పాముల మధ్య చీకటిలో 36 గంటలు గడిపిన యువతి.. ఆమెను అక్కడ ఎవరు పడేశారంటే..

ABN , First Publish Date - 2022-03-05T18:25:35+05:30 IST

ఆ యువతి గత బుధవారం ఇంటి నుంచి బయల్దేరి కాలేజీకి వెళ్లింది.. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లలేదు..

పాముల మధ్య చీకటిలో 36 గంటలు గడిపిన యువతి.. ఆమెను అక్కడ ఎవరు పడేశారంటే..

ఆ యువతి గత బుధవారం ఇంటి నుంచి బయల్దేరి కాలేజీకి వెళ్లింది.. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లలేదు.. రాత్రి వరకు చూసినా ఆమె ఆచూకీ తెలియలేదు.. దీంతో తల్లిదండ్రులు తర్వాతి రోజు ఉదయం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలేజ్‌కి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.. ఆమె తన బావతోనే వెళ్లినట్టు తేలింది.. అతడిని విచారించగా షాకింగ్ విషయం బయటపడింది. రాజస్థాన్‌లోని అళ్వార్‌లో ఈ ఘటన జరిగింది. 


అళ్వార్‌కు చెందిన 19 ఏళ్ల యువతి గత బుధవారం ఉదయం కళాశాలకని ఇంటి నుంచి బయల్దేరింది. అయితే కాలేజ్ సమీపంలో ఆమె తన బావ సుందర్ లాల్ బైక్ ఎక్కి వెళ్లింది. వారిద్దరూ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు. అయితే పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఆ యువతి తల్లిదండ్రులు చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంది. దీంతో తన మరదలిని చంపెయ్యాలని సుందర్ లాల్ నిర్ణయించుకున్నాడు. ఆమెను బైక్‌పై ఎక్కించుకుని ఊరి శివార్లలో ఉన్న పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకెళ్లాడు. 


అక్కడ ఆమె గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను 100 అడుగుల లోతున్న బావిలోకి తోసేసి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. స్పృహ తప్పిన యువతి పాములు, తేళ్ల మధ్య ఆ బావిలో 36 గంటలు ఉండిపోయింది. సుందర్ లాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు ఆ బావి వద్దకు చేరుకుని ఆ యువతిని బయటకు తీశారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స అందుకుంటోంది.  

Read more