UAE: యూఏఈలో ప్రవాసుల రిటైర్మెంట్ వయసెంతో తెలుసా? అక్కడి చట్టాలు ఏం చెబుతున్నాయంటే..!

ABN , First Publish Date - 2022-11-16T11:42:58+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (United Arab Emirates) ప్రతియేటా భారీ సంఖ్యలో వలసదారులు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇప్పటికే అక్కడ ఏళ్లతరబడి పనిచేస్తున్న ప్రవాస కార్మికులు భారీ మొత్తంలో ఉన్నారు.

UAE: యూఏఈలో ప్రవాసుల రిటైర్మెంట్ వయసెంతో తెలుసా? అక్కడి చట్టాలు ఏం చెబుతున్నాయంటే..!

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (United Arab Emirates) ప్రతియేటా భారీ సంఖ్యలో వలసదారులు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇప్పటికే అక్కడ ఏళ్లతరబడి పనిచేస్తున్న ప్రవాస కార్మికులు భారీ మొత్తంలో ఉన్నారు. అయితే, ఇలా యూఏఈ (UAE)లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రవాసీయులకు అక్కడ ఎంతకాలం పని కొనసాగించవచ్చో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. దీనిలో భాగంగానే మీరు పదవీ విరమణ చేయవలసిన వయస్సు ఏదైనా ఉందా? అలా అయితే, మీరు రిటైర్మెంట్ తర్వాత మీ కుటుంబంతో యూఏఈలో నివాసం ఉండే అవకాశం ఉంటుందా? ఆ దేశంలో విదేశీ కార్మికులు పదవీ విరమణ చేసిన తర్వాత వారి స్థితికి సంబంధించి అక్కడి లేబర్ మరియు ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఏమి చెబుతున్నాయి? అనే విషయాలను ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం.

హెచ్‌పీఎల్ యమలోవా(HPL Yamalova) అండ్ ప్లెవ్కా డీఎంసీసీ (Plewka DMCC) వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ భాగస్వామి అయిన దుబాయ్‌కి (Dubai) చెందిన న్యాయవాది లుడ్మిలా యమలోవా (Ludmila Yamalova) చెప్పిన దాని ప్రకారం, యూఏఈ కార్మిక చట్టం - ఫెడరల్ డిక్రీ-లా నం. 33 ఆఫ్ 2021 అసలు విదేశీ కార్మికుల అధికారిక పదవీ విరమణ వయస్సును పేర్కొనలేదని ఆమె స్పష్టం చేశారు. ఇక 60 ఏళ్లు పైబడిన విదేశీయులకు గతంలో యూఏఈలో పని చేసేందుకు అనుమతి ఉండేదని, ప్రస్తుతం అది అలాగే కొనసాగుతుందని ఆమె తెలిపారు. అలాగే అక్కడ సొంత వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వలసదారులకు కూడా రెసిడెన్సీ విషయమై ఎలాంటి వయసు సంబంధిత పరిమితులు లేవన్నారు. అయితే, కొన్ని పరిశ్రమలు లేదా కంపెనీలు పదవీ విరమణకు సంబంధించి వారి సొంత అంతర్గత విధానాలను కలిగి ఉండవచ్చని తెలిపారు. కానీ, ఇవి చట్టానుసారం మాత్రం తప్పనిసరి కాదు అని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆమె 1989లోని మునుపటి లేబర్ చట్టం(మినిస్టీరియల్ రిజల్యూషన్ 52, ఆర్టికల్ 3, క్లాజ్ సి) ప్రకారం యూఏఈలో ప్రవాసుల పదవీ విరమణ వయస్సు 60 అని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, మునుపటి చట్టంలో కూడా ఈ వయోపరిమితి కంటే కూడా నైపుణ్యం కలిగిన వలస ఉద్యోగులకు మినహాయింపులు ఇవ్వబడ్డాయని న్యాయవాది లుడ్మిలా యమలోవా తెలిపారు.

Updated Date - 2022-11-16T11:43:00+05:30 IST