OHWRK: కేఏ పాల్‌తో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ఊహించని పరిణామం.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-05-22T02:01:34+05:30 IST
కేఏ పాల్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. మత ప్రబోధకుడిగా, శాంతిదూతగా, తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై అగ్గి మీద గుగ్గిలంలా..

కేఏ పాల్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. మత ప్రబోధకుడిగా, శాంతిదూతగా, తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్న కేఏ పాల్‌ను ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేశారు. కేఏ పాల్‌తో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో కేఏ పాల్‌ను ఎలా ఉన్నారని ఆర్కే అడగ్గా.. ఎక్సలెంట్‌గా ఉన్నానని ఆయన బదులిచ్చారు.
కేఏ పాల్ అంటే ఒక కమెడియన్లా అయిపోయాడనే కామెంట్ ఎందుకొచ్చిందని రాధాకృష్ణ అడిగితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ దుష్ట రాజకీయ నాయకులు ముగ్గురూ కళ్లు నెత్తిమీదకొచ్చి తనను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని, ఆపగలరా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఏబీఎన్ ఛానల్లో ఈరోజు పోల్ పెట్టండని, ‘కేసీఆర్ కావాలా..?, కేఏ పాల్ కావాలా..?’ అని పోల్ పెట్టాలని కేఏ పాల్ సూచించారు. పెడితే ఏమవుతుందని రాధాకృష్ణ అడగ్గా.. పెట్టి చూడండంటూ కేఏ పాల్ ఛాలెంజ్ చేశారు(ఈ సవాల్‌ను హుందాగా స్వీకరించిన ఏబీఎన్ ఛానల్ పోల్ పెట్టడం జరిగింది). ‘మీకేమైంది.. ఇలా మారిపోయారు.. ఏమైంది.. మీకీ మధ్యన’ అని ఏబీఎన్ ఎండీని ఉద్దేశించి పాల్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాధాకృష్ణ ‘నాకా.. మైండ్ దొబ్బింది’ అని బదులిచ్చారు.
గత ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ తరపున ఆంధ్రాలో పోటీ చేసి ఒక్క సీటులో కూడా, కనీసం మీరు పోటీ చేసిన స్థానంలో కూడా డిపాజిట్ రాలేదని రాధాకృష్ణ కేఏ పాల్‌కు గుర్తుచేశారు. ఇందుకు స్పందిస్తూ.. ఎన్టీ రామారావుకే సంవత్సరం పట్టిందని, చిరంజీవికే రెండేళ్లు పట్టిందని, తాను వారంలో ఎలా గెలుస్తానని కేఏ పాల్ ప్రశ్నించారు. ఒకప్పటి కేఏ పాల్ ఇప్పుడు ఎందుకు నవ్వుల పాలు అని ఆర్కే అడగ్గా.. బిల్ క్లింటన్‌ను తీసుకొచ్చానా లేదా హైదరాబాద్‌కి అని కేఏ పాల్ అడిగారు. వచ్చే సంవత్సరం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయని.. పోటీ చేస్తారా అని రాధాకృష్ణ అడగ్గా.. వంద శాతం పోటీ చేస్తానని కేఏ పాల్ బదులిచ్చారు. కేఏ పాల్‌తో ‘Open Heart With RK’ కార్యక్రమం ఈ ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఏబీఎన్‌లో ప్రసారం కానుంది.