NRI: రికార్డ్ బ్రేక్.. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ప్రవాసుల నుంచి భారత్‌కు భారీ ఆదాయం
ABN , First Publish Date - 2022-12-02T09:46:51+05:30 IST
ఇంతకుముందెన్నడూ లేని విధంగా ప్రవాసుల (Expats) నుంచి భారత్‌కు 2022లో భారీ ఆదాయం సమకూరింది.
ఎన్నారై డెస్క్: ఇంతకుముందెన్నడూ లేని విధంగా ప్రవాసుల (Expats) నుంచి భారత్‌కు 2022లో భారీ ఆదాయం సమకూరింది. ప్రవాస భారతీయులు (Indians) ఈ ఏడాది రికార్డు స్థాయిలో స్వదేశానికి డబ్బును పంపారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రవాసుల ద్వారా మన దేశానికి అందే మొత్తం100 బిలియన్ డాలర్లకు(రూ. 8లక్షల కోట్లు) చేరుతుందని ప్రపంచ బ్యాంక్ (World Bank) వెల్లడించింది. ఇక మొత్తంగా 2022లో ప్రపంచవ్యాప్తంగా వలసదారులు స్వదేశానికి పంపిన డబ్బు మొత్తం 5శాతం మేర పెరిగింది. అమెరికాతో (America) పాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో వేతనాల పెరుగుదల, బలమైన కార్మిక మార్కెట్లే ఈ యేటా ప్రవాసుల నుంచి స్వదేశానికి రెమిటెన్స్‌లు (Remittances) భారీగా పెరగడానికి ప్రధాన కారణమని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.
కాగా, విదేశీ మారకం నిల్వల నిర్వహణలో ప్రవాసులు పంపే ఈ డబ్బే కీలకం అనే విషయం తెలిసిందే. అలాగే ఎగుమతి, దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది. ఇదిలాఉంటే.. ఇటీవలి కాలంలో చాలా మంది భారతీయులు యూఎస్, యూకే, సింగపూర్ వంటి అధిక ఆదాయ దేశాలలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలకు మారారు. దాంతో వారు ఇంటికి ఎక్కువ డబ్బు పంపడానికి వీలు ఏర్పడింది. దీంతో ఆటోమెటిక్‌గా ఈ ఏడాది మనోళ్లు భారీ మొత్తం స్వదేశానికి పంపించడం జరిగింది. ఇక ఈ చెల్లింపులు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (Gross Domestic Product)లో దాదాపు 3శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని నిర్ధారించే అంశం. అయితే, వచ్చే ఏడాది మాత్రం ఈ స్థాయిలో ప్రవాసుల ఆదాయం ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు, నెమ్మదిస్తున్న ఆర్థిక వృద్ధి కారణంగా 2023 మరింత సవాలుగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.