిమం. లోక్ అదాలత్ కేసు పరిష్కారం అయినప్పుడు అవార్డుకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం ముందు అప్పీల్ చేయడానికి కుదరదు. లోక్‌ అదాలత్‌ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయి. ఇలా పరిష్కరించుకుని డబ్బును సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అదే కోర్టులో కేసువేస్తే చాలా కాలం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కక్షిదారులు కోర్టు చుట్టూ తిరగాల్సిందే. ఎందుకంటే అంతకు ముందు ఉన్న కేసులు పూర్తయితేనే కొత్తగా వేసిన కేసులకు పరిష్కారం దొరుకుతుంది. లోక్‌ అదాలత్‌ కేసులకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని  ఎబీఎన్‌తో మాట్లాడుతూ హైకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శర్మ తెలిపారు.


లోక్ అదాలత్‌కు సభ్యులు అధ్యక్షత వహిస్తారు. వీరికి చట్టబద్ధమైన రాజీదారుల పాత్ర మాత్రమే ఉంటుంది. కానీ న్యాయపరమైన పాత్ర ఉండదు. వారు ఒక పరిష్కారానికి రావడానికి మాత్రమే పార్టీలను ఒప్పించగలరు. కొన్నిసార్లు ప్రత్యర్థి పార్టీల మధ్య కౌన్సెలింగ్ సెషన్‌లు కూడా జరుగుతాయి. లోక్ అదాలత్ ప్రధాన షరతు ఏమిటంటే.. కక్షిదారులు సెటిల్‌మెంట్ కోసం అంగీకరించాలి. భాగపరిష్కారాలు, నష్టపరిహారం, వివాహ కేసుల వంటి వివాదాలు లోక్ అదాలత్‌లో సులభంగా పరిష్కరించబడతాయి. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే విధానం ద్వారా రాజీకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లోక్ అదాలత్ సివిల్ కేసులు (వివాహం, కుటుంబ వివాదాలతో సహా), కాంపౌండ్ చేయదగిన క్రిమినల్ కేసులను తీసుకోవచ్చు. లోక్ అదాలత్ జారీ చేసిన ఉత్తర్వును కోర్టు రీకాల్ చేయడం లేదా సమీక్షించడం సాధ్యం కాదు.


ఏదైనా కేసు ఏదైనా కోర్టులో పెండింగ్ ఉంటే లోక్ అదాలత్‌ను ఆశ్రయించే కేసులు ఇవీ..

* ఇప్పటకే కేసు నమోదైన క్రిమినల్ నేరం

* నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 138 కింద కేసులు

* డబ్బులను రికవరీకి సంబంధించిన సమస్యలు

* ఇండియన్ మోటార్ చట్టం 1988 కిందికి వచ్చే సమస్యలు 

* కార్మిక సంబంధిత సమస్యలు 

* విద్యుత్, వాటర్ సహా నాన్ కాంపౌండబుల్ నేరాలు 

* వివాహ సంబంధిత సమస్యలు 


 కోర్టులో కేసు వేసినప్పటికీ విచారణకు రాని సందర్భాల్లో..

* నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 138 కింద కేసులు

* డబ్బులను రికవరీకి సంబంధించిన సమస్యలు

* కార్మిక సంబంధిత సమస్యలు 

* విద్యుత్, వాటర్ సహా నాన్ కాంపౌండబుల్ నేరాలు 

* సాధారణ నిర్వహణ సంబంధిత వివాదాలు.

* పౌర వివాదాలు, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, వివాహ వివాదాలు వంటి ఇతర ఇతర కేసుల విషయాల్లో లోక్ అదాలత్‌ను ఆశ్రయించవచ్చు.                                                                                                                  బి. భాస్కర్

Read more