Chanakya Niti: వైవాహిక జీవితంలో అపార్థాలను అంతం చేసే అమూల్యమైన ఉపాయాలివే...
ABN , First Publish Date - 2022-08-14T12:59:09+05:30 IST
చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు సంతోషకరమైన...

చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి చర్చించారు. భార్యాభర్తల బంధాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి? ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు తెలియజేశారు. అవేమిటో ఇప్పుడు తెలిసుకుందాం.
1. చాణక్య నీతి ప్రకారం వైవాహిక సంబంధాల విషయంలో సందేహాలకు తావుండకూడదు. వైవాహిక సంబంధాన్ని బలహీనపరచడంలో సందేహం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అపార్థానికి దారితీస్తుంది. తరువాత జీవితం వృథాగా మారుతుంది. ఒక్కసారి అనుమానం కలిగితే అది అంత తేలికగా పోదంటారు. సంబంధాలలో పరిపక్వత అవసరం. ఒకరిరిపై మరొకరు నమ్మకాన్ని పెంపొందింపజేసుకోవాలి.
2. వైవాహిక జీవితంలో అహకారం చోటుచేసుకుంటే ఆ బంధం బలహీనపడుతుందని చాణక్య నీతిలో పేర్కొన్నారు. అందుకే దంపతులు అహంకారానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని చాణక్య తెలిపారు. భార్యాభర్తల మధ్య అహంకారానికి చోటు ఉండకూడదని సూచించారు.
3. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉండాలంటే, అందులో అబద్ధాలకు తావు ఉండకూడదు. అబద్ధాలు భార్యాభర్తల మధ్య సంబంధాలను బలహీనపరుస్తాయి. భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఇది అవగాహన, పరస్పర సమన్వయంతో జరగాలని చాణక్య సూచించారు.
4. చాణక్య నీతి ప్రకారం పరస్పర గౌరవం అనేది ఎటువంటి సంబంధాన్నయినా బలంగా, దీర్ఘకాలం కొనసాగించడానికి అవసరం. పరస్పర గౌరవభావం లేనప్పుడు ఆ సంబంధం విలువ లేనిదిగా మారుతుంది, దంపతుల మధ్య ఆనందం ఆవిరవుతుంది. ప్రతి సంబంధానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ పరిమితిని ఎవరూ దాటకూడదని చాణక్య సూచించారు.