UAE: అరబ్ దేశానికి పొటెత్తిన విదేశీయులు.. ఇసుక వేస్తే రాలనంత జనం.. అత్యధికంగా భారతీయులే..

ABN , First Publish Date - 2022-11-29T12:25:18+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) విమానాశ్రయాలన్ని కూడా ప్రస్తుతం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

UAE: అరబ్ దేశానికి పొటెత్తిన విదేశీయులు.. ఇసుక వేస్తే రాలనంత జనం.. అత్యధికంగా భారతీయులే..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) విమానాశ్రయాలన్ని కూడా ప్రస్తుతం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దేశ రాజధాని అబుదాబిలోని ఐదు ఎయిర్‌పోర్టులలో అయితే ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారట. దీనికి కారణం ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) కోసం ఇతర దేశాల నుంచి తరలివస్తున్న అభిమానులు, హలీడేస్ ఎంజాయ్ చేయడానికి భారీ సంఖ్యలో వచ్చిన పర్యాటకులు. ఇక ఇటీవల యూఏఈ కరోనా ఆంక్షలన్నింటినీ తొలగించడంతో ఇలా భారీ సంఖ్యలో విదేశీయులు ఆ దేశానికి క్యూ కట్టారు. ప్రస్తుతం యూఏఈలోని విమానాశ్రయాల్లో వరల్డ్ కప్ కోసం ఖతార్ వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారట. దీంతో ప్రతిరోజూ భారీ క్యూలైన్స్ ఏర్పడుతున్నాయని విమానయాన శాఖ వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి వరకు అబుదాబిలోని ఐదు ఎయిర్‌పోర్టుల ద్వారా కనీసం ఒకటిన్నర మిలియన్ల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది.

ఇక ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి యూఏఈ విమానాశ్రయాల ద్వారా అత్యధికంగా రాకపోకలు కొనసాగించింది మాత్రం భారతీయ ప్రయాణికులే. ఈ తొమ్మిది నెలల వ్యవధిలో భారత్ నుంచి యూఏఈకి ఏకంగా 9,33,640 మంది ప్రయాణించారు. ఇండియా తర్వాత టాప్-5లో యూకే (2,91,576), పాకిస్థాన్ (2,65,793), సౌదీ అరేబియా (2,17,656), ఈజిప్ట్ (1,97,193) ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు భారత్‌లోని ముంబై, ఢిల్లీ, కొచ్చి ఎయిర్‌పోర్టులు కూడా ప్రయాణికుల రద్దీని ఎదుర్కొన్నాయి. ఇక కోవిడ్-19 కారణంగా దాదాపు రెండున్నరేళ్లు అన్ని సెక్టార్ల మాదిరిగానే విమానయాన రంగం కూడా తీవ్ర నష్టాలు చవిచూసింది. ఇప్పుడిప్పుడే ఈ సెక్టార్ కోలుకోవడంతో కరోనాకు ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో చాలా వరకు ప్రపంచ దేశాలు అన్ని ప్రయాణ ఆంక్షలను తొలగించడం విమానయాన రంగానికి ఊతం ఇచ్చింది. దాంతో విదేశీ టూర్లు జోరు అందుకున్నాయి. రెండేళ్ల పాటు విదేశీ పర్యాటనలకు దూరమైన జనాలు ఇప్పుడు వరుసగా విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు.

Updated Date - 2022-11-29T12:38:34+05:30 IST