FIFA World Cup: ఖతర్ కీర్తికిరీటంగా ‘ఫిఫా’

ABN , First Publish Date - 2022-11-30T07:58:25+05:30 IST

క్రీడలు, కళలు కూడ ఒక దేశ ప్రతిష్ఠను పెంపొందించడానికి విశేషంగా తోడ్పడుతాయి.

FIFA World Cup: ఖతర్ కీర్తికిరీటంగా ‘ఫిఫా’

క్రీడలు, కళలు కూడ ఒక దేశ ప్రతిష్ఠను పెంపొందించడానికి విశేషంగా తోడ్పడుతాయి. గల్ఫ్ కూటమిలో చిన్న దేశమైన ఖతర్ అత్యంత సమర్థంగా నిర్వహిస్తోన్న ప్రపంచ ఫుట్ బాల్ కప్ పోటీలను చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. క్రికెట్ కంటే అమితంగా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన క్రీడగా ఉన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీలను ఇప్పటి వరకు చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఖతర్ నిర్వహిస్తోంది.

ప్రపంచ ఫుట్ బాల్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ పోటీలను నిర్వహించిన ఇతర దేశాలకు, ఖతర్ కు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నది. ఇప్పటి వరకు ప్రపంచ కప్ పోటీలకు పెద్ద మొత్తంలో వెచ్చించిన దేశం బ్రెజిల్. 2014లో బ్రెజిల్ 19 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా ఖతర్ మొత్తంగా 300 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చిస్తోంది. క్రీడా పోటీల నిర్వహణకు ఈ స్థాయిలో భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్న దేశంగా అనితర సాధ్యమైన ఖ్యాతిని ఖతర్ సొంతం చేసుకొంది. ఎడారిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వాతావరణ పరిస్థితులకు తోడుగా ఇస్లాం సాంఘిక ఆచార వ్యవహారాలు ప్రగాఢంగా ఉండే రాచరిక దేశం ఖతర్. ప్రపంచ కప్ పోటీలను నిర్వహించడానికి ముందుకు వచ్చిన ఈ పన్నెండేళ్ల కాలంలో సవాలక్ష సవాళ్ళను ఎదుర్కొంది. ఖతర్ లో పాలన విధానాల తీరుతెన్నులు, ప్రత్యేకించి మానవ హక్కుల పరిస్థితి గురించి పాశ్చాత్య దేశాల సమాచార, ప్రసార సాధనాలు పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువరించాయి.

గల్ఫ్ దేశాలు అన్నింటిలోనూ సామగ్రి రవాణాకై రోడ్డు రవాణా వ్యవస్థ అత్యంత కీలకం. పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లు ఈ విషయంలో ఖతర్ పై ఆంక్షలు విధించి దిగ్బంధం చేశాయి. అయినా ఖతర్ చెక్కుచెదరకుండా ఈ సవాళ్ళని అధిగమించి ఫుట్బాల్ కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ క్రీడాభిమానుల హృదయాలను ఖతర్ విశేషంగా గెలుచుకుందనడంలో సందేహం లేదు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ తో సహా అనేక మంది దేశాధినేతల సమక్షంలో రాజు శేఖ్ తమీం బిన్ హామద్ అల్ తానీ ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రవక్త మహమ్మద్ పై బిజెపి ప్రతినిధి వ్యాఖ్యల అనంతరం ఏర్పడ్డ దౌత్య సంక్షోభం, గూఢచర్యం ఆరోపణలపై కొంత మంది భారతీయుల నిర్బంధం, వివాదస్పద మతప్రచారకుడు జాకీర్ నాయక్ కూడా పోటీలకు రావడం మొదలైన ప్రతికూల అంశాల నేపథ్యంలో భారత ఉప రాష్ట్రపతి ఈ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనడం అశ్చర్యకరం.

ఫుట్ బాల్ చరిత్రలో తన పేరు చిరస్మరణీయంగా ఉండే విధంగా ఖతర్ ప్రతి వినూత్న చర్యకు నిధులు సమృద్ధిగా కేటాయించింది. ప్రపంచ క్రీడా చరిత్రలో ప్రప్రథమంగా యస్.ఏ.ఓ. అనే అత్యాధునిక కెమేరా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. ఒక్కొక్క క్రీడాకారుడి 29 రకాల శారీరక కదలికలను 12 కెమేరాల ద్వారా నిక్షిప్తం చేయడంతో పాటు బంతిపై హై లెవల్ సెన్సార్ ను అమర్చడం ద్వారా ఫిఫాలో పారదర్శకతకు అగ్ర ప్రాధాన్యమిచ్చింది. స్టేడియంలలో ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రారంభోత్సవ పోటీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఖరీదైన అత్తరుతో పాటు ఇతర కానుకలనూ బహుకరించారు.

ప్రపంచాన్ని ఆకర్షించే క్రమంలో ఖతర్ తన అస్తిత్వ మూలాలను మరిచిపోలేదు. చమురు సంపదను కనుగొనడానికి పూర్వం ఎడారులలో అరబ్బు తెగలు కొనసాగించిన జీవన విధానం స్టేడియంలలో ప్రతిబింబించే విధంగా ప్రాధాన్యమిచ్చింది. అల్ బేత్ స్టేడియంలో పోటీలను లాంఛనంగా ప్రారంభించగా, ఈ స్టేడియాన్ని సంప్రదాయ అరబ్బు సంస్కృతి ప్రతిబింబించే విధంగా నిర్మించారు. చమురు సిరులు వర్షించక ముందు అరబ్బు తెగలు ఎడారులలో గుడారాలు వేసుకుని జీవించేవారు. పెట్రో సంపదకు పూర్వం తమ ఎడారి గుడారాల జీవన విధాన సంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా అల్ బేత్ స్టేడియాన్ని నిర్మించారు. అన్ని గల్ఫ్ దేశాలలో సామాజిక, పాలనా వ్యవహారాలకు ఇస్లామిక్ ధర్మాలే మూలాధారాలు. అందుకే ఖతర్ కూడ క్రీడా పోటీలను వీలయినంతగా ఇస్లామీకరణ చేసింది. తద్వారా అరబ్బు ప్రపంచంలో తన ప్రాబల్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించింది. పూర్తిగా అంగవైకల్యం ఉన్న ఘానం అల్ ముఫ్తా అనే యువకుడు పవిత్ర ఖురాన్ ను పఠించడం, విలక్షణ అమెరికన్ నటుడు మోర్గన్ ఫ్రీమాన్ దాని అర్థాన్ని తెలుసుకునే సంభాషణతో ఈ పోటీలు మొదలయ్యాయి. అదే పోటీలలో క్రైస్తవ ఆచారాల ప్రకారం బ్రిటన్ జట్టు క్రూసేడర్ వేషధారణను మాత్రం ఖతర్ అడ్డుకుంది.

28 రోజుల కొరకు తాము తమ ధార్మికాచారాలను మార్చుకోలేమంటూ ఖతర్ ప్రభుత్వం ప్రకటించడం అరబ్బు ప్రపంచంలో తన స్ధానాన్ని పదిలపర్చుకోవడమని చెప్పవచ్చు. స్టేడియంల వద్ద మద్యపానీయాల విక్రయాన్ని ఖతర్ ప్రభుత్వం అనుమతించలేదు. అలాగని ఇస్లాం ధార్మికాచారాలకు భిన్నంగా ఉన్న ఇతర డిమాండ్లకు కూడ అంగీకరించలేదు. దీంతో సరళీకృత సంఘజీవనానికి తోడుగా వినోదభరిత వైవిధ్యం కొరకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాభిమానులలో అనేకులు దుబాయిలోని హోటళ్ళలో బస చేస్తూ ఖతర్ కు రాకపోకలు కొనసాగిస్తున్నారు. పోటీల నిర్వహణలో స్ధానికంగా ఉంటున్న భారత ప్రవాసులు అందరూ ఔత్సాహికంగా పాల్గొంటున్నారు. విశాఖపట్టణానికి చెందిన భాగవతుల వెంకప్పతో సహా 20 మంది తెలుగు ప్రవాసులు వాలంటీర్లుగా ఉన్నారు. చిన్న దేశమైన ఖతర్ భద్రతా బలగాలకు మద్దతుగా పాకిస్తాన్ సైన్యం వచ్చి సహాయపడుతోంది. ఇంతకూ ఖతర్ జనాభా తెలంగాణలోని ములుగు జిల్లా జనాభాతో సమానంగా ఉంటుంది. భౌగోళిక వైశాల్యంలో ఈ గల్ఫ్ దేశం, ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాతో సమస్థాయిలో ఉంటుంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-11-30T08:00:31+05:30 IST