Viral Wedding Photo Shoot : జీవితంలో ఒడుదొడుకుల్ని తట్టుకోగలనని నిరూపించడానికి ఆ కొత్త పెళ్లి కూతురు చేసిన పనికి లైక్స్ వెల్లువ

ABN , First Publish Date - 2022-09-21T17:39:11+05:30 IST

కేరళలో ఓ కొత్త పెళ్లి కూతురు వెడ్డింగ్ ఫొటో షూట్ వైరల్ అవుతోంది

Viral Wedding Photo Shoot : జీవితంలో ఒడుదొడుకుల్ని తట్టుకోగలనని నిరూపించడానికి ఆ కొత్త పెళ్లి కూతురు చేసిన పనికి లైక్స్ వెల్లువ

తిరువనంతపురం : కేరళలో ఓ కొత్త పెళ్లి కూతురు వెడ్డింగ్ ఫొటో షూట్ వైరల్ అవుతోంది. పెళ్లంటే నూరేళ్ల పంట కాబట్టి తన బ్రైడల్ ఫొటోగ్రఫీ కూడా శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేయాలనుకుంది. సామాజిక స్పృహను కూడా జోడించి ఒడుపుగా నడుస్తూ వీడియో తీయించుకుంది. ఈ వీడియోను చిత్రీకరించిన యారో వెడ్డింగ్ కంపెనీ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానికి సుమారు 4 లక్షల లైక్‌లు, దాదాపు 1,500 కామెంట్లు వచ్చాయి. సుమారు 43 లక్షల మంది చూశారు. 


కొత్త పెళ్లి కూతురి సృజనాత్మకత, సామాజిక స్పృహ లక్షలాది మంది నెటిజన్లను ఆకర్షించింది. కేరళలో రోడ్ల దుస్థితి గురించి అనేక మంది సరదా వ్యాఖ్యలు చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతుంటారు. మరోవైపు కేరళ హైకోర్టు (Kerala High Court) కూడా ఇటీవల భారత జాతీయ రాజమార్గముల సంస్థ (National Highway Authority of India-NHAI)కి ఇచ్చిన ఆదేశాల్లో రోడ్లను మరమ్మతు చేయాలని తెలిపింది. 


ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువతి రోడ్ల దుస్థితిని కూడా తన వెడ్డింగ్ ఫొటో షూట్‌లో చేర్చాలని భావించినట్లు కనిపిస్తోంది. ఆమె అంతరంగం వెల్లడి కాలేదు కానీ పరిస్థితినిబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. 


ఎర్ర చీర, జాకెట్, బంగారు వడ్డాణం, ఆభరణాలు, రంగు రంగుల గాజులు ధరించి, అందంగా ముస్తాబైన యువతి పెద్ద పెద్ద గుంతల్లో నీరు నిలిచి ఉండగా, వాటిని ఒడుపుగా దాటుకుంటూ నడిచారు. ఆమె నడక, హావభావాలను ఓ వీడియోగ్రాఫర్ చిత్రీకరించారు. ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ నీటి గుంతల్లో పడిపోతామేమోననే భయంతో వారు ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు ఈ కొత్త పెళ్లి కూతురు ... జీవితంలో ఒడుదొడుకులను దాటే సత్తా తనకు ఉందని నిరూపించేందుకా? అన్నట్లు చక్కగా నడుచుకుంటూ, నీటి గుంతలను తప్పించుకుంటూ తన వెడ్డింగ్ షూట్‌ను పూర్తి చేశారు. 


కొత్త పెళ్లి కూతురు, ఆమెను చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ కనిపించే వీడియోను యారో వెడ్డింగ్ కంపెనీ (Arrow_weddingcompany) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీనిని సుమారు 43 లక్షల మంది చూశారు. దీనికి సుమారు 4 లక్షల లైక్‌లు, దాదాపు 1,500 కామెంట్లు వచ్చాయి. ఆమె సృజనాత్మకత, సామాజిక స్పృహ లక్షలాది మంది నెటిజన్లను ఆకర్షించింది.




Updated Date - 2022-09-21T17:39:11+05:30 IST