బెర్ముడా ట్రయాంగిల్‌ మీదుగా ప్రయాణం.. ఓడ అదృశ్యమైతే డబ్బు వాపస్!

ABN , First Publish Date - 2022-05-28T21:12:21+05:30 IST

బెర్ముడా ట్రయంగిల్.. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటి.

బెర్ముడా ట్రయాంగిల్‌ మీదుగా ప్రయాణం.. ఓడ అదృశ్యమైతే డబ్బు వాపస్!

బెర్ముడా ట్రయంగిల్.. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటి. ఈ ప్రాంతం గుండా వెళ్లిన చాలా ఓడలు, విమానాలు కనిపించకుండా పోయాయి. అక్కడ ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగలేదు. ఆ ప్రాంతంలో మాయమైన ఓడల, విమానాల శిథిలాలు కూడా దొరకలేదు. వాటిని వెతకడానికి వెళ్లిన విమానాలు సైతం మళ్లీ వెనక్కి రాలేదు. దీంతో బెర్ముడా ట్రయాంగిల్‌కు `డెవిల్ ట్రయాంగిల్` అనే పేరు కూడా వచ్చింది. బెర్ముడా ట్రయంగిల్ చుట్టూ అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అతీత శక్తులు, ఏలియన్లు అక్కడ ఉన్నారని చాలా మంది నమ్ముతున్నారు. 


ఇది కూడా చదవండి..

కాసేపు ఆగండి.. అన్నం వండుతానన్న భార్య.. భోజనం ఆలస్యమైందని ఆ భర్త చేసిన దారుణమిదీ..!


తాజాగా అమెరికాకు చెందిన ఏన్షియంట్ మిస్టరీస్ సంస్థ ప్రయాణికుల కోసం విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థ వచ్చే ఏడాది మార్చిలో న్యూయార్క్ నుంచి బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా ఓ భారీ క్రూయిజ్‌ను నడపబోతోంది. ఒకవేళ ఆ క్రూయిజ్ కనుక బెర్ముడా ట్రయాంగిల్‌లో అదృశ్యమైతే ప్రయాణం కోసం కట్టిన మొత్తం డబ్బులను ప్యాసింజర్లకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇస్తోంది. `ఈ బెర్ముడా ట్రయాంగిల్ టూర్‌లో అదృశ్యమవడం గురించి చింతించకండి. ఈ పర్యటన 100 శాతం రిటర్న్ రేటును కలిగి ఉంది. ఒకవేళ మీరు కనుక అదృశ్యమైతే మీ డబ్బు తిరిగి వెనక్కి వచ్చేస్తుంద`ని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


1945 డిసెంబర్ 5న బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వెళ్లిన అమెరికాకు చెందిన ఐదు విమానాలు కొంత సమయానికి అదృశ్యమయ్యాయి. ఆ తర్వాత వాటి గురించిన సమాచారం ఏమీ రాలేదు. విమాన శిథిలాలు, సిబ్బందికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. వాటి కోసం వెతకడానికి వెళ్లిన మరో ప్లేన్ కూడా అదే రోజు అదృశ్యమైపోయింది. కాగా, ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ శాస్త్రవేత్త బెర్ముడా ట్రయాంగిల్ దుర్ఘటనలకు మానవ తప్పిదాలే కారణమని అభిప్రాయపడ్డారు. ఇతర సముద్ర జలాల్లో జరిగే ప్రమాదాల శాతంతో పరిశీలిస్తే బెర్ముడా ట్రయాంగిల్‌లో జరిగిన ప్రమాదాల సంఖ్య తక్కువేనని చెప్పారు. బెర్ముడా ట్రయంగిల్‌లో జరిగే దర్ఘటనలకు మానవ తప్పిదాలే కారణం కావొచ్చిన అన్నారు. కాగా, ఫ్లైట్ 19 ప్రమాదానికి ఆ రోజు అట్లాంటిక్‌లో 15 మీటర్ల ఎత్తుతో వచ్చిన అలలు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-28T21:12:21+05:30 IST