Big Ticket: రూ.66.50కోట్లు గెలుచున్న భారత వ్యక్తి.. తీరా లాటరీ నిర్వాహకులు కాల్ చేయగా అతడి ఫోన్ స్విచ్చాఫ్..
ABN , First Publish Date - 2022-12-04T09:28:43+05:30 IST
అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో (Abu Dhabi Big Ticket Raffle) భారత వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది.
అబుదాబి: అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో (Abu Dhabi Big Ticket Raffle) భారత వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. శనివారం సాయంత్రం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో (Abu Dhabi International Airport) తీసిన లాటరీ డ్రాలో షార్జాలో (Sharjah) ఉండే భారత ప్రవాసుడు ఏకంగా 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 66.50కోట్లు. తీరా లాటరీ నిర్వాహకులు అతనికి కాల్ చేసి ఈ విషయం చెబుదామనుకుంటే ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షార్జాలో ఉండే భారత ప్రవాసుడు కథార్ హుస్సేన్ (Kathar Hussain) నవంబర్ 6వ తేదీన 246 సిరీస్‌లో 206975 నంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ ద్వారా కొన్నాడు. ఇంకో విషయం ఏంటంటే 2 టికెట్లు కొంటే.. ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ (2+1 free offer) సందర్భంగా కథార్ ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.
ఇక్కడే అతనికి అదృష్టం కలిసొచ్చింది. కథార్‌కి ఫ్రీగా వచ్చిన టికెట్‌కే (నం.206975) ఈ జాక్‌పాట్ తగలడం విశేషం. ఇక డ్రాలో విజేతగా నిలిచిన భారతీయుడికి షో హోస్ట్ రిచర్డ్ ఫోన్ చేశారు. కానీ, ఆ సమయంలో అతడి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దాంతో ఇతర మార్గాల్లో కథార్‌కి ఈ విషయాన్ని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఇప్పటివరకు బిగ్ టికెట్ 100కు పైగా నగదు బహుమతులను అందించింది. అలాగే ఈ నెల గ్రాండ్ ప్రైజ్ మనీ కంటే వచ్చే నెల 3న నిర్వహించే బిగ్ టిక్కెట్‌కు ఎక్కువ నగదు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ డ్రాలో విజేతగా నిలిచిన వారికి ఏకంగా 35 మిలియన్ల దిర్హమ్స్ ఇస్తారట.