వధువు చెంప చెళ్లుమనిపించిన వరుడు.. అవమానంతో ఆమె చేసిన పనికి అతడి మైండ్‌బ్లాక్..!

ABN , First Publish Date - 2022-01-22T21:22:32+05:30 IST

పెళ్లి చేసుకోబోతున్న ఆనందంలో వధువు చేసిన ఓ పనికి వరుడు షాకిచ్చాడు. బంధువులు అందరూ చూస్తుండగానే వధువు చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా విస్తుపోయారు

వధువు చెంప చెళ్లుమనిపించిన వరుడు.. అవమానంతో ఆమె చేసిన పనికి అతడి మైండ్‌బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకోబోతున్న ఆనందంలో వధువు చేసిన ఓ పనికి వరుడు షాకిచ్చాడు. బంధువులు అందరూ చూస్తుండగానే వధువు చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా విస్తుపోయారు. అయితే అవమానాన్ని తట్టుకోలేక వధువు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా మద్దతు తెలపడంతో వరుడి మైండ్ బ్లాక్ అయింది. ఆ తర్వాత వరుడు ఏం చేశాడు? ఇంతకూ వధువు ఏం చేసిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని పన్రుతి ప్రాంతానికి చెందిన యువతికి వివాహం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పెరియకట్టుపాలయానికి చెందిన యువకుడిని చూశారు. అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు నచ్చడంతో గత ఏడాది నవంబర్ 6న నిశ్చితార్థం జరిపించారు. అంతేకాకుండా జనవరి 20న పెళ్లి చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వారి సంప్రదాయం ప్రకారం.. పెళ్లికి ముందు రోజు అంటే జనవరి 19న రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే డీజే పాటలను పెట్టించారు. పాటలకు అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండటంతో.. వధూవరులు కూడా స్టెప్పులేయడం ప్రారంభించారు. ఇంతలో వధువు తరఫు బంధువు ఒకరు స్టేజిపైకి వచ్చి.. ఇద్దరిపై చేతులేసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. తన ముందే వధువుపై ఓ వ్యక్తి చేతులు వేయడం.. ఆమె కూడా దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అనిపించడంతో వరుడు ఆగ్రహానికి లోనయ్యాడు. అంతేకాకుండా వధువు సహా అమె బంధువును దూరంగా తోసేశాడు. అనంతరం బంధువులు అందరూ చూస్తుండగానే వధువుపై చేయి చేసుకున్నాడు. వరుడు అలా చేయడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ నేపథ్యంలో అవమానాన్ని తట్టులేక వధువు కీలక నిర్ణయం తీసుకుంది. అతడిని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. వధువు నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. అంతేకాకుండా అదే ముహూర్తానికి తమ కూతురిని బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యుల నిర్ణయానికి వధువు కూడా ఓకే చెప్పడంతో వరుడి మైండ్ బ్లాక్ అయింది. అన్నట్టుగానే మరో అబ్బాయితో వధువుకు పెళ్లి చేయడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. వధువుపై చేయి చేసుకున్నట్టు ఆరోపిస్తూ పెళ్లి రద్దు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లి కోసం ఇప్పటి వరకు రూ.7 లక్షలు ఖర్చు చేశానని వెల్లడించాడు. పెళ్లి రద్దు కావడం వల్ల తాను రూ.7 లక్షలు నష్టపోయానని.. ఎలాగైనా న్యాయం చేయాలంటూ అభ్యర్థించాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
Updated Date - 2022-01-22T21:22:32+05:30 IST