74 ఏళ్ల వయసులో ఆటో డ్రైవర్‌గా.. ఇంగ్లీషులో మాట్లాడటం చూసి మీరెవరని అనుమానంగానే ఆ యువతి అడిగితే..

ABN , First Publish Date - 2022-04-07T20:21:56+05:30 IST

ఆంగ్లంలో పలికిన తాతగారి మాటలు విని విస్తుపోయింది నిఖిత. బస్సులను, కార్లను చాకచక్యంగా తప్పిస్తూ హుషారుగానే నడుపుతున్నాడు 74 ఏళ్ళ పట్టాభి రామన్. బెంగుళూర్ రోడ్లన్నీ కొట్టిన పిండి అన్నట్టు దూకుడుతో దూసుకుపోతోంది ఆటో. అనవసరంగా అనుమానించి అతని వయసును అవమానించానే అన్న పశ్చాత్తాపంతో నిఖిత మనసు కకావికలం అయిపోయింది.

74 ఏళ్ల వయసులో ఆటో డ్రైవర్‌గా.. ఇంగ్లీషులో మాట్లాడటం చూసి మీరెవరని అనుమానంగానే ఆ యువతి అడిగితే..

"ఏమిటో ఎంత తొందరగా తెములుదామనుకున్నా ఆలస్యమైపోయాను. శాపం పెట్టినట్టు సమయానికి ఒక్క ఆటో కూడా కనిపించి చావట్లేదు. అవసరం లేనప్పుడు ఒకదానివెనకాల అరడజను ఆటో లు వచ్చి ఎక్కడికెళ్ళాలి మేడం అని ఆరా తీసి విసుగుపుట్టిస్తారు. ప్చ్ ..... " అనుకుంటూ అసహనంగా అడుగులేస్తోంది నిఖితా అయ్యర్. తనని చూసి పది గజాల దూరంలో ఆగిన ఆటో ను గమనించి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. దగ్గిరకెళ్ళి ఆటో నడిపే వ్యక్తిని చూడగానే ఆటోలో కూర్చోడానికి తటపటాయించింది. "లేచిన వేళా విశేషం ఇలా తగలడింది కామోసు.. అడుగడుగునా అడ్డంకులే ఎదురువుతున్నాయి. ఈ పండు ముదుసలి నత్తనడకలా తీసుకెళితే ..... ఏ మధ్యాహ్నమో ఆఫీస్ కి చేరుతానేమో..... .. ఐపా... " గొణుక్కుంది. "ప్లీజ్ కమ్ ఇన్ మేమ్, యూ కెన్ పే ఏజ్ పెర్ యువర్ విష్ (దయచేసి లోపల కూర్చోండి మేడం... మీరు ఎంతిచ్చినా సంతోషంగా పుచ్చుకుంటాను)" ఆంగ్లంలో పలికిన తాతగారి మాటలు విని విస్తుపోయింది నిఖిత.


బస్సులను, కార్లను చాకచక్యంగా తప్పిస్తూ హుషారుగానే నడుపుతున్నాడు 74 ఏళ్ళ పట్టాభి రామన్. బెంగుళూర్ రోడ్లన్నీ కొట్టిన పిండి అన్నట్టు దూకుడుతో దూసుకుపోతోంది ఆటో. అనవసరంగా అనుమానించి అతని వయసును అవమానించానే అన్న పశ్చాత్తాపంతో నిఖిత మనసు కకావికలం అయిపోయింది. "ఇంత వృద్ధ్యాప్యంలో ఆటో నడిపే అవసరమేమిటి? అంత అనర్గళంగా ఆంగ్లం ఎలా మాట్లాడగలుగుతున్నాడు" వంటి ప్రశ్నలు మరో పక్క నిఖితను వేధించడంతో అడగలేక ఉండలేకపోయింది. "ఊహించానమ్మా! అన్యమస్కంగా ఆలోచిస్తూ నీలో నువ్వే నలిగిపోవడం చూసి ఈ ప్రశ్న సంధిస్తావని నాకు తెలుసునమ్మా!" అని చెప్పడం ప్రారంభించాడు పట్టాభి రామన్.


"నేను ఎమ్మె, ఎంఇడి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ఏజ్ బార్ అయ్యింది కానీ నిరాశే మిగిలింది. ఎన్నో ప్రయివేట్ విద్యాసంస్థలలో ఉద్యోగావకాశాలకు ప్రయత్నించాను. ఎక్కడికెళ్లినా నీ కులమేమిటి అన్నదే ఇంటర్వ్యూ లో తొలి ప్రశ్నగా అడిగేవారు. కులం తెలుసుకున్నాకా ఏదో సాకుతో నా అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేవారు. ధరఖాస్తు చెత్తబుట్టలోకి చేరుకునేది. కుల వ్యవస్థ, సమాజం తీరూ-తెన్నూ మారదని విసిగిపోయి బొంబాయికి మకాం మార్చాను. ఒక ప్రైవేట్ విద్యాసంస్థ నా ప్రతిభను గుర్తించి 'ఇంగ్లీష్ లెక్చరర్' గా ఉద్యోగమిచ్చింది. బొంబాయి లో బెత్తెడు జీతం బారెడు ఖర్చులు. సంపాదనంతా పిల్లలను పెంచి ప్రయోజకులు చేయడానికి ఖర్చు చేశానన్న తృప్తి పదవీవిరమణ సమయానికి మిగిలింది. అవయవాలన్నీ అధీనంలో ఉన్నన్నాళ్ళు సొంత కాళ్ళ మీద బతుకు బండి ఈడుద్దామని ... బెంగళూరు కి వచ్చి 14 ఏళ్లుగా ఇలా ఆటో రిక్షా నడుపుతున్నాను. నాకు నేనే బాస్.... నేనే అసిస్టెంట్. నా ఇష్టం వచ్చిన పనివేళల్లో, దినాలలో డ్యూటీ చేస్తాను. 


నెలలో కనీసం 30 వేలు సంపాదిస్తాను. నేను నా గర్ల్ ఫ్రెండ్ (ప్రేయసి) హాయిగా గడిపేస్తున్నాము. ఇదిగో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అంటే మరేదో అనుకుంటావేమో! నేను మూడుముళ్లు ఆమె మెడలో వేసి 50 ఏళ్ళయినా, నా భార్య ని అలాగే సంబోధిస్తాను. ఊపిరి ఉన్నన్నాళ్ళు ఆమెను అట్లాగే ప్రేమిస్తాను. నేను మగాడిని అని సంపాదిస్తున్నానని అజమాయిషీ చేయను. భార్యాభర్తలు ఇద్దరూ సమానమే కదా! సింగిల్ బెడ్ రూమింట్లో సింపుల్ గా సరదాగా సాఫీగా సమయం సాగిపోతోంది.  పిల్లలు ఇదే ఊర్లో ఉంటున్నారు. పండక్కి-పబ్బానికి వచ్చి ఆత్మీయంగా మాతో గడిపివెళతారు. అడగపోయినా, వద్దన్నా వాళ్ళకి కలిగినంత  డబ్బు ఇచ్చి వెళుతూంటారు. ఒకరికొకరు బరువు-భారం కాకుండా వాళ్ళూ సంతోషంగా ఉన్నారు... మేమూ అంతే ఆనందంగా ఉన్నాము"  నా పుట్టుక గూర్చి గానీ జీవితం మీద కానీ ఎటువంటి  ఫిర్యాదు లేదు. పశ్చాత్తాపం అంతకన్నా లేదు. ఇంకేం కావాలీ జీవితానికి ...." అని ముగిస్తూ రేర్ వ్యూ మిర్రర్ లో నిఖిత మొహం చూశాడు. ఆమె మాస్క్ కూడా కప్పలేని ముఖకవళికలు, వేసుకున్న మాస్క్ దాయలేని మనోవేదన నిఖిత మోహంలో కనిపించాయతనికి.


కళ్ళంట కారుతున్న నీటి ధారలను తుడుచుకోడానికి ప్రయత్నిస్తూ, ఏదో చెబుదామనుకుంది నిఖిత. బరువెక్కిన హృదయం మాట పెగల నీయలేదు. డబ్బులిస్తూ కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసి వేదనతో వీడ్కోలు పలికి దిగిపోయింది నిఖితా అయ్యర్. బెంగళూరు లో జంబోటైల్ అనే సంస్థలో నిఖితా అయ్యర్ పనిచేస్తున్నారు. మిథునం లోని అప్పదాసు-అప్పదాసు, బుచ్చిలక్ష్మి వంటి దంపతులు నిజజీవితంలో పట్టాభిరామన్ రూపంలో ఎంతో మంది కనబడతారు. ఇంచుమించు ప్రతీ ఇంటా ఉంటారు. 60 ఏళ్ళు నిండిన వారిని వృద్ధులుగా, 70లు దాటితే పండు ముదుసలి గానూ అసమర్థులుగానూ జమకట్టడాన్ని మానుకోవాలి ఈ సమాజం. ఆనందం, ఆర్జన, ఆలోచనలు, అనుభూతులు వంటివి మనసుకు సంబంధించిన విషయాలు. వయస్సుతో సంబంధం లేదు.


- సునీల్ ధవళ

Read more