ఊరికి అండ ఈ బోడికొండ

ABN , First Publish Date - 2022-04-24T18:14:02+05:30 IST

ప్రకృతికి ఎంత దూరమైతే అన్ని సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!. అదే, ప్రకృతికి ఎంత దగ్గరైతే అంత మంచి జరుగుతుంది. కరువుకాటకాలతో తాగడానికే మంచినీళ్లు లేని ఆంధ్రప్రదేశ్‌లోని గురవాజీపేట... ఇప్పుడు పచ్చదనంతో ఆకర్షిస్తోంది...

ఊరికి అండ ఈ బోడికొండ

ప్రకృతికి ఎంత దూరమైతే అన్ని సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!. అదే, ప్రకృతికి ఎంత దగ్గరైతే అంత మంచి జరుగుతుంది. కరువుకాటకాలతో తాగడానికే మంచినీళ్లు లేని ఆంధ్రప్రదేశ్‌లోని గురవాజీపేట... ఇప్పుడు పచ్చదనంతో ఆకర్షిస్తోంది..


ఊళ్లు కళకళలాడాలంటే నీళ్లు జలజలా ప్రవహించాలి. జలం లేని చోట.. జన వికాసం శూన్యం. ఇదీ.. ఒకప్పుడు గురవాజీపేట పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా ఒకటి. ఇక్కడి కనిగిరి మండలంలోని గురవాజీపేటలో అయితే వర్షాలు చాలా తక్కువ. నీటి కొరతతో అల్లాడిపోయేవారు స్థానికులు. వేసవిలో నీళ్ల కోసం మైళ్లు నడవాల్సిన దుస్థితి. పంటలు లేకపోవడంతో ఉపాధి కోసం ఒంగోలు, నెల్లూరులకు వలస వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో 2014లో గ్రామస్థులంతా కలిసి సమస్య పరిష్కారం కోసం గ్రామసభ పెట్టుకున్నారు.


అందరూ ఒక్కటై.. 

జలమే మనకు జీవం... నీటి వనరులను పెంచుకోకపోతే ఏదో ఒక రోజు ఊరంతా ఖాళీ కావడం ఖాయం. కొండ చుట్టూ పచ్చదనం ఉంటేనే దిగువన ఉన్న భూములకు నీళ్లు చేరతాయి. తమ సమస్యలన్నీ కాగితం మీద రాసి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులను కలిశారు గ్రామస్థులు. నీటి కష్టాలు విన్న అధికారులు వారి సంకల్పానికి తోడుగా నిలిచారు. గ్రామంలో ఇరవై మంది సభ్యులతో వాటర్‌షెడ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. నీటి కరువు తీరాలంటే వర్షాకాలంలో పడే ప్రతి చినుకునూ బోడిగుట్ట కొండ వాలులో ఇంకేలా చేస్తే ఎంతోకొంత మార్పు వస్తుందని, అందుకు కొన్ని పనులు చేయాలని అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. జలయజ్ఞం కోసం అందరూ నడుం బిగించారు. కొండవాలులోని రాళ్లు రప్పల్ని తొలగించి కందకాలు తవ్వారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా అనుకున్నది సాధించారు. వారి కష్టం ఫలించింది. భూమికి నీరు, పొలాలకు పచ్చదనం వచ్చింది.


చెమటను చిందించి..

కరువునేలపై జలకళ రావడానికి గురవాజీపేట వాసులు పడని కష్టం లేదు. బోడికొండను దూరం నుంచి చూస్తే ఒక గుట్టనే కానీ అది మూడు కొండల సమూహం. ‘‘కొండవాలు దిగువన పొలాల వరకు కందకాలు, ఊట గుంటలు తవ్వడంతో పాటు అక్కడక్కడ రాతి కట్టలు, చెక్‌వాల్వులు, ఇనుపచువ్వలతో కట్టే రాతి గోడలు వంటి పదిహేను రకాల పనుల్ని డ్వామా అధికారుల సలహాలతో చేశాం. ఎక్కడ ఏది నిర్మించాలన్న విషయంలో నీటి యాజమాన్య సంస్థ మాకు పక్కా ప్రణాళికను అందించింది. వాన నీటిని ఆపే కందకాలు, ఒడ్డున మొక్కలు నాటాం. వాటిని కాపాడేందుకు ముగ్గురు వన మిత్రలను కూడా నియమించాం..’’ అన్నారు వాటర్‌ షెడ్‌ కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామస్థులను సమన్వయపరిచి, పనులు చేపట్టడంలో కీలకపాత్ర పోషించిన పీఓ నిజాముద్దీన్‌ ఇలా అంటారు... ‘‘ఎత్తయిన ప్రదేశంలో పడిన వాన నీరు వాగులు, వంకల ద్వారా పల్లానికి ప్రవహించే ప్రాంతాలన్నింటినీ కలిపి వాటర్‌షెడ్‌ అంటారు. ఇదే బోడికొండకు జీవం పోసింది. మూడేళ్లు కష్టపడి 250 ఎకరాల్లో వాటర్‌షెడ్‌ పనులు చేశారు స్థానికులు. చెక్‌డ్యామ్‌లు, రాతి కట్టడాలు, ఊట కుంటలు, కందకాలు, ఫామ్‌పాండ్స్‌ నిర్మించాం’’ అన్నారాయన. 


వేల మొక్కల్ని నాటి..

గురవాజీపేట గ్రామస్థులందరి శ్రమతో బోడికొండపై పచ్చదనం పరుచుకుంది. రెండు లక్షల కలబంద మొక్కలతో పాటు సీతాఫలం, కానుగ, వేప, నేరేడు, ఉసిరి, చింత, కుంకుడు, గోరింటాకు, మద్ది, టేకు ఇలా పలు రకాలకు చెందిన 45 వేల మొక్కల్ని నాటారు. రోజూ ట్యాంకర్లతో నీటిని తెప్పించి వాటికి పోసేవారు. అందరి కృషితో బోడికొండ కనుమపై పచ్చదనం విస్తరించింది. జలసంరక్షణ, భూసార పరిరక్షణ, పచ్చదనం పెంపు వంటి పనులకు కోటి రూపాయలు ఖర్చు చేశారు. ‘‘ఒకప్పుడు తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచేవాళ్లం. కొందరు వాటర్‌ క్యాన్‌లను కొనేవారు. ఇప్పుడా బాధలు తప్పాయి. తాగునీరే కాదు, పశువులకు, పంటలకు పుష్కలంగా నీరు అందుతోందిప్పుడు. ఇలా భూగర్భ జలాలు పెరగడం సంతోషకరం’’ అన్నారు స్వయం సహాయక సంఘ సభ్యురాలు జ్యోతి. ‘గురవాజీపేట సమగ్ర వాటర్‌షెడ్‌ పథకం’ వల్ల బోర్లు, చేతి పంపుల్లో నీరు చేరింది. వరి, కంది, పత్తి, మిరప పంటల్ని రైతులు సాగు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచీ పలువురు అధికారులు ఈ ఊరిని అధ్యయనం చేయడానికి ఆసక్తి చూపడం శుభపరిణామం. 


- శ్యాంమోహన్‌, 9440595858

Read more